చిగురుటాకులా.. నూరేళ్ల ఆయుష్షు 

26 Jul, 2019 08:50 IST|Sakshi
గిరిజన విద్యార్థి నాని నివాసం

చిన్ననాటి నుంచే మెడపై గడ్డ

ఆపరేషన్‌ చేద్దామంటే ఆయుష్షుకు గ్యారెంటీ లేదు

కార్పొరేట్‌ వైద్యానికి కాసుల్లేవు 

చదువుకోవాలని ఉన్నా సహకరించని ఆరోగ్యం 

ఆపన్నులు ఆదుకోవాలని వినతి

ఆడే పాడే వయస్సు.. చలాకీగా గడపాల్సిన ప్రాయం.. బడికిపోదామంటే భయం భయం.. చేయి కదపలేడు.. రాత రాయలేడు.. ఆడుకుందామంటే ఆందోళన.. తనకేమవుతుందోననే భయం.. పురిటి బిడ్డగా ఉన్నప్పుడే మెడపై ఏర్పడిన గడ్డ (న్యూరల్‌ ట్యూబ్‌ డిఫెక్ట్‌)అతన్ని కదలనీయకుండా చేస్తోంది. చేయి కదిలిస్తే నొప్పితో నరకయాతన. ప్రాణం పోయేంత బాధ. చీపురు పుల్ల తగిలినా గిలగిలా కొట్టుకుంటాడు.  వైద్యులు మాత్రం ఆపరేషన్‌ చేసినా ఆయుష్షుకు గ్యారెంటీ లేదంటున్నారు. వైద్యం చేయించలేని నిరుపేద తల్లిదండ్రుల స్తోమత. కంటికి రెప్పలా కాపాడుకోకపోతే తమ బిడ్డ బతకడేమోనన్న మానసిక వేదన. వెరసి పదిహేనేళ్లుగా ఓ గిరిజన విద్యార్థి బతుకు దినదినగండంలా మారింది. నాయుడుపేట మండలం శ్రీనివాసపురం గిరిజన కాలనీకి చెందిన నాని నరకయాతన చూస్తే ఎవరైనా కన్నీరు పెడతారు.  

సాక్షి, నాయుడుపేట: నాయుడుపేట మండల పరిధిలోని జువ్వలపాళెం పంచాయతీ శ్రీనివాసపురం గిరిజనకాలనీకి చెందిన సత్యేటి వెంకటరమణయ్య – మరియమ్మలకు ముగ్గురు కుమారులు. తొలి సంతానం సత్తేటి నాని. నానికి పురిటి బిడ్డగా ఉన్న సమయంలోనే మెడపై గుండ్రని కణిత ఏర్పడింది. అప్పట్లో వైద్యులు గడ్డను చూసి ఆపరేషన్‌ చేస్తే బిడ్డకు ప్రమాదమని చెప్పారు. చేసేదేమీ లేక ఆ తల్లిదండ్రులు మిన్నకుండిపోయారు. నానిని స్వగ్రామమైన జువ్వలపాళెం ప్రాథమికోన్నత పాఠశాలలో 8వ తరగతి వరకు చదివించారు. 9వ తరగతిలో చేరేందుకు సమీప పాఠశాలల్లో చేరాలన్న ప్రయత్నంలో ఉన్నారు. వసతి గృహంలో చేరాలంటే కణితకు చీపురపుల్ల తగిలినా గిలగిలకొట్టుకుంటూ పడిపోతాడు. ఈ అనారోగ్య కారణంతో వసతి గృహాల్లో చేర్చలేక దూరంగా చదివించలేక తల్లిదండ్రులే భారం మోస్తున్నారు.

సమీప పాఠశాలలో చదివించుకుంటూ సాయంత్రానికి ఇంటికి వచ్చేలా తమ బిడ్డను కంటికిరెప్పలా కాపాడుకుంటున్నారు. సెంటు భూమి లేని ఈ గిరిజన కుటుంబం కార్పొరేట్‌ వైద్యం అందించలేని పరిస్థితిలో ఉంది. కార్పొరేట్‌ వైద్యం అందించాలంటే పెద్ద మొత్తంలో నగదు చెల్లించుకోవాల్సి ఉంది. అంత స్తోమత లేని ఈ కుటుంబం ప్రభుత్వ వైద్యశాలల్లో మెడపై ఉన్న కణితను చూపుతూ ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన సలహాల మేరకు 15 ఏళ్లుగా కాలం వెల్లదీస్తూ వచ్చారు. ఈ క్రమంలో 9వ తరగతిలో చేరాలంటే దూర ప్రాంతాల్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. బిడ్డను అలా చేర్పిస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందేమోనని మదనపడుతూ పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇంటి వద్దనే ఉంచారు. 

చేయూతనివ్వని గత ప్రభుత్వాలు
పదేళ్లుగా ప్రభుత్వాల నుంచి వారు ఆర్థికసాయం కోసం ఎదురుచూస్తున్నారు. మెడపై గడ్డ కారణంగా కుడిచేయి పైకి లేపలేకపోవడంతోపాటు రోజురోజుకూ చేయి సన్నగిల్లుతోంది. దీని కారణంగా మానసిక ధైర్యాన్ని కోల్పోతున్న ఆ విద్యార్థికి సదరం క్యాంపులో ఫిజికల్‌ హ్యాండీ క్యాప్‌డ్‌ సర్టిఫికెట్‌ మంజూరు చేయకపోవడంతో ప్రభుత్వం నుంచి అందే పెన్షన్‌ కూడా అందడం లేదు. చేయి కదపలేక, పనిచేసుకోలేక, రాయలేని స్థితిలో ఉన్న విద్యార్థికి వైద్యశాఖ అధికారులు సర్టిఫికెట్‌ మంజూరు చేయకపోవడం బాధాకరమని ఆ గిరిజన కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఈ విద్యార్థికి కొత్తగా బాధ్యతలు చేపట్టిన జిల్లా ఉన్నతాధికారులైనా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. 


నాని మెడపై ఉన్న గడ్డ, చేయి కదపలేని పరిస్థితిలో నాని  

గడ్డ పెరిగే కొద్ది భయమేస్తుంది 
పురిటి బిడ్డ నుంచే ఉన్న చిన్నపాటి కణిత రోజురోజుకూ పెరుగుతోంది. పెరిగే కొద్ది భయమేస్తోంది. కొంతమంది వైద్యులు ఆపరేషన్‌ చేస్తే ప్రమాదమని చెబుతున్నారు. మరికొంతమంది వైద్యులు సాంకేతిక పరిజ్ఞానంతో కణితను తీసి మామూలు మనిషిని చేస్తారని చెబుతున్నారు. ఉన్న ముగ్గురు బిడ్డలను పోషించేందుకే మా జీవితం సరిపోతోంది. పెద్ద పెద్ద ఆస్పత్రుల్లో డబ్బు పెట్టాలంటే మాకు స్థోమత లేదు. ప్రభుత్వ వైద్యులు మాకు ఎలాంటి సలహాలు ఇవ్వడం లేదు. – సత్తేటి మణెమ్మ, నాని తల్లి

చదువుకోవాలని ఉంది 
నాకు చదువుకోవాలని ఉంది. మంచి చదువులు చదివి అమ్మానాన్నలకు మంచి పేరు తీసుకురావాలని అనుకుంటున్నా. కానీ నా మెడపై పెరుగుతున్న గడ్డ కారణంగా రాత్రి పడుకున్న సమయంలో నొప్పికి అల్లాడిపోతున్నా. పాఠశాలకు వెళ్లిన సమయంలో స్నేహితులతో కలిసి ఆటలాడలేకున్నా. చదువుపై దృష్టి పెట్టాలంటే ఆరోగ్యం సహకరించడం లేదు. 
– సత్తేటి నాని, విద్యార్థి 

మరిన్ని వార్తలు