పవన్‌ పూటకో మాట.. రోజుకో వేషం

23 Mar, 2019 13:48 IST|Sakshi
కేసీఆర్‌తో పవన్‌ కళ్యాణ్‌ (ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌ : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వ్యవహారశైలిపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ పాలన భేష్‌ అంటూ ఇదివరకు కితాబిచ్చిన పవన్‌ ఇప్పడు యూటర్న్‌ తీసుకోవడంపై సోషల్‌ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఏపీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా భిన్న కులాలు, మతాల వారైనా తెలంగాణకు వెళితే మనల్ని ఆంధ్రావారంటూ కొడుతున్నారని, మరి దీన్ని ఎలా చూస్తారంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని లేపాయి.

ఇది వరకు పలు సందర్భాల్లో పవన్‌ మాట్లాడుతూ.. 'ప్రతిసారి ఏ మీటింగ్‌కు వెళ్లినా తెలంగాణ నాయకుల స్పూర్తిని తీసుకోవాలని చెబుతుంటా. కేసీఆర్‌ ఉద్యమాన్ని నడిపిన స్పూర్తిని హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలి. దశాబ్ధాలుగా తెలంగాణ సాధణకోసం పోరాడుతుంటే అందరిని ఏకీకృతం చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో కేసీఆర్‌ ప్రధానమైన భూమిక పోషించారు. ఉద్యమంలోనే కాకుండా కేసీఆర్‌ పరిపాలన కూడా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది' అని పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ఇప్పుడు మాత్రం తెలంగాణా ఏమన్నా పాకిస్థాన్‌ అనుకుంటున్నారా.. అక్కడేదో నాకు ఇల్లుందని, ఆస్తులున్నాయని, పదెకరాల భూములున్నాయనే భయం లేదు. ఏం భూములు తీసుకుంటారా? తీసుకోమనండి అంటూ వ్యాఖ్యానించారు. సవాలుకు ప్రతిసవాలుగానో లేక సందర్భాను సారంగానో కాకుండా కేవలం ఎన్నిక కోణంలోనే పవన్‌ చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో చర్చజరుగుతుంది. 

‘ప్రశ్నించడానికే జనసేన’ అంటూ పవన్‌కల్యాణ్‌ ఏర్పాటుచేసిన పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా అధికార పార్టీ నీడగా సాగుతూ వచ్చి ప్రస్తుత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ‘బీ’ టీమ్‌గా స్థిరపడిపోయిందని నెటిజన్లు మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని, ఈ ఎన్నికల్లో టీడీపీతో చీకటి ఒప్పందాలు పెట్టుకుని రోజుకో వేషం వేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. పవన్‌ యూటర్న్‌ మాటలకు సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

మరిన్ని వార్తలు