ధాన్యానికి మద్దతు ధర చెల్లించండి

20 Nov, 2013 03:38 IST|Sakshi

 ధాన్యానికి మద్దతు ధర చెల్లించండి
 ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్), న్యూస్‌లైన్ : జిల్లాలో ఖరీఫ్‌లో పండిన ప్రతి ధాన్యం బస్తాకు గిట్టుబాటు ధర అందించి రైతులను ఆదుకోవాలని రైస్ మిల్లర్లను కలెక్టర్ సిద్ధార్థ జైన్ కోరారు. కలెక్టరేట్‌లో మంగళవారం రాత్రి నిర్వహించిన రైస్‌మిల్లర్లు, మార్కెటింగ్, సహకార శాఖ అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన ధాన్యం కొనుగోళ్ల అంశంపై చర్చించారు. కలెక్టర్ మాట్టాడుతూ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులు సందిగ్ధంలో ఉన్నారని, ఇటువంటి స్థితిలో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకన్నా ఎక్కువకే ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలబడాలని మిల్లర్లను కోరారు.

 జిల్లా రైస్‌మిల్లర్ల సంఘ అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ జిల్లాలో రైతుల దగ్గర కనీస మద్దతు ధరకన్నా రూ.70 నుంచి 100 వరకూ ఎక్కువకే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. ఎఫ్‌సీఐకు 8 కిలోమీలర్ల పైబడి దూరం నుంచి లేవీ తోలేటప్పుడు రవాణా ఛార్జీలు ఇవ్వడం లేదన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. సమావేశంలో జేసీ బాబూరావు నాయుడు, ఎప్‌సీఐ డెప్యూటీ జీఎం రాజు, డీఎస్‌వో శివశంకర్‌రెడ్డి, డీసీవో రామ్మెహన్, మార్కెటింగ్ ఏడీ శర్మ, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు ఉన్నమట్ల కబర్థి, బూరుగుపల్లి వీర రాఘవులు, నర్సిరెడ్డి, టి.లక్ష్మణరావు, వానపల్లి బాబూరావు పాల్లొన్నారు.
 
 27,134 మందికి రేషన్ కూపన్ల పంపిణీ
 జిల్లాలో ఇప్పటివరకూ 34 మండలాలు, మునిసిపాలిటీలలో రచ్చబండ కార్యక్రమం ద్వారా 27,134 మంది లబ్ధిదారులకు రేషన్ కూపన్లను అందించామని కలెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. కొత్త రేషన్ కార్డుల కోసం వారం రోజుల్లో 41,510 దరఖాస్తులు రాగా, రేషన్ కార్డులలో మార్పుల కోసం 388 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఇప్పటివరకూ 15,729 మందికి పింఛన్లు అందించినట్టు చెప్పారు. 2,267 మంది వికలాంగులకు పింఛన్లు మంజారు చేసి పత్రాలను అందించామన్నారు. కొత్తగా వివిధ పింఛన్లు  మంజారు కోరుతూ 25,570 దరఖాస్తులు అందాయని వివరించారు. ఇళ్ల మంజూరుకు 13,047 మందికి మంజారు పత్రాలు అందించగా మరో 21,681 మంది కొత్తగా దరఖాస్తులు చేసుకున్నారని చెప్పారు. కుటుంబ సహాయ పథకం కింద 647 మంది అర్హులను గుర్తించి ఇప్పటివరకూ 281 మందికి మంజూరు చేశామని కలెక్టర్ సిద్ధార్థ జైన్ వివరించారు.
 

మరిన్ని వార్తలు