మెగాసిటీపై నిర్లక్ష్యం!

10 Nov, 2014 02:43 IST|Sakshi
మెగాసిటీపై నిర్లక్ష్యం!

సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతిని మెగాసిటీగా అభివృద్ధి చేసేందుకు అటవీ భూములను డీ-నోటిఫై చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. డీ-నోటిఫై ప్ర తిపాదనలు పంపడానికి మరో వారం  మాత్రమే గడువు ఉన్నా.. ఇప్పటికీ  కమిటీ సమావేశం నిర్వహించకపోవడం అందుకు తార్కాణం. తిరుపతిని మెగాసిటీగా అభివృద్ధి చేస్తామని సెప్టెంబర్ 4న సీఎం చంద్రబాబు శాసనసభలో ప్రకటించిన విషయం విదితమే. నగరాన్ని మెగాసిటీగా మార్చాలంటే అటవీ భూములను డీ-నోటిఫై చేయడం ఒక్కటే మార్గమని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్. కృష్ణారావు నేతృత్వంలో అటవీ, రెవెన్యూ, పురపాలకశాఖ కార్యదర్శులతో సెప్టెంబర్ 29న హైదరాబాద్‌లో ఉన్నత స్థా యి సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి చుట్టూ పది కిమీల పరిధిలోని అటవీ భూములను కనీసం పది వేల ఎకరాలను గుర్తించి.. డీ-నోటిఫై చేయాలని నిర్ణయించారు. అటవీ భూములను డీ-నోటిఫై చేసేందుకు జాయింట్ కలెక్టర్ భరత్‌నారాయణ గుప్తా అధ్యక్షులుగా, తూర్పు విభాగం డీఎఫ్‌వో శ్రీనివాసులురెడ్డి మెంబర్ కన్వీనర్‌గా, తుడా వీసీ వెంకటేశ్వరరెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ డి.సాంబశివరావు, వైల్డ్ లైఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రవికుమార్ సభ్యులుగా కమిటీని నియమిస్తూ అక్టోబర్ 17న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

డీ-నోటిఫై ప్రతిపాదనలను 30 రోజుల్లోగా పంపాలని ఆదేశించింది. ప్రభుత్వం విధించిన గడువు మరో వారం రోజుల్లో ముగియనుంది.  హుద్‌హుద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు జాయింట్ కలెక్టర్ భరత్‌నారాయణ గుప్తా విశాఖపట్నంలో కొన్నాళ్లు మకాం వేశారు. చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గడువును మరో నెలపాటు పొడిగించాలని ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు రెవెన్యూవర్గాలు వెల్లడించాయి.

తిరుపతికి పది కిమీల పరిధిలో అటవీ భూములు భారీ ఎత్తున అందుబాటులో లేవని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. చంద్రగిరి మండలం రంగంపేట పరిసర ప్రాంతాల్లోని రిజర్వు అటవీ ప్రాంతంలో చామల రేంజ్‌లో నాగపట్ల సెక్షన్‌లో భూములు అందుబాటులో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రాంతానికి కళ్యాణి డ్యాం కూడా సమీపంలో ఉండటం గమనార్హం. ఆ భూములను డీ-నోటిఫై చేస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి.

మరిన్ని వార్తలు