వైఎస్సార్‌సీపీలోకి నెల్లూరు డీసీసీబీ చైర్మన్‌

24 Mar, 2019 05:36 IST|Sakshi
హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ చైర్మన్‌ మెట్టుకూరు ధనుంజయరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చెన్ను బాలకృష్ణారెడ్డి, రామక్రిష్ణారెడ్డి, చిత్రంలో వైవీ సుబ్బారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి

కర్నూలు జిల్లా వాల్మీకీ నేతలు చేరిక 

సాక్షి, హైదరాబాద్‌: అధికార టీడీపీ నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి బయల్దేరడానికి ముందు నెల్లూరు, మంత్రాలయం (కర్నూలు)కు చెందిన నాయకులను పార్టీలోకి చేర్చుకున్నారు. మంత్రాలయం నుంచి చేరిన వారిలో పలువురు వాల్మీకీ నేతలున్నారు. నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌ మెట్టుకూరు ధనుంజయరెడ్డి, రాపూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ చెన్నూరు బాలకృష్ణారెడ్డి వీరిద్దరూ మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నేతృత్వంలో జగన్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఆయన వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. 

చంద్రబాబు వాల్మీకులను మోసం చేశారు
మంత్రాలయం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో పలువురు వాల్మీకీ నేతలు పార్టీలో చేరారు. వాల్మీకి వర్గానికి చెందిన మాజీ ఎంపీపీ రామిరెడ్డి, మాధవరం సర్పంచ్‌ రాఘవేంద్రరెడ్డి, ఆయన సోదరుడు రఘునాథరెడ్డి, పెద్దకడుగూరు సర్పంచ్‌ రవిచంద్రారెడ్డితో పాటు పలువురు వైఎస్‌ జగన్‌ను ఆయన నివాసంలో కలుసుకోగా వారికి పార్టీ కండువాలు కప్పారు. అనంతరం రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబునాయుడు తమ వాల్మీకులకు రాజకీయంగా అన్యాయం చేశారని విమర్శించారు.

వాల్మీకి వర్గానికి టికెట్‌ ఇస్తానని 2009, 2014 ఎన్నికల్లో చెప్పి ఇవ్వలేదని, చివరకు 2019లో కూడా మొండి చేయి చూపించారన్నారు. కర్నూలు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వాల్మీకీలను రాజకీయంగా ఎదగనీయకుండా అణగదొక్కుతున్నారని రామిరెడ్డి అన్నారు. జగన్‌ ప్రకటించిన సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులమై పార్టీలో చేరామన్నారు. వీరితో పాటు ఆర్‌.నవీన్‌కుమార్, ఆర్‌.శివరామిరెడ్డి, ఎన్‌.రాఘవేంద్రరెడ్డి, ఎన్‌.రామకృష్ణారెడ్డి , చిదానంద, ఎన్‌.రాజశేఖరరెడ్డి కూడా పార్టీలో చేరారు. 

మరిన్ని వార్తలు