ప్రమాదాల వెం‘బడి’

11 Jun, 2019 12:41 IST|Sakshi
అద్దాలు లేని స్కూలు బస్సు

సామర్థ్యం లేని బడి బస్సులు

నిర్వహణపై యాజమాన్యాల నిర్లక్ష్యం

సాక్షి, పార్వతీపురం (విజయనగరం): విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి కేవలం రెండ్రోజుల వ్యవధి ఉంది. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలు ఇబ్బడి ముబ్బడిగా ప్రకటనలు చేస్తూ విద్యార్థులను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. విద్య పేరు చెప్పి రూ.లక్షలు దండుకోవాలన్న ధ్యాస తప్పా విద్యార్థులకు తగిన భద్రత కల్పించాలన్న ఆలోచన విద్యా సంస్థల యాజమాన్యాలకు లేదన్న విమర్శలున్నాయి. పాఠశాల బస్సుల నిర్వహణలో నిబంధనలు పాటించకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో విద్యార్థుల జీవితాలు గాల్లో దీపాలవుతున్నాయి. జిల్లాలో స్కూలు బస్సుల పరిస్థితిని చూసిన విద్యార్థులు తల్లిదండ్రులు హడలిపోతున్నారు.

సీట్లు చిరిగిపోయి, దుమ్ము, ధూళి పేరుకుపోయి, ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సుల్లో మందులున్నా లేకపోయినా.. ఉన్న మందులు కాస్తా గడువు తేదీ దాటిపోయినా పట్టించుకోకుండా లాభార్జన చూసుకుంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా వందలాది పాఠశాలల్లో  ఇదే పరిస్థితి. డబ్బులు వసూళ్లు చేయడంలో ఉన్న శ్రద్ధ ప్రమాణాలు పాటించడంలో చూపించడం లేదు. వీరికి ఇటు విద్యాశాఖాధికారులు, అటు రవాణా శాఖాధికారులు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిట్‌నెస్‌ లేని కారణంగా ఎన్నోచోట్ల విద్యార్థులు ప్రమాదాలకు గురౌతున్నారు.

నిబంధనలివి
► బస్సు సర్వీసు వయసు 15 ఏళ్లకు మించి ఉండరాదు. కచ్చితంగా బస్సుకు బీమా ఉండాలి
► బస్సు ముందు, వెనుక స్కూల్‌బస్సు అని రాసి ఉండాలి. దాని పక్కనే పాఠశాల పిల్లల బొమ్మలు ఉండాలి.
► పిల్లలు ఎక్కడానికి వీలుగా ఫుట్‌ బోర్డు మొదటి మెట్టు భూమి నుంచి 325 మిల్లీమీటర్ల ఎత్తు ఉండాలి
► బస్సు వెనుకవైపు అత్యవసర ద్వారం ఏర్పాటు చేసి చీకట్లో కూడా దాన్ని గుర్తించే విధంగా రేడియం స్టిక్కర్‌ను అంటించాలి. అత్యవసర ద్వారం అని తప్పకుండా రాసి ఉండాలి
► అగ్నిమాపక నిదోధక పరికరాలు, ప్రథమ చికిత్స పరికరాల కిట్‌ ఏర్పాటు చేసి చికిత్సకు అవసరమైన మందులు అందులో ఉంచాలి. 
► బస్సు ముందు తెలుపు, వెనుక ఎరుపు, పక్కన పసుపు రంగుతో కూడిన రేడియం స్టిక్కర్లు అంటించాలి.
► తప్పనిసరిగా వాహనాలకు పరావరణశాఖ అనుమతి ఉండాలి. పాఠశాల బస్సులు 40 కిలోమీటర్ల వేగాన్ని మించి నడుపరాదు. కొత్త వాహనానికి ఇరువైపులా పసుపు రంగు టేపు అతికించాలి.
► బస్సు తలుపు తెరుచుకుని విద్యార్థులు దిగేటప్పుడు వెనుకనుంచి వచ్చే వాహనదారులు గమనించే విధంగా స్టాప్‌ బోర్డును తలుపుమీద ఏర్పాటు చేయాలి.
► స్టీరింగ్, బ్రేక్, హారన్‌ కండిషన్‌లో ఉండాలి. విద్యార్థి కూర్చోవడానికి వీలుగా కుషన్‌ సీట్లు ఏర్పాటు చేయాలి
► బస్సుకు నలుమూలలా యాంచర్‌ కలర్‌ లైట్లు ఏర్పాటు చేయాలి. బస్సులో అత్యవసర ద్వారాలు ఏర్పాటుచేయాలి.

డ్రైవర్‌ నిబంధనలు
► 25 నుంచి 60 ఏళ్ల లోపు ఆరోగ్యవంతుడై ఉండాలి. హెవీ వెహికల్‌ లైసెన్సుతో పాటుగా కనీసం 5 ఏళ్ల అనుభం ఉండాలి
► కంటిచూపు స్పష్టంగా ఉంటూ కనీసం 6/2 కంటిచూపు కచ్చితంగా ఉండాలి. డ్రైవర్, క్లీనర్లు యూనిఫాం ధరించాలి. విధుల్లో మద్యం తాగరాదు.
► ఏటా ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకుని బస్సును నడపడానికి అర్హుడేనని డాక్టర్‌ ధ్రువపత్రం పొందాలి. పాఠశాల ఆవరణలో బస్సు పార్కింగ్‌ ఏర్పాటు చేయాలి

యాజమాన్యాల బాధ్యతలివీ..
► బస్సు డ్రైవర్, సహాయకుడి ఫొటో, లైసెన్స్‌ వివరాలను అందరికీ తెలిసేలా బస్సు లోపల బోర్డులో పెట్టించాలి. నిత్యం ప్రయాణించే విద్యార్థుల జాబితాను బస్సులో ఏర్పాటు చేయాలి
► విద్యార్థులను ఎక్కించి, దింపేందుకు ప్రతి బస్సుకు ఒక సహాయకుడిని ఏర్పాటు చేయాలి. రోజూ బస్సు వెళ్లే మార్గాన్ని (రూట్‌ మ్యాప్‌) బస్సులో అతికించాలి. తప్పనిసరిగా బస్సులను పాఠశాల ఆవరణలోనే పార్కింగ్‌ చేయాలి.
► పాఠశాల యాజమాన్యం పిల్లల తల్లిదండ్రులతో కలసి కమిటీని ఏర్పాటు చేసి ప్రతి నెల బస్సు పరిస్థితిని సమీక్షించాలి. రోజూ ప్రయాణించే మార్గాన్ని ప్రధానోపాధ్యాయుడు అప్పుడప్పుడు పరిశీలించాలి
పాఠశాల ఆటోలు పాటించాల్సినవి..
► ఆటో మందు, వెనుక భాగంలో పాఠశాల ఆటో అని రాయించాలి. ఆరుగురు విద్యార్థులను మాత్రమే తీసుకెళ్లాలి. ఆటో నడిపే డ్రైవర్‌కు ఏఆర్‌ (ఆటో రిక్షా) రవాణా వాహనం లైసెన్స్‌ ఉండాలి. 
► ఆటోకు రెండువైపులా గ్రిల్స్‌ ఏర్పాటు చేయాలి. పది కిలోమీటర్ల లోపున్న పాఠశాలల పిల్లల్ని మాత్రమే తీసుకెళ్లాలి.

అధికారుల బాధ్యతలివి
► వేసవి సెలవులు ప్రారంభం కాగానే బస్సుల తనిఖీపై పాఠశాలల యాజమాన్యాలకు నోటీసులు పంపాలి. పాత బస్సులైతే ఏటా ఒకసారి, కొత్త బస్సులైతే రెండేళ్లకోసారి తనిఖీలు నిర్వహించాలి
► బస్సు కండిషన్‌ను రవాణా శాఖాధికారులు, సిబ్బంది స్వయంగా పరిశీలించాలి. కండిషన్‌ సరిగా లేకుంటే  సమస్యను పరిష్కరించి తీసుకురావాలని సూచించాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బస్సు నిర్వహణ ఉన్నదీ లేనిదీ పరిశీలించాలి. 

అతిక్రమిస్తే కఠిన చర్య
ఈ ఏడాది ఇప్పటికే డివిజన్‌ వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల బస్సులను అణువణువూ పరిశీలించాం. డివిజన్‌ వ్యాప్తంగా 100 బస్సులుండగా వాటిలో 80 బస్సులు ఫిట్‌నెస్‌ కోసం వచ్చాయి. కొన్నింటికి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు ఇచ్చాం. కొన్ని బస్సులను మరమ్మతుల నిమిత్తం పంపించాం. బస్సుల ఫిట్‌మెంట్‌ విషయంలో ఎలాంటి రాజీ పడటం లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలల ప్రారంభానికి ముందే అన్ని బస్సులను తనిఖీ చేస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిని అనుమతించడం లేదు. ఎవరు నిబంధనలు అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాసరావు, ఎంవీఐ,పార్వతీపురం

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా