రాంగ్‌ కాల్‌ రోమియోలు

3 Jan, 2020 13:00 IST|Sakshi

మహిళలను టార్గెట్‌ చేస్తున్న పోకిరీలు

వాట్సాప్‌లో అసభ్యకర మెసేజ్‌లు, ఫొటోలు

ఫిర్యాదు చేస్తే పట్టించుకోని పోలీసులు   

ఫోన్‌ కాల్‌ను బ్లాక్‌ చేయమని ఉచిత సలహా

కావలికి చెందిన దేవి (పేరు మార్చాం)కి చెందిన ఫోన్‌ నంబరుకు నెల రోజులుగా వాట్సాప్‌లో ఓ నంబరు నుంచి అసభ్యకరమైన సందేశాలు వస్తున్నాయి. మెసేజ్‌లతో పాటు అశ్లీల వీడియోలు, ఫొటోలు పంపిస్తున్నాడు. ఆ మెసేజ్‌లు చూసి ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెంది వాట్సాప్‌ మేసేజ్‌ల వేధింపులపై కావలి వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించకపోవడంతో మెసేజ్‌లు కొనసాగుతున్నాయి.  

నెల్లూరు నగరంలోని భక్తవత్సలనగర్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఫోన్‌ నంబర్‌కు వాట్సాప్‌లో అసభ్యకరమై సందేశాలు వచ్చాయి. దీంతో ఆమె తన కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు ఆమెనే అనుమానించి వేధించడం ప్రారంభించారు. నువ్వు వాడికి తెలియకపోతే నీ నంబరు ఎలా తెలుస్తుంది.. నీకెలా అంత ధైర్యంగా పంపిస్తాడంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారు. సంతోషంగా సాగిపోతున్న ఆమె కుటుంబంలో కలతలు చోటు చేసుకోవడంతో ఆమె మానసికంగా నరకాన్ని చవిచూస్తోంది. ఎవరో చేసిన తప్పుకు ఆమె శిక్ష అనుభవిస్తోంది.   

సాక్షి, నెల్లూరు: మహిళలకు ఇంటా.. బయటే కాదు.. ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్లలోనూ భద్రత లేకుండా పోతోంది. సంతోషంగా సాగిపోతున్న కుటుంబాల్లో రాంగ్‌ కాల్‌ చిచ్చు రగులుతోంది. కాపురాలు కూలిపోయే పరిస్థితులు నెలకొంటున్నాయి. పోకిరీలు మహిళలను టార్గెట్‌ చేసి వారిని లొంగదీసుకునేందుకు ‘మిస్డ్‌ కాల్‌’ వలలు విసురుతున్నారు. మహిళల అభద్రతాభావాన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఫేక్‌ ఐడీలతో సిమ్‌లు సేకరిస్తున్నారు. ఏదొక నంబర్లకు కాల్‌ చేస్తున్నారు. ఎవరిదో మిస్డ్‌ కాల్‌ వచ్చిందని తిరిగి చేస్తే.. అది మహిళ గొంతు అయితే రాంగ్‌ కాల్‌ వచ్చిందంటూ మాటలు కలుపుతున్నారు. ఆ నంబర్లకు వాట్సాప్‌ ఆప్షన్‌ ఉంటే.. దానికి అశ్లీల ఫొటోలు, వీడియోలు పంపిస్తున్నారు. వీరి మెసేజ్‌లకు ఎవరైనా తిరిగి రెస్పాండ్‌ అయితే.. ఆ మెసేజ్‌లను అడ్డం పెట్టుకునిబ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారు. ఫోన్‌ నంబర్ల ఆధారంగా వాట్సాప్, ఫేస్‌బుక్‌లోని కుటుంబ సభ్యులతో ఉన్న ఫొటోలు సేకరించి, వాటి ద్వారా అశ్లీల వీడియోలు, ఫొటోలుగా మార్ఫింగ్‌ చేసి వారికే పంపించి ఆర్థికంగా బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై చాలా వరకు పోలీస్‌స్టేషన్లకు వెళ్లడం లేదు. వీలైనంత వరకు సిమ్‌ నంబర్లు మార్చేసుకోవడం, ఖాతాలను బ్లాక్‌ చేసుకోవడం చేస్తున్నారు.  

కూలిపోతున్న కాపురాలు.. కుటుంబాల్లో కలతలు
రాంగ్‌ కాల్‌ రోమియోలు చేష్టలకు కొన్ని కుటుంబాల్లో కలతలు చోటు చేసుకుంటుంటే.. మరి కొన్ని కాపురాలు కూలిపోతున్నాయి. ఇందుకు ఉదాహరణే.. నెల్లూరు భక్తవత్సలనగర్‌ ప్రాంతానికి చెందిన మహిళ ఉదంతం. ఇంకా వెలుగుచూడని ఘటనలు ఎన్నో ఉన్నాయి. అశ్లీల వీడియోలు, చిత్రాలతో మహిళలను మానసికంగా కుంగిపోయేలా చేస్తున్నారు. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలోకి నెట్టేస్తున్నారు. కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్తే ఎక్కడ అపార్థం చేసుకుంటే.. ఏ పరిస్థితులకు దారి తీస్తాయో అనే భయంతో కుమిలిపోతున్నారు. ఈ పోకిరీల వలలో పడి కొందరు మహిళలు మోసపోయి జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. 

వేధించడానికి ఆయుధంగా..
తమను ఇబ్బంది పెట్టిన మహిళలను వేధించడానికి కూడా కొందరు ఆయుధంగా వాడుకుంటున్నారు. కావలి మహిళకు పంపుతున్న మెసేజ్‌లు చూస్తుంటే.. ఆమెను మానసికంగా ఇబ్బంది పెట్టడానికే అన్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల ఆమె భూవివాదం విషయంలో నెల్లూరుకు చెందిన ఓ టీడీపీ నేతతో పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఇలాంటి మెసేజ్‌లు రావడంతో ఆ చోటా టీడీపీ నేతే తనను టార్గెట్‌ చేసి, వాట్సాప్‌లో అసభ్యకరమైన వీడియోలు, ఫొటోలు పంపిస్తున్నట్లు అనుమానిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. 

పోలీసులకు చెప్పినా..  
మహిళల భద్రత విషయంలో ఇప్పటికే ఎన్నో చట్టాలు ఉన్నాయి. దేశంలోనే ఎక్కడ లేని విధంగా దిశ చట్టాన్ని తీసుకువచ్చింది. కానీ మహిళలపై ఇలాంటి వేధింపుల విషయంలో పోలీసులు ఏ మాత్రం కఠిన చర్యలు చేపట్టడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా కావలికి చెందిన దేవి వాట్సాప్‌లో వేధింపుల విషయంలో గత డిసెంబర్‌ 10న ఫిర్యాదు చేసింది. కానీ స్థానిక పోలీసులు విచారణ కూడా చేపట్టకపోగా ఆ నంబర్‌ను బ్లాక్‌ చేసుకోమని ఉచిత సలహా ఇచ్చారు. పోలీసుల ప్రవర్తన వల్ల మహిళలు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయలేకపోతున్నారు. ఏటా మహిళలపై వేధింపుల ఫిర్యాదులు తగ్గుతున్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నా వాస్తవంగా పోలీసుల తీరుపై నమ్మకం లేక వెలుగులోకి తేలేకపోతున్నారు. 

మరిన్ని వార్తలు