పెళ్లైన నెల రోజులకే..నవ వధువు ఆత్మహత్య

29 Sep, 2018 12:17 IST|Sakshi

భర్త వేధింపులే కారణమని తల్లిదండ్రుల ఆరోపణ

లావేరులో విషాదఛాయలు

శ్రీకాకుళం జిల్లా/ లావేరు: పెళ్లయిన నెల రోజులుకే నవవధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం రాత్రి విశాఖపట్నం జిల్లా కూర్మన్నపాలెంలో చోటుచేసుకుంది. వధువు సోదరుడు లంకలపల్లి కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..లావేరు గ్రామానికి చెందిన లంకలపల్లి సూర్యనారాయణ, గోవిందమ్మ దంపతుల మూడో కుమార్తె రోహిణి(25)ని ఆమదాలవలస పట్టణంలోని పెంటయ్యకాలనీకు చెందిన యర్నాగుల వెంకటరావు, వెంకటరత్నం దంపతుల కుమారుడు మోహన్‌కుమార్‌తో ఈ ఏడాది ఆగస్టు 25న వివాహం చేశారు.

 మోహన్‌కుమార్‌ విశాఖపట్నం జిల్లా పరవాడలో ఫార్మా కంపెనీలో అసిస్టెంట్‌ మేనేజరుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 3న విశాఖపట్నంలోని కూర్మన్నపాలెంలో అపార్టుమెంటును అద్దెకు తీసుకొని నూతన దంపతులు ఉంటున్నారు. ఈ నెల 27న సాయంత్రం మోహన్‌కుమార్‌ డ్యూటీ నుంచి అపార్టుమెంటుకు తిరిగి రాగా భార్య రోహిణి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించాడు. వెంటనే ఈ విషయాన్ని లావేరులోని అత్తమామాలుకు ఫోన్‌లో తెలియజేయడంతో వారు గురువారం రాత్రి అపార్టుమెంటుకు చేరుకుని బోరున విలపించారు. రోహిణి సోదరుడు, కుటుంబ సభ్యులు అర్ధరాత్రి సమయంలోనే అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

వేధింపులు తట్టుకోలేకే: రోహిణి కుటుంబ సభ్యులు
భర్త మోహన్‌కుమార్‌ వేధింపులు తట్టుకోలేకే రోహిణి ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు సూర్యనారాయణ, గోవిందమ్మ, సోదరుడు కృష్ణలు శుక్రవారం ‘సాక్షి’తో తెలిపారు. కట్నకానుకలు బాగానే ఇచ్చి పెళ్లి చేశామని, పెళ్లి సరదాలు తీరకముందే వేధింపులకు కుమార్తె బలైపోయిందని కన్నీరుమున్నీరుగా విలపించారు. తనతో చనువుగా ఉండటం లేదని కుమార్తె చెప్పినా..సర్దుకుంటారులే అని అనుకున్నామని, ఇంతలోనే ఆత్మహత్య చేసుకుందని వాపోయారు. దీనికంతటికీ కారణమైన మోహన్‌కుమార్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మృతదేహాన్ని శుక్రవారం సాయంత్రం లావేరు తీసుకురావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

మరిన్ని వార్తలు