‘పనితీరు’కు గ్యారంటీ కావాల్సిందే!

10 Feb, 2014 01:42 IST|Sakshi
‘పనితీరు’కు గ్యారంటీ కావాల్సిందే!


 జెన్‌కోనూ వదలని
 విద్యుత్ పంపిణీ సంస్థలు
 ముందుకుసాగని సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ
 
 సాక్షి, హైదరాబాద్: వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి సరఫరా చేస్తున్న జెన్‌కో పనితీరుకు గ్యారంటీ కావాల్సిందేనని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు అంటున్నాయి. జెన్‌కో ఏర్పాటు చేయనున్న సోలార్ విద్యుత్ ప్లాంట్లతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకోవాలంటే పెర్ఫార్మెన్స్ గ్యారంటీ చెల్లింపు తప్పనిసరి అని డిస్కంలు పేర్కొంటున్నాయి. అయితే, ప్రభుత్వరంగ సంస్థ అయిన తమకు గ్యారంటీ చెల్లింపు నుంచి మినహాయింపు ఇవ్వాలని జెన్‌కో కోరుతోంది. ఇందుకు డిస్కంలు ససేమిరా అంటున్నాయి. దీంతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటులో ఇప్పటి వరకు జెన్‌కో ముందడుగు వేయలేకపోతోంది.
  సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు జెన్‌కోకు మొదటి నుంచీ అడ్డంకులు ఎదురవుతున్నాయి. ట్రాన్స్‌కో పిలిచిన 1,000 మెగావాట్ల సోలార్ బిడ్డింగ్‌లో జెన్‌కో పాల్గొనకుండా ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిళ్లు వచ్చాయి.
 
  బిడ్డింగ్‌తో సంబంధం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా 100 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు జెన్‌కో సమాయత్తమయ్యింది.
 
 అయితే, వైఎస్సార్ జిల్లాలో ఏర్పాటు చేసే సోలార్ ప్లాంటుకు విద్యుత్ సరఫరా లైన్లు (కారిడార్) ఏర్పాటు చేయలేమని ట్రాన్స్‌కో కొర్రీ వేసింది. దీనిపై సాక్షిలో వార్త ప్రచురితమయ్యింది. దీంతో కారిడార్ ఏర్పాటుకు ట్రాన్స్‌కో సంసిద్ధత వ్యక్తం చేసింది.
 
 ఇప్పుడు ప్రైవేటు ప్లాంట్లతో సమానంగా పనితీరుకు గ్యారంటీ మొత్తం చెల్లించాలని అంటోంది.
 
 ఒకవైపు జెన్‌కోకు సుమారు రూ. 3 వేల కోట్ల మేరకు డిస్కంలు బకాయిపడ్డాయి. మరోవైపు గ్యారంటీకి జెన్‌కోను పట్టుబడుతుండటం విమర్శలకు తావిస్తోంది.
 
 మొత్తం 100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్లను జెన్‌కో చేపట్టాలని భావిస్తోంది. ఈ లెక్కన ఒక్కో మెగావాట్‌కు రూ. 10 లక్షల చొప్పున రూ. 10 కోట్లు ముందస్తుగా జెన్‌కో చెల్లించాల్సి రానుంది.
 
 ఒకేసారి ఇంత మొత్తం చెల్లించడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆందోళన జెన్‌కోను వెంటాడుతోంది.

మరిన్ని వార్తలు