సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన నీలం సహాని

14 Nov, 2019 13:50 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో మళ్లీ విధులు నిర్వర్తిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహానీ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఆమె మాట్లాడుతూ... గతంలో కృష్ణా జిల్లా సబ్‌ కలెక్టర్‌గా పనిచేశానని తెలిపారు. నేడు ప్రభుత్వ సీఎస్‌గా నియమితులైన వేళ ఆ ఙ్ఞాపకాలన్నీ గుర్తుకువస్తున్నాయని పేర్కొన్నారు. కాగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నీలం సహానీ... తాడేపల్లిలో సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

కాగా జూన్‌ 20, 1960న జన్మించిన నీలం సహాని వచ్చే ఏడాది జూన్‌లో పదవీ విరమణ చేయనున్నారు. 1984 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆమె ఏపీ కేడర్‌ అధికారి. గతంలో డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులకు వెళ్లారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికార శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న నీలం సహానిని రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు సోమవారం ఆ విధుల నుంచి రిలీవ్‌ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐఏఎస్‌లలో సీనియర్‌ అయిన ఆమెను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఏపీ సర్కారు నియమించింది.

మరిన్ని వార్తలు