-

పసికందుల ఆక్రందన

17 Aug, 2014 04:33 IST|Sakshi
పసికందుల ఆక్రందన
  •      ఆందోళన కలిగిస్తున్న  శిశు మరణాలు
  •      రుయా చిన్న పిల్లల ఆస్పత్రిలో మూడేళ్లలో 149 మంది మృతి
  •      ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వహణ లోపమే కారణం
  • ప్రభుత్వ నిర్లక్ష్యం, వైద్యాధికారుల నిర్వహణా లోపం పసికందుల పాలిట శాపంగా మారింది. నిత్యం చిన్నారుల కేర్‌కేర్‌మనే శబ్దాలు వినపడాల్సిన రుయా చిన్నపిల్లల ఆస్పత్రి వారి ఆక్రందనలు, తల్లిదండ్రుల రోదనలతో మార్మోగుతోంది.
     
    తిరుపతి అర్బన్: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండున్నర నెలలు కావస్తున్నా జిల్లాలో వైద్యశాఖ పరంగా ఎలాంటి అభివృద్ధీ జరగలేదనడానికి ఈ ఆస్పత్రిలో సంభవిస్తున్న శిశు మరణాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. గడచిన మూడేళ్లలో ఇక్కడ 149 మంది శిశువులు మరణించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

    2012 ఆగస్టు 15 నుంచి రెండు నెలలపాటు ఇక్కడ సంభవించిన శిశు మరణాలపై మీడియాలో వచ్చిన వరుస కథనాలకు అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు. ఆస్పత్రి సందర్శనకు వచ్చిన సందర్భంలో ఇక్కడ అన్ని వైద్య సదుపాయాలు, వైద్యుల నియామకం చేపట్టాల్సిన అవసరముందని నొక్కి వక్కాణించారు. ఆయన అధికారంలోకి వచ్చి రెండున్నర నెలలు పూర్తయినా ఇంతవరకు ఎలాంటి సౌకర్యాలూ ఏర్పాటు చేయలేదని  వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఆస్పత్రికి చిన్నారులతో వచ్చే అమ్మలకు కష్టాలు తప్పడం లేదు.
     
    ప్రధాన వైద్య యంత్రాలు లేవు
     
    ఎస్వీ మెడికల్ కాలేజీ పరిధిలో నిర్వహిస్తున్న చిన్న పిల్లల ఆస్పత్రికి ప్రతిరోజూ 200 మంది శిశువులను ఓపీకి తీసుకొస్తుంటారు. వారిలో 150 మందికి పైగా నెలలు నిండని వారు, తక్కువ బరువున్న వారు, వివిధ ఇన్‌ఫెక్షన్లు, జన్యులోపాలుండే వారే ఎక్కువగా ఉంటారు. వారందరికీ అవసరమైన ఇంక్యుబేటర్లు, వెంటిలేటర్లు చాలినన్ని లేకపోవడంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. శిశువులకు అత్యవసర స్కానింగ్ చేయించాలంటే పరుగులు తీయాల్సిన పరిస్థితి. కనీసం ఎంఆర్‌ఐ స్కానింగ్ మిషన్ కూడా లేకపోవడంతో బయటకు రెఫర్ చేస్తున్నారు.
     
    ప్రొఫెసర్లు, వైద్యులు, నర్సులకూ కొరతే

     
    చిన్న పిల్లల విభాగంలో వైద్యమంటేనే ఎంతో అనుభవం గడించిన ప్రొఫెసర్లు అవసరం. ఈ ఆస్పత్రిలో ఒక పిడియాట్రిక్ సర్జన్, రెండు ప్రొఫెసర్ ఉద్యోగాలు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. పీఐసీయూ, ఎన్‌ఐసీయూ, పిడియాట్రిక్ న్యూరో, నెఫ్రాలజీ విభాగాలతోపాటు జనరల్ వార్డులు, ఐసీయూలు ఉన్నా యి. షిఫ్టుకు 20 మంది స్టాఫ్ నర్సులు ఉండాల్సి ఉండగా కేవలం 13 మంది మాత్రమే ఉన్నారు. ఆ దిశగా రుయా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఫలితం లేదు.
     
    ఆక్సిజన్ ప్లాంట్‌కు నిర్వహణ  లేమి
     
    చిన్న పిల్లల ఆస్పత్రికి వెనుకవైపున కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్‌ఆర్‌హెచ్‌ఎం నిధులతో ఏడాది క్రితం సుమారు 6వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ ద్వారా ఎక్కువ శాతం ఆక్సిజన్ చిన్న పిల్లల ఆస్పత్రికే ఖర్చవుతోందని వైద్యాధికారులు చెబుతున్నారు. వారానికి 1000 లీటర్ల ఆక్సిజన్ కావాల్సి వస్తోంది. నిర్వహణా లేమి కారణంగా కొన్ని సందర్భాల్లో ఆక్సిజన్ సరఫరా చేసే ఏజెన్సీకి సకాలంలో బకాయిలు చెల్లించక వారు ఆలస్యం చేస్తున్నారు. అలాంటి సమయాల్లో శిశువులకు ఆక్సిజన్ అందక మరణాలు సంభవిస్తున్నాయి.
     
    సిబ్బంది లేకపోవడంతో బయటి ఆస్పత్రికి వెళ్లాం
     
    మా బాబుకు వీపుపై గడ్డ లేచింది. రుయా చిన్న పిల్లల ఆస్పత్రికి వచ్చాం. వైద్యుల సిఫారసు మేరకు పరీక్షలు చేయించడానికి ల్యాబ్ వద్దకు వెళ్లాం. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వేచి ఉన్నా ఎవరూ రాలేదు. సెక్యూరిటీ సిబ్బంది సాయంతో బయట ల్యాబ్‌లకు వెళ్లాం. ల్యాబ్ సిబ్బంది ఆలస్యం వల్ల మేము ఇబ్బంది పడాల్సి వచ్చింది. బిడ్డకు సకాలంలో వైద్య సేవలు అందలేదు.
     -పెంచలయ్య, రాధా దంపతులు, వైఎస్సార్ జిల్లా అట్లూరు
     
    స్కానింగ్ ఎక్కడ చేస్తారో తెలియక ఇబ్బంది పడ్డాం
     
    నాలుగు నెలల కొడుకును తీసుకుని సాధారణ పరీక్షల కోసం చిన్న పిల్లల ఆస్పత్రికి వచ్చాను. ప్రసవం కూడా ఇక్కడే జరగడంతో వైద్యుల సలహా మేరకు పరీక్షలు చేయిస్తున్నా. మంగళవారం పరీక్షల కోసం రావడంతో గుండెకు సంబంధించిన స్కానింగ్ కోసం వైద్యులు సిఫారసు చేశారు. కార్డియాలజీ విభాగం ఎక్కడుందో తెలియలేదు. ఎవరిని అడిగినా సమాధానం చెప్పలేదు. దానికోసం గంటల తరబడి తిరగాల్సి వచ్చింది.
     -లక్ష్మి(పేరు మార్చాం), పాకాల మండలం
     

మరిన్ని వార్తలు