మహిళల రక్షణ కోసం కొత్త చట్టం

5 Dec, 2019 04:01 IST|Sakshi

హోంమంత్రి మేకతోటి సుచరిత వెల్లడి 

‘దిశ’ లాంటి ఘటన జరిగితే వెంటనే శిక్ష  

ఇప్పటికే సైబర్‌ మిత్ర, మహిళా మిత్ర.. 

తాజాగా ‘బీ సేఫ్‌’ యాప్‌ ఆవిష్కరణ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళల రక్షణకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. బుధవారం సచివాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘దిశ’ లాంటి  ఘటనలు జరిగినప్పుడు నిందితులకు తక్షణం శిక్ష పడేలా కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు.

నిందితులను ఉరి తీయాలని దేశవ్యాప్తంగా డిమాండ్‌ చేస్తుంటే.. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ బాధ్యతా రాహిత్యంగా చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని సుచరిత అన్నారు. ఈ దుర్ఘటనపై సీఎం తీవ్రంగా చలించిపోయారని, అందుకనే రాష్ట్రంలో అటువంటి ఘటనలు జరగకుండా కఠినమైన చట్టాలను తీసుకొస్తున్నారని వివరించారు. ఇప్పటికే సైబర్‌ మిత్ర, మహిళా మిత్ర (9121211100)ను ప్రవేశ పెట్టడంతో పాటు ఈ మధ్యనే ‘బీ సేఫ్‌’ అనే యాప్‌ను  ప్రవేశ పెట్టామని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులను  నియమించామన్నారు. 

>
మరిన్ని వార్తలు