శాండ్ స్లిప్పుల గోల్‌మాల్

3 Feb, 2015 03:51 IST|Sakshi
శాండ్ స్లిప్పుల గోల్‌మాల్

ఇసుక తరలింపులో మాయాజాలం
అధికారులతో తమ్ముళ్లు కుమ్మక్కు
ఇసుక అక్రమ రవాణాలో కొత్తకోణం
సర్కారుకు కొంత.. అక్రమార్కులు నొక్కేది మరింత.
.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ఇసుక అక్రమ రవాణాలో కొత్తకోణం వెలుగుచూసింది. అధికారులు ముద్రించిన స్లిప్పుల్లో గోల్‌మాల్ చేసి పెద్దఎత్తున దోచుకుంటున్నారు. ఇసుక తరలింపు ద్వారా ప్రభుత్వానికి 25 శాతం చెల్లిస్తుంటే.. అక్రమార్కులు మాత్రం 75 శాతం నొక్కేస్తున్నారు. ఈ దందాలో సంబంధిత అధికారుల పాత్రే ఎక్కువగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకెళితే.. ప్రభుత్వం ఇసుక రీచ్‌లను డ్వాక్రా మహిళలకు అప్పగించిన విషయం తెలిసిందే.

పేరు మహిళలదే అయినా... ఇసుక రవాణాలో పెత్తనమంతా  టీడీపీ నేతలదే కావటం గమనార్హం. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల మేరకు ఇసుక తరలిస్తున్నామంటూ.. అటు సర్కారు కళ్లుగప్పి కొందరు అధికారులు, మరికొందరు తమ్ముళ్లు పెద్దఎత్తున జేబులు నింపుకుంటున్నారు. జిల్లాలో 80 ఇసుక రీచ్‌లను గుర్తించారు. అధికారికంగా అయితే ఆరు రీచ్‌లకే అనుమతి ఉంది. అయితే అధికారుల సహకారంతో 42 రీచ్‌లలో ఇసుకను తవ్వుకుంటున్నారు.

ముఖ్యంగా నెల్లూరు, కోవూరు, సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల పరిధిలోని ఇసుక రీచ్‌ల ద్వారా పెద్దఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. పెద్దమొత్తంలో ఇసుక అవసరమని అడిగిన కంపెనీల పేరుతో అక్రమరవాణా చేస్తున్నట్లు సమాచారం.

లెక్కల్లో మాయాజాలం...

అధికారులు చెబుతున్న లెక్కలకు.. వాస్తవ పరిస్థితులకు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. జిల్లాలో 1,18,061 క్యూబిక్ మీటర్ల ఇసుక విక్రయాల ద్వారా సుమారు రూ.6 కోట్లకుపైగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరినట్లు వెల్లడైంది. వాస్తవంగా అయితే 3 లక్షల క్యుబిక్ మీటర్లకుపైగా ఇసుక తవ్వి విక్రయించినట్లు సమాచారం.

అయితే ఇసు క అక్రమ రవాణాకు పాల్పడ్డారంటూ 151 కేసు లు నమోదు చేసి 353 మందిని అరెస్టు చేశారు. అదేవిధంగా 284 వాహనాలను సీజ్ చేశారు. ఈ కేసులు, అరెస్టులను పరిశీలిస్తే ఎంత పెద్దఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతుందో చెప్పొచ్చు. అయితే అసలు దొంగలు మాత్రం దొరల్లా తిరుగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అసలు విషయమేమిటంటే..

ఏదైనా కంపెనీ ఇసుక కావాలని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటుంది. వారి వినతిని డీఆర్‌డీఏకు పంపుతారు. ఆ తర్వాత ఆర్డీఓకు చేరుతుంది. ఆర్డీఓ నుంచి తహశీల్దార్‌కి చేరితే.. తహశీల్దార్ క్షేత్రస్థాయిలో విచారించి ఆ కంపెనీ వారు అడిగిన ంత ఇచ్చే వీలుందా? లేదా? అని తిరిగి డీఆర్‌డీఏకు పంపుతారు. కంపెనీ వారు వెయ్యి క్యూబిక్ మీటర్ల ఇసుక కావాలని అడిగితే.. కొందరు అధికారులు, ఇసుక రీచ్‌ల వద్ద ఉన్న కిందిస్థాయి అధికారులు కుమ్మక్కై 5వేల క్యుబిక్ మీటర్ల ఇసుకను తోడేస్తారు.

కంపెనీ పేరుతో స్లిప్పుల్లో రాసి తమిళనాడు లేదా ఇతరులకో విక్రయిస్తారు. అందులో వెయ్యి క్యూబిక్ మీటర్ల ఇసుకను తెలుపురంగులో ఉన్న బిల్లులో నమోదు చేస్తారు. ఆ బిల్లులో నమోదు చేసిన ఇసుకకు సంబంధించిన మొత్తం ప్రభుత్వానికి చేరుతుంది. మిగిలిన 4 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను కార్బన్ తీసివేసి పింక్, పసుపు బిల్లులపై అదే కంపెనీ పేరుతో అక్రమంగా విక్రయిస్తున్నారు.

ఈ బిల్లులు రాసేది అధికారులే కావటం గమనార్హం. వాహన డ్రైవర్ లేదా యజమానితో ముందే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం డబ్బులు తీసుకుని పంపేస్తారు. ఒక్కో వాహనం ఇసుకను డిమాండ్‌ను బట్టి రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు విక్రయిం చి సొమ్ముచేసుకుంటున్నట్లు సమాచారం.

రోజుకు వంద లారీల్లో అక్రమ రవాణా..

రీచ్‌లలో ఇసుకను తీసేందుకు ఎటువంటి యం త్రాలను వాడకూడదనే నిబంధన ఉంది. అధికారుల సాక్షిగానే జేసీబీలతో రాత్రుల్లో ఇసుకను తో డి లారీల్లో నింపి తరలిస్తున్నారు. డిసెంబర్ 18 నుంచి 31వరకు జరిగిన ఇసుక తవ్వకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగి నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఒక్క పొట్టేపాళెం రీచ్ నుం చే రోజుకు 30 లారీల ఇసుకను అక్రమంగా విక్రయించారనే విమర్శలున్నాయి. జిల్లావ్యాప్తంగా చూస్తే వంద లారీల ద్వారా ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ముచేసుకున్నట్లు తెలిసింది. ఇసుక అక్రమరవాణాలో అధికారుల పాత్ర ఉందనే విష యం గుప్పుమనటంతో డ్వాక్రా మహిళలు ఎవరికి ఫిర్యాదు చేయాలో దిక్కుతోచక ఉన్నతాధికారులకు లేఖరాసినట్లు విశ్వసనీయ సమాచారం.

మరిన్ని వార్తలు