అన్నీ ఢిల్లీ లింకులే.. 42 పాజిటివ్‌

7 Apr, 2020 08:54 IST|Sakshi

సాక్షి, నెల్లూరు(అర్బన్‌): జిల్లాలో రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఆదివారం ఉదయం వరకు 34 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఉదయం 10 గంటలకు 73 మందికి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ వచ్చింది. అయితే సాయంత్రం హెల్త్‌ బులెటిన్‌ వచ్చే సరికి ఒక్కసారిగా పరిస్థితి తారుమారైంది. మరో 8 మందికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. దీంతో ఆ సంఖ్య 42 కి చేరింది. దర్గామిట్ట, ఫత్తేఖాన్‌పేట, ఖుద్దూస్‌నగర్, నాయుడుపేటలో 2, వాకాడులో 2, గూడూరు పట్టణంలో ఈ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాలను రెడ్‌ జోన్లుగా ప్రకటించి రాకపోకలను పోలీసు సిబ్బంది నియంత్రిస్తున్నారు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.42 కేసుల్లో రెండు మినహా మిగతావన్నీ ఢిల్లీ లింకులే.

చెన్నైకి డాక్టర్‌ తరలింపు 
కరోనా పాజిటివ్‌ సోకిన నగరానికి చెందిన ఆర్థోపెడిక్‌ డాక్టర్‌ శ్వాస తీసుకోలేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం పెద్దాస్పత్రి నుంచి చెన్నైకి తరలించారు.  55 ఏళ్ల ఆ వైద్యుడికి మధుమేహం, హైపర్‌ టెన్షన్‌ కూడా ఉన్నాయని తెలిసింది. ఇదిలా ఉండగా ఆయన 15 రోజులుగా ఎవరెవరితో ఉన్నారో గుర్తించి వారిని వైద్యశాఖ అధికారులు క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. సమాజం బాగు కోసం ఆర్థోపెడిక్‌ డాక్టర్‌ వద్ద వైద్యం చేసుకున్న రోగులు, ఆస్పత్రి ప్రారంభోత్సవ ఫంక్షన్‌కు వెళ్లిన డాక్టర్లందరూ స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని వైద్యశాఖ విజ్ఞప్తి చేస్తోంది. కాగా ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న ఓ డాక్టర్‌ను క్వారంటైన్‌కు తరలించారని తెలిసింది.

ఊపిరి పీల్చుకున్న కలెక్టరేట్‌ అధికారులు 
కలెక్టరేట్‌లో పనిచేస్తున్న చిరుద్యోగి ఢిల్లీకి వెళ్లి వచ్చి విధులు నిర్వర్తిస్తుండగా వైద్య శాఖాధికారులు గుర్తించి ఆయన్ను క్వారంటైన్‌కు తరలించారు. దీంతో కలెక్టరేట్‌ వర్గాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే పరీక్షల్లో ఆ ఉద్యోగికి నెగెటివ్‌ రావడంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. మరో గన్‌మన్‌ సైతం హోమ్‌ క్వారంటైన్‌లోనే ఉన్నారు.

గూడూరులో ఒకటి
గూడూరు: దర్గావీధికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఢిల్లీకి వెళ్లి తిరిగి వచ్చిన నేపథ్యంలో అతడిని వైద్యులు వారంరోజులుగా ఐసోలేషన్‌లో ఉంచారు. సోమవారం చేసిన వైద్య పరీక్షల్లో ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టుగా తెలిపారు.
వాకాడు మండలంలో మరో రెండు 

వాకాడు: మండలంలోని నవాబుపేటకు చెందిన ఓ మహిళతోపాటు మరో వ్యక్తికి సోమవారం కరోనా పాజిటివ్‌ వచ్చినట్టుగా ఎంపీడీఓ గోపీనాథ్‌ తెలిపారు. ఇటీవల ఢిల్లీ నుంచి వచ్చిన గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చిందన్నారు. అతని కుటుంబాన్ని క్వారంటైన్‌కి తరలించి పరీక్షలు చేశామన్నారు. ఆ వ్యక్తి భార్యకి కూడా పాజిటివ్‌ వచ్చిందన్నారు. అలాగే అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి ఢిల్లీ వెళ్లి రాగా అతనికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. మొత్తంగా నాలుగు కేసులు నమోదయ్యాయి.

పేటలో మళ్లీ అలజడి  
నాయుడుపేటటౌన్‌: పట్టణంలో మళ్లీ అలజడి రేగింది. సోమవారం రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. కొద్దిరోజుల క్రితం ఆరు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సోమవారం రాత్రి ఆర్డీఓ సరోజినితో చర్చించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. సీఐ జి.వేణుగోపాల్‌రెడ్డి, కమిషనర్‌ లింగారెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్సై డి.వెంకటేశ్వరరావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రమాదేవి, వైద్యాధికారి దేదీప్యారెడ్డిలు పాజిటివ్‌గా తేలిన వారు ఎవరిని కలిశారో ఆరాతీస్తున్నారు.

విపత్కర పరిస్థితుల్లో సాయం చేద్దాం 
నెల్లూరు(సెంట్రల్‌): కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలకు సాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కోరారు. నెల్లూరు రూరల్‌ పరిధిలోని 2వ డివిజన్‌ అల్లీపురం, 21వ డివిజన్‌ వనంతోపు సెంటర్‌ ప్రాంతాల్లోని నిరుపేదలకు సోమవారం ఆయన ఉచితంగా కూరగాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లాక్‌డౌన్‌తో వలస కూలీలు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో అల్లీపురంలో అవగాల శ్రీనివాసులురెడ్డి, వనంతోపు ప్రాంతంలో అలహరి రఘు కూరగాయలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.

కూరగాయలు పంపిణీ చేస్తున్న  రూరల్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి  

నెల్లూరు రూరల్‌:  రూరల్‌ పరిధిలోని దొంతాలి గ్రామంలోని నిరుపేదలు, వలస కూలీలకు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్‌చార్జి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, నాయకులు మలినేని వెంకయ్యనాయుడు, చండి శంకరయ్య, హరిబాబు యాదవ్, తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు