కార్పొరేటరైతే..కోట్లే!

1 Nov, 2013 04:19 IST|Sakshi

నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ చివరి పాలకమండలిలో ఆమె ఒక కార్పొరేటర్.  కార్పొరేటర్ కాకముందు ఒక సాధారణ గృహిణి. నగరంలోని పొదలకూరురోడ్డు ప్రాంతంలో భర్త, పిల్లలతో కలిసి చిన్న పూరింట్లో నివాసం. ఐదేళ్లు కార్పొరేటర్ పదవీకాలం ముగిసే సమయానికి కోట్లకు పడగలెత్తారు. పూరింటి స్థానంలో ధగధగ మెరిసే మూడంతస్తుల మేడకు చేరారు. ఒకే ఒక్కసారి కార్పొరేటర్ పదవికి ఎన్నిక కావడంతో ఆమె ఆర్థికస్థితి ఊహించని స్థాయికి వెళ్లింది. ఆమె భర్త యువజన కాంగ్రెస్ కార్యకర్త. ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డికి విధేయుడిగా పేరుంది. ఆమె నివాసం ఉంటున్న డివిజన్ మహిళకు రిజర్వు కావడంతో వారి దశ తిరిగింది. బినామీ పేర్లతో కాంట్రాక్టులు, అడ్డగోలు వ్యవహారాలు, సెటిల్‌మెంట్లతో ఐదేళ్లలో కోట్లు సంపాదించారు.
 
 ఇక మరో మహిళా ప్రజాప్రతినిధి గురించి చెప్పాలంటే ఆమె సంపాదించిన ఆస్తులు వంద కోట్లకు పైగా ఉంటాయని రాజకీయవర్గాల్లో విస్తృత ప్రచారం ఉంది. మున్సిపల్ కౌన్సిలర్‌గా ఉంటూ కార్పొరేషన్ అయిన తరువాత కార్పొరేటర్ గాను ఇంకా ఉన్నత పదవులను అలంకరించిన ఆమెకు కూడా ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఆశీస్సులు ఉన్నాయి. కార్పొరేషన్‌లో ఆమె చెప్పిందే వేదం. ఇప్పటికీ ఆమె చక్రం తిప్పుతూనే ఉన్నారు. బినామీ పేర్లతో నగరంలో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేస్తున్నారు. సోదరుల పేరుతో లిక్కర్ వ్యాపారం కూడా నడిపిస్తున్నారు. స్వల్ప వ్యవధిలో రాజకీయంగా, ఆర్థికంగా ఆమె ఎదిగిన తీరు నగర కాంగ్రెస్‌లో దబ్దాలుగా ఆనం విధేయులుగా ముద్రపడిన వారికి కూడా కంటగింపుగా మారిందంటే అతిశయోక్తి లేదు.
 
 అతను రెండు దఫాలు మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఒక దఫా కార్పొరేటర్ కూడా. ఆయన ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కోటరీలో అత్యంత ముఖ్యులు.  నగరంలో ఆర్ అండ్ బి రోడ్లు, గృహ నిర్మాణ శాఖలో ఇళ్లు, కాలనీల నిర్మాణాల కాంట్రాక్టులు ఆయనవే. భూ కబ్జాల్లో అందె వేసిన చేయి. ప్రభుత్వ, కార్పొరేషన్ స్థలాలను అలవోకగా ఆక్రమించేస్తారు. ఆయన అండతో నగరంలోని పలు ఇరిగేషన్ కాలువలు కూడా స్వరూపాన్ని కోల్పోయాయి. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఇప్పుడు కోట్లకు కోట్లు సంపాదించారు. ఒకప్పుడు నాలుగో నగర పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ కూడా ఉండేది. ఇప్పుడు నగర అధికారపార్టీ రాజకీయాల్లో కీలకశక్తిగా వ్యవహరిస్తున్నారు.
 
 ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. స్వల్ప వ్యవధిలోనే కోటేశ్వరరావులైన మాజీ కార్పొరేటర్లు, చోటా నేతలు చాలామంది ఉన్నారు. నెల్లూరు నగరంలో అభివృద్ధి పేరుతో జరుగుతున్న పనుల్లో కోట్ల రూపాయల ప్రజాధనం ఇటువంటి వారి గుప్పెట్లోకి వెళుతోంది. అభివృద్ధి పనులు నాసిరకంగా జరుగుతున్నా అధికారయంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. అధికారం అండ ఉండటంతో వారిని అదుపు చేయడం సాధ్యం కావడం లేదు. ఇక టౌన్ ప్లానింగ్ విభాగంలో రాజకీయ జోక్యం మితిమీరింది. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న భవన నిర్మాణాలకు కార్పొరేషన్ నుంచి అనుమతులు రావడంలో అవినీతి కీలకపాత్ర పోషిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. వాస్తవానికి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రజాసేవకులు అని రాజ్యాంగం చెబుతోంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా రెండు రోజుల కిందట ఒక కేసులో స్పష్టం చేసింది.
 
 కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి వస్తారని కూడా కోర్టు తేల్చి చెప్పింది. అంటే అవినీతి, అక్రమాలకు పాల్పడిన అధికారులపై ఏసీబీ దాడులు చేస్తున్న తరహాలోనే కార్పొరేటర్లు, కౌన్సిలర్ల అవినీతిపైనా దృష్టిసారించినట్టయితే ప్రజాధనం దుర్వినియోగానికి అడ్డుకట్టపడినట్టు అవుతుంది. రాజస్థాన్‌కు చెందిన ఒక మాజీ కౌన్సిలర్ అక్రమార్జనపై ఏసీబీ దాడులు నిర్వహించి అరెస్ట్ చేసింది. ఈ కేసుకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం రెండు రోజుల కిందట తుది తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రజా సేవకులేనని, వారు అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి వస్తారని అప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న కౌన్సిలర్‌కు కింది కోర్టులు వేసిన శిక్షను ఖరారు చేసింది.
 
 ఈ తీర్పును పరిగణనలోకి తీసుకుని అవినీతి నిరోధక శాఖ ముందుకు సాగినట్టయితే నగర పాలక సంస్థల్లో అక్రమార్జనే ధ్యేయంగా కార్పొరేటర్ పదవులకు పోటీ పడుతున్న వారి స్థానంలో అంతోఇంతో సేవాభావం ఉన్న వారు కొలువు తీరే అవకాశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పు విషయం తెలుసుకున్న కొందరు మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో పోటీ చేసే అంశంపై బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసమన్నమైందని ఒక మాజీ కార్పొరేటర్ పేర్కొనడం గమనార్హం.
 - సాక్షి ప్రతినిధి, నెల్లూరు
 

మరిన్ని వార్తలు