కేంద్ర బడ్జెట్‌లో సిక్కోలుకు దక్కని వరాలు

6 Jul, 2019 08:03 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం : ఇటీవలి సాధారణ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్‌ ప్రకటించినప్పటికీ ఈ బడ్జెట్‌లో దాని గురించి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. వాస్తవానికి రాష్ట్ర పునర్విభజన చట్టం ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇచ్చిన ప్రధాన హామీ రైల్వే జోన్‌. దీని గురించే కాదు కొత్త రైళ్లు వేటినీ జిల్లా మీదుగా ప్రకటించలేదు. కనీసం కొన్ని రైళ్లనైనా జిల్లాకు ఉపయోగకరంగా ఉండేలా పొడిగించనూలేదు. పాత ప్రతిపాదనలకూ మోక్షం కలగలేదు. జనరల్‌ బడ్జెట్‌లో అభివృద్ధిలో అత్యంత వెనుకబడి ఉన్న శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేక వరాలేవీ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించలేదు. అయితే దేశవ్యాప్తంగా పాడిపరిశ్రమ, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు, చిన్న పరిశ్రమలను బలోపేతం చేయడానికి బడ్జెట్‌లో ఫోకస్‌ చేయడం కాస్త ఊరట. 

చిరు ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలు సొంత ఇల్లు కొనుక్కోవడానికి ప్రోత్సాహకంగా బడ్జెట్‌లో వడ్డీ రాయితీ ప్రకటించారు. రూ.45 లక్షల వరకూ రుణం తీసుకుంటే రూ.3.50 లక్షల వరకూ రాయితీ వర్తిస్తుంది. గతంలో రూ.2 లక్షల వరకూ ఉంది. 
జిల్లాలో జీడితోటలున్న రైతులకు శుభవార్త. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న జీడిపిక్కలపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ పెరగనుంది. దీంతో స్థానిక రైతులకు, వ్యాపారులకు మేలు జరగనుంది. 
ప్రస్తుతం జిల్లాలో రోజుకు సగటున 1.50 లక్షల లీటర్ల పెట్రో ల్, మరో 1.40 లక్షల లీటర్ల డీజిల్‌ను వాహనదారులు వినియోగిస్తున్నారు. రోడ్లు, మౌలిక వసతుల కల్పన కోసం ప్రతి లీటర్‌కు రూపాయి చొప్పున అదనంగా సెస్‌ను కేంద్రం విధించనుంది. ఈ బడ్జెట్‌కు ఇంకా ఆమోదం లభించకముందే చమురు సంస్థలు పెట్రోల్‌పై రూ.2.50, డీజిల్‌పై రూ.2.75 చొప్పున పెంచేశాయి. 
ప్రధానమంత్రి ఆవాస్‌యోజన–గ్రామీణ (పీఎంఏవై–జి) పథ కం కింద 2022 నాటికి అందరికీ సొంతిల్లు కల్పిస్తామని బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. జిల్లాలో సొంతిల్లు కోసం ప్రస్తుతం 42 వేల వరకూ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వారందరికీ ఇది శుభవార్తే. 
వెదురు, తేనె, ఖాదీ పరిశ్రమలకు ప్రోత్సాహంగా దేశంలో కొత్తగా వంద క్లస్టర్లు ఏర్పాట్లు చేయడానికి బడ్జెట్‌లో ప్రకటించారు. జిల్లాలో పొందూరు వద్ద ఖాదీ క్టస్టర్‌ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ఈసారైనా మోక్షం కలుగుతుందేమో చూడాలి.
సహకార రంగంలో పాడిపరిశ్రమకు ఈ బడ్జెట్‌లో ప్రోత్సాహకా లు ప్రకటించారు. పశుశాలల నిర్మాణంతోపాటు దాణా తయారీ, పాలసేకరణ, పాల ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. 
ప్రధానమంత్రి శ్రమయోగి మాంధాన్‌ పథకం కింద అసంఘటిత కార్మికులకు 60 ఏళ్లు వయసు వచ్చిన తర్వాత నెలకు రూ.3 వేల చొప్పున పింఛను ప్రకటించారు. దీనివల్ల జిల్లాలో సుమారు 40 వేల మంది అసంఘటిత కార్మికులకు మేలు జరుగుతుంది.
మహిళా స్వయంశక్తి సంఘాలల్లో (డ్వాక్రా) సభ్యులైన మహిళలకు జన్‌ధన్‌ ఖాతాల ద్వారా రూ.5 వేల చొప్పున సహాయం లభిం చనుంది. అలాగే ప్రతి సంఘంలో ఒక్కో మహిళకు రూ.లక్ష వరకూ ముద్రా రుణం లభిస్తుంది. 

జిల్లాకు ఒరిగిందేమీ లేదు..
వెనుకబడిన, మావోయిస్టుల ప్రభావిత జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద జిల్లాకు ఏటా రూ.50 కోట్ల నిధులు ప్రకటించారు. కానీ గత ఏడాది జిల్లాకు ఆ నిధులు రాలేదు. ఈ బడ్జెట్‌లో ఆ ప్యాకేజీ కింద నిధులేవీ పెంచలేదు. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల ద్వారా ఉపాధి, ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఈ బడ్జెట్‌లో ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు ప్రకటించినా పారిశ్రామికరంగంలో అత్యంత వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు ఎలాంటి పారిశ్రామిక ప్రోత్సాహకాలు లేవు. వైజాగ్‌–చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ను శ్రీకాకుళం వరకూ పొడిగించాలనే డిమాండు అలాగే ఉండిపోయింది.  

మరిన్ని వార్తలు