'తొలిగా నక్సల్స్పై నిషేధం విధించిన నేదురుమల్లి'

9 May, 2014 08:54 IST|Sakshi
'తొలిగా నక్సల్స్పై నిషేధం విధించిన నేదురుమల్లి'

హైదరాబాద్ : నేదురుమల్లి జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తొలిసారిగా నక్సలైట్లపై నిషేధం విధించారు. 1992 మేలో నక్సల్స్‌పై నిషేధం విధిస్తూ ఆయన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో నేదురుమల్లి నక్సలైట్ల హిట్‌లిస్ట్‌లో చేరారు. సెప్టెంబర్‌ 7 2007లో జనార్ధనరెడ్డి ప్రయాణిస్తున్న కారును పేల్చివేసేందుకు నక్సల్స్‌ ప్రయత్నించారు. ఈ ఘటనలో నేదురుమల్లి, ఆయన సతీమణి రాజ్యలక్ష్మి నుంచి తృటిలో ప్రాణాపాయంతో బయటపడగా, ముగ్గురు కార్యకర్తలు మరణించారు. 2003లోనూ ఇదే తరహా దాడి నుంచి ఆయన తప్పించుకున్నారు.

నేదురుమల్లి జనార్ధనరెడ్డి 1935 ఫిబ్రవరి 20న పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడులో  జన్మించారు. నెల్లూరులో బీఏ, బీఈడీ చదివారు. 1962 మే 25న రాజ్యలక్ష్మితో ఆయన వివాహం జరిగింది. వారికి నలుగురు కుమారులు. నేదురమల్లి రాజ్యలక్ష్మి సైతం 2004లో వైఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. రాజకీయాల్లో ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించిన నేదురుమల్లి రాజకీయ ప్రస్థానం 1972లో ప్రారంభమైంది.

రాజ్యసభ సభ్యుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన ఆరేళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత పీసీసీ సెక్రటరీగా పనిచేశారు. 1978లో శాసనసభకు పోటీచేసిన నేదురుమల్లి... మంత్రివర్గంలో స్థానం పొందారు. ఆ తర్వాత 1988లో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1989లో జరిగిన ఎన్నికల్లో మరోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.

చెన్నారెడ్డి అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జనార్ధనరెడ్డి...  దాదాపు రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు. 1998, 99లో మరోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ సమయంలో పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా పనిచేశారు. 1999 నుంచి మూడేళ్లపాటు అతి ముఖ్యమైన పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.

2004లో విశాఖ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో రిజర్వ్‌డ్‌గా ఉన్న నెల్లూరు లోక్‌సభ జనరల్‌గా మారడంతో... పోటీచేయాలని భావించినా ఆయనకు సీటు లభించలేదు. ఫలితంగా మరోసారి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

మరిన్ని వార్తలు