బార్ల లైసెన్సుల రద్దు

23 Nov, 2019 04:15 IST|Sakshi

జనవరి 1 నుంచి నూతన బార్ల విధానం

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

నేటి నుంచి బార్లలో భారీగా మద్యం ధరలను పెంచుతూ ఉత్తర్వులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్సులను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బార్లతోపాటు స్టార్‌ హోటళ్లు, మైక్రో బ్రూవరీల లైసెన్సులు కూడా రద్దు కానున్నాయి. దశల వారీ మద్యనిషేధం, నియంత్రణలో భాగంగా ప్రస్తుతం ఉన్న 797 బార్లలో 40 శాతం(319) మూసేయనున్నారు. మిగిలిన 60 శాతం (478 బార్లు)కు జనవరి 1 నుంచి కొత్తగా లైసెన్సులు జారీ చేయనున్నారు. అదేవిధంగా కొత్త బార్లకు లైసెన్సు ఫీజులను భారీగా పెంచింది. ఈ మేరకు బార్ల రద్దు, కొత్త బార్ల పాలసీకి సంబంధించి ప్రభుత్వం శుక్రవారం వేర్వేరుగా ఉత్తర్వులు ఇచ్చింది.

వచ్చే ఏడాది జనవరి 1 నుంచి.. 2021 డిసెంబర్‌ 31 వరకు రెండేళ్లపాటు కొత్త బార్ల పాలసీ అమల్లో ఉంటుంది. దీని ప్రకారం.. బార్‌ లైసెన్స్‌ దరఖాస్తు ఫీజును రూ.10 లక్షలుగా నిర్ణయించారు. దరఖాస్తు చేసుకున్నవారికి బార్‌ లైసెన్సు వచ్చినా, రాకున్నా ఈ రుసుం తిరిగి చెల్లించరు. బార్లలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే మద్యం సరఫరా చేస్తారు. ఆహార పదార్థాలను 11 గంటల వరకు అందిస్తారు. త్రీస్టార్,ఆపై స్థాయి హోటళ్లలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం అందుబాటులో ఉంటుంది. ఆహారాన్ని అర్ధరాత్రి 12 గంటల వరకు సర్వ్‌ చేస్తారు. 

లాటరీ విధానంలో బార్ల కేటాయింపు
పేద, సామాన్య ప్రజానీకానికి మద్యాన్ని దూరం చేసేందుకు సెప్టెంబర్‌ 30న మద్యం బాటిళ్ల రేట్లను భారీగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్లే ఇప్పుడు బార్లలోనూ మద్యం ముట్టుకుంటే భారీ షాక్‌ కొట్టేలా అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ కింద ధరలను పెంచారు. ఈ నిర్ణయం శనివారం నుంచి అమల్లోకి వస్తుంది. జనవరి 1 నుంచి ఏర్పాటయ్యే బార్లను లాటరీ విధానంలో ఆయా జిల్లాల కలెక్టర్లు దరఖాస్తుదారులకు కేటాయిస్తారు. బార్ల లైసెన్సుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రూ.10 లక్షల చలానా, బార్‌ ఏర్పాటు చేసే ప్రదేశానికి చెందిన ప్లాన్, అద్దెకు తీసుకుంటే యజమాని నుంచి కన్సెంట్‌ లెటర్‌ను సమర్పించాలి.   

>
మరిన్ని వార్తలు