ఆకాశహార్మ్యాల నిర్మాణానికి అమరావతి అనువైన ప్రాంతం కాదు

17 Jan, 2020 10:05 IST|Sakshi

ఎన్‌డీఎంఏ–ఐఐఐటీ(హైదరాబాద్‌) అధ్యయన నివేదిక స్పష్టీకరణ

విజయవాడ చుట్టూ లోపభూయిష్టంగా భూమి పొరలు

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతం భారీ ఆకాశహార్మ్యాల నిర్మాణానికి ఏమాత్రం అనువైన ప్రాంతం కాదా? ఇళ్ల నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోకపోతే పెను ప్రమాదం తప్పదా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతోంది నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ(ఎన్‌డీఎంఏ), ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐఐఐటీ)–హైదరాబాద్‌ అధ్యయన నివేదిక. విజయవాడ చుట్టూ 150 చదరపు కిలోమీటర్ల పరిధిలో భూమి అడుగున నియో టెక్టానిక్‌ పొరల్లో 26 చోట్ల లోపభూయిష్టంగా(ఫాల్ట్‌ జోన్స్‌) ఉండటం.. ఈ పొరల్లో కంపనాల తీవ్రత 9–10 హెర్జ్‌లు ఉంటుందని తేల్చింది. అందుకే అమరావతి ప్రాంతంలో 50 అంతస్థుల ఆకాశహార్మ్యాల నిర్మాణం చేపట్టడం శ్రేయస్కరం కాదని స్పష్టం చేసింది. దేశంలో 50 నగరాల్లో ప్రస్తుత పరిస్థితి, విపత్తులను అధిగమించడానికి చేపట్టాల్సిన చర్యలపై ఎన్‌డీఎంఏ– ఐఐఐటీ(హైదరాబాద్‌) సంయుక్తంగా అధ్యయనం చేశాయి.

అధ్యయనంలో వెల్లడైన అంశాలు  

  •  కృష్ణా నది ఒడ్డున ఉన్న సముద్ర మట్టానికి 39 అడుగుల ఎత్తులో విజయవాడ నగరం ఉంది. విజయవాడ చుట్టూ 150 చదరపు కిలోమీటర్ల పరిధిలో భూమి అడుగున లోపభూయిష్టమైన నియో టెక్టానిక్‌ ప్లేట్లు విస్తరించి ఉన్నాయి. ఆ ప్రాంతం తేలికపాటి నేల స్వభావం కలిగి ఉంది.  
  •  గుణదల, మంగళగిరి, మందడం, నిడమర్రు, తాడేపల్లి, నున్న ప్రాంతాల్లో భూగర్భం అడుగున పొరల్లో ఫాల్ట్‌ జోన్స్‌ ఉండటం అత్యంత ప్రమాదకరం. భూగర్భంలో నియో టెక్టానిక్‌ ప్లేట్స్‌ కంపనాల తీవ్రత 9–10 హెర్జ్‌లుగా ఉంది. ఈ ప్రాంతాల్లో జీ+1 విధానంలో భవనాలు నిర్మించడం శ్రేయస్కరం కాదు.  
  •  అమరావతి ప్రాంతంలో ఆకాశహార్మ్యాల నిర్మాణాలు నిలువరించాలి.
  •  బోర్ల తవ్వకాలను నియంత్రించాలి.  
  •  భవనాల నిర్మాణంపై స్థానిక సంస్థలు, బిల్డర్లకు అవగాహన కల్పించాలి.  
  •  డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ప్రణాళికను కార్యాచరణలోకి తీసుకురావాలి.   
మరిన్ని వార్తలు