పరిశోధన.. వేదన

26 Dec, 2019 11:31 IST|Sakshi
ఎస్కేయూ పాలకభవనం

పీహెచ్‌డీ అడ్మిషన్లలో మీనమేషాలు  

అకడమిక్‌ స్టాండింగ్‌ కమిటీ సమావేశం నిర్వహణలో తాత్సారం

ఎగ్జిక్యూటివ్, ఇండస్ట్రీ కోటా అడ్మిషన్లూ కల్పించని వైనం  

ఇంటర్నల్‌ పీహెచ్‌డీ అడ్మిషన్లలోనూ ఇదే పరిస్థితి  

హేమలత ఎంబీఏ విభాగంలో ఎగ్జిక్యూటివ్‌ కోటాలో అడ్మిషన్‌ పొందడానికి ఎనిమిది నెలల కిందట ఆసక్తి ప్రదర్శించారు. సంబంధిత విభాగం గైడ్‌ ఆమోదం తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేశారు. అయితే అకడమిక్‌ స్టాండింగ్‌ కమిటీ ఆమోదం పొందలేదు. కారణమేమిటంటే పది నెలల నుంచి అకడమిక్‌ స్టాండింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించలేదు. దీంతో పీహెచ్‌డీ అడ్మిషన్‌ పొందని పరిస్థితి నెలకొంది. ఒక్క ఎగ్జిక్యూటివ్‌ కోటాలోనే కాదు. ఇండస్ట్రీ కోటా.. ఇంటర్నల్‌ పీహెచ్‌డీ అడ్మిషన్ల పరిస్థితీ ఇంతే. ఇలా అన్ని కోటాలోనూ పీహెచ్‌డీ అడ్మిషన్లు జరపని కారణంగా పరిశోధన విద్యార్థులకు దిక్కుతోచని స్థితి నెలకొంది.

ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) పీహెచ్‌డీ అడ్మిషన్లలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. నిర్థిష్టమైన సమయంలో పీహెచ్‌డీ అడ్మిషన్లు కల్పించకపోవడంతో ప్రోగ్రామ్‌ కాల పరిధి ఆలస్యం అనివార్యం కానుంది. పీహెచ్‌డీలో కనీసం మూడు సంవత్సరాలు, గరిష్టంగా ఐదు సంవత్సరాలు కాల వ్యవధి ఉంటుంది. ఈ నేపథ్యంలో అడ్మిషన్లు ఆలస్యం కావడంతో కాలయాపన తప్పనిసరి. జేఎఆర్‌ఎఫ్‌ (జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌)కు ఎంపికైన పరిశోధన విద్యార్థులు పీహెచ్‌డీ అడ్మిషన్‌ కాకపోవడంతో ఫెలోషిప్‌ చేజారే పరిస్థితి నెలకొంది. నిర్థిష్టమైన సమయంలో పీహెచ్‌డీ పూర్తి చేస్తే పోస్ట్‌డాక్టోరల్‌ ఫెలోషిప్‌ (పీడీఎఫ్‌) ప్రాజెక్ట్‌ దరఖాస్తుకు ఆలస్యం అయ్యే పరిస్థితి ఉంటుంది. నాణ్యమైన పరిశోధనలే విశ్వవిద్యాలయం గుర్తింపుకు గీటురాయి. ఈ క్రమంలో ఎస్కే యూనివర్సిటీ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి అయిన పరిశోధనలను విస్మరించడంతో న్యాక్‌ (నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌) పాయింట్లలోనూ, గ్రేడింగ్‌లోనూ వెనుబాటుతనం తప్పనిసరి పరిస్థితి ఎదురుకానుంది. గతంలో న్యాక్‌ గ్రేడింగ్‌లో వెనుకబడడంతో రూ.100 కోట్ల రూసా (రాష్ట్రీయ ఉచ్ఛతార్‌ శిక్షా అభియాన్‌) నిధుల స్థానంలో రూ. 20 కోట్లు మాత్రమే మంజూరయ్యాయి. 

గైడ్‌ల కొరతతో సతమతం
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో మొత్తం 120 బోధన పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. న్యాయపరమైన చిక్కులు ఏర్పడడంతో భర్తీ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. తాజాగా 70 మంది ప్రొఫెసర్లు ఉన్నారు. ఒక్కో ప్రొఫెసర్‌కు ఐదుగురు ఫుల్‌టైం, ముగ్గురు పార్ట్‌టైం స్కాలర్లను కేటాయిస్తున్నారు. అరకొరగా ప్రొఫెసర్లు ఉన్నప్పటికీ అకడమిక్‌ స్టాండింగ్‌ కౌన్సిల్, రీసెర్చ్‌ అడ్వైజరీ కమిటీ సమావేశాలు క్రమంగా జరగకపోవడంతో ఆశించిన స్థాయిలో పీహెచ్‌డీ అడ్మిషన్లు కావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు పీహెచ్‌డీ అడ్మిషన్లకు రీసెర్చ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ను రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్నారు. ప్రశ్నపత్రాలు కఠినంగా ఉండడంతో పాటు మైనస్‌ మార్కుల నిబంధన ఉండడంతో అర్హత సాధించలేని పరిస్థితి నెలకొంది. దీంతో పీహెచ్‌డీ అడ్మిషన్లు ఆశించిన స్థాయిలో లేవు. కనీసం పార్ట్‌టైం పీహెచ్‌డీ అడ్మిషన్లు కల్పించడంలోనూ తాత్సారం చేస్తుండడంతో పరిశోధన పడకేసిందనే వాదన వినిపిస్తోంది.

మరిన్ని వార్తలు