వారి యవ్వారమంతా గుట్టే..

29 Jun, 2014 02:04 IST|Sakshi

- చమురు సంస్థల కార్యకలాపాల తీరు
- ప్రమాదాల నివారణలో నిర్లక్ష్యం
- ఏమైనా జరిగితే.. అధికారులదే బాధ్యత

 అమలాపురం : ‘కోట్లు మాకు... పాట్లు మీకు’ అన్నట్టుగా ఉంది చమురు సంస్థల తీరు. చమురు, సహజ వాయువులను వెలికితీసి తరలించుకుపోయి జేబులు నింపుకొంటున్న ఆ సంస్థలు.. ఏ చిన్న ప్రమాదం జరిగినా బాధ్యతంతా స్థాని క ప్రభుత్వ అధికారులపైకి వేసి పలాయన మంత్రాన్ని జపిస్తున్నాయి. ప్రమాదాలను ఎదుర్కోవడంలోనే కాదు, ప్రమాదాల నివారణలో కూడా స్థానికాధికారులకు, చమురు సంస్థలకు మధ్య సమన్వయం కొరవడింది.
 
ప్రమాదం జరిగితే చమురు సంస్థల పలాయానం
కేజీ బేసిన్ పరిధిలో బ్లోఅవుట్లు, పైపులైన్ల లీకేజీలు వంటి సంఘటనలు జరిగినప్పుడు చమురు సంస్థలు పలాయనమంత్రం జపిస్తున్నాయి. సంఘటన స్థలానికి వెళితే బాధితుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తోందని తప్పించుకుని, ఆ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వంపై వదిలేస్తున్నారు. నగరం లో గ్యాస్ దుర్ఘటన జరిగినప్పుడు గెయిల్ సంస్థే కాకుం డా గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్ (జీసీఎస్), మినీ ఆయిల్ రిఫైనరీ నిర్వహిస్తున్న ఓఎన్‌జీసీ స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

కనీసం అగ్నిమాపక శకటాలు కూడా పంపలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాధితు లు తమపై దాడి చేస్తారన్న భయంతో గెయిల్ ఉద్యోగులు బయటకు అడుగు పెట్టలేదు. దీంతో మంటలను అదుపు చేయాల్సిన బాధ్యత స్థానిక అగ్నిమాపక శాఖపై పడింది. వారు రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ నుంచి వచ్చేసరికే పెనునష్టం జరిగిపోయింది.
 
నిర్వహణపై సమన్వయం లేదు
ఓఎన్‌జీసీతో పాటు ఇతర సంస్థలకు చెందిన గ్యాస్, చము రు పైపులైన్లు కోనసీమలో విస్తరించి ఉన్నాయి. వీటి నిర్వహణపై చమురు సంస్థలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. వీటి పనితీరు, భద్రత విషయంలో స్థానికాధికారులు, చమురు సంస్థలు కలిసి పనిచేయాల్సి ఉంది. అయితే చమురు సంస్థలు ఒంటెద్దు పోకడలకు పోతున్నాయి. రెవెన్యూ, పోలీసు, ఫైర్, పంచాయతీ శాఖల అధికారులను సమన్వయం చేసి ప్రమాదాలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించాల్సిన బాధ్యత చమురు సంస్థలపై ఉన్నా.. అలాంటి దాఖలాలు లేవు. పైపులైన్ల భద్రతపై జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో అధికారులు, చమురు సంస్థల ప్రతినిధులు ప్రతీ రెండు నెలలకు ఓసారి సమీక్ష చేయాల్సి ఉన్నా, ఒక్కసారి కూడా జరగలేదు.

 పైపులైన్ల వెంటే నివాస గృహాలు
‘గ్యాస్ పైపులైన్లకు 18 మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేయరాదు. ఇక్కడ పైపులైన్ల చుట్టూ ఇళ్లను చూస్తే ఆశ్చర్యమేస్తోంది’ అని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి ఆర్‌పీ సింగ్ వ్యాఖ్యానించారు. శనివారం నగరంలో ఆయన పర్యటించినప్పుడు పైపులైన్లపైనే ఇళ్ల నిర్మాణం జరగడాన్ని చూసి విస్తుపోయారు. గ్యాస్ పైపులైన్ ప్రాంతాల్లో ‘నో కన్‌స్ట్రక్షన్ జోన్’ ఎంతవరకు విస్తరించి ఉందనే దానిపై చమురు సంస్థల నుంచి సరైన సమచారం లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.

మరిన్ని వార్తలు