ఆదుకునే హస్తం కోసం..!

13 Jan, 2014 03:40 IST|Sakshi
ఆదుకునే హస్తం కోసం..!

 అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి  సాయం కోరుతున్న పేద తండ్రి
 సాక్షి, హైదరాబాద్: అరుదైన వ్యాధితో పేద కుటుంబంలో జన్మించిన ఒక చిన్నారి ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది. సికింద్రాబాద్ మాణికేశ్వర్‌నగర్ వడ్డెరబస్తీకి చెందిన సైదులు, సుజాత నలుగురు కుమార్తెల్లో మూడవ అమ్మాయి సాయినీ (8). పుట్టుకతోనే మెదడుకు సంబంధించిన హైడ్రో సెఫాలస్ అనే వ్యాధి బారిన పడింది. మెదడులో తయారైన సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ (సీఎస్‌ఎఫ్) అనే ద్రవం చిన్న నాళం ద్వారా వెన్నుపూసలోకి చేరి అక్కడినుంచి రక్తంలో కలిసిపోవాల్సి ఉంటుంది. అయితే సాయినీలో ఆ నాళం మూసుకుపోవడంతో ఆ ద్రవం మెదడులోనే విస్తరిస్తోంది. దాంతో మెదడు పరిమాణం నానాటికీ పెరిగిపోతుంది. వైద్యపరిభాషలో హైడ్రో సెఫాలస్ అని పిలిచే ఈ వ్యాధిని సాయినీ పుట్టిన వెంటనే వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స చేస్తే ఫలితం ప్రతికూలంగా వచ్చే అవకాశాలున్నాయని డాక్టర్లు చెప్పడంతో సాయినీ తల్లిదండ్రులు ఆపరేషన్‌కు నిరాకరించారు. అప్పటినుంచి సాయినీ మెదడు పెరుగుతూనే ఉంది. ఎనిమిదేళ్ల వయసున్న సాయినీ తన ఈడు పిల్లలాగే  వినడం, మాట్లాడడం, ఆలోచించడం చేయగలదు. అయితే, మెదడు బరువు కారణంగా కూర్చోలేదు, నిల్చోలేదు. పరిమాణం మరింత పెరిగితే మెదడు సక్రమంగా పనిచేయలేదు. దీంతో  గుండె, ఊపిరితిత్తులకు మెదడుతో  సంబంధం తెగిపోతుంది. క్రమంగా  ఊపిరితీసుకోవడం కష్టమై, ప్రమాదకర పరిస్థితికి దారి తీస్తుందని గాంధీ ఆస్పత్రి వైద్యులు వివరించారు.
 
 తాత, నానమ్మలే దిక్కు: సాయినీ తండ్రి సైదులు భవననిర్మాణ కార్మికుడు. కొద్దినెలల క్రితం భవనంపై నుంచి కిందపడి గాయపడ్డాడు. తల్లి అంతకుముందే మరణించింది. తాత లింగయ్య, నాయనమ్మ లక్ష్మమ్మలే కూలి చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నామని, పాపకు వికలాంగ పింఛను కోసం సంబంధిత కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నామని వారు చెప్పారు. చిలకలగూడలో ఇటీవల జరిగిన రచ్చబండకు తాత, నాయనమ్మతో కలిసి సాయినీ వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే జయసుధ ఎత్తుకుని వైద్యం చేయిస్తానని హామి ఇచ్చారు. కానీ ఆ పాపకు మొదట ఆర్థిక సాయం అత్యవసరమని ఎమ్మెల్యే గుర్తించలేకపోయారు.

మరిన్ని వార్తలు