45 రోజుల్లో కొత్త రాజధాని, ఆర్థిక ప్యాకేజి!

13 Feb, 2014 17:33 IST|Sakshi

కొత్తగా ఏర్పాటు కాబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 45 రోజుల్లోగా కొత్త రాజధానిని ఎంపిక చేస్తామని, అలాగే ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి పన్ను రాయితీలు ఇస్తామని కేంద్రం చెబుతోంది. అత్యంత వివాదాస్పద రీతిలో లోక్సభలో తాము ప్రవేశపెట్టినట్లు చెబుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఈ విషయాలు పేర్కొన్నట్లు పీటీఐ తన కథనంలో తెలిపింది. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు హైదరాబాద్ నగరం పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కూడా ఆ బిల్లులో పేర్కొన్నారు.

కృష్ణా, గోదావరి నదీజలాల పంపిణీ సజావుగా సాగేందుకు కేంద్రం ఓ అత్యున్నత మండలిని ఏర్పాటుచేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిని ఉమ్మడి రాజధానిగా పరిగణిస్తారు. రెండు రాష్ట్రాల్లోను పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధి జరిగేందుకు వీలుగా తగిన ఆర్థికపరమైన చర్యలను తీసుకుంటారు. కొత్త రాజధాని నగరంలో అత్యవసర సౌకర్యాల ఏర్పాటుకు కావల్సిన ప్రత్యేక ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వమే అందిస్తుంది. కొత్తగా రాజ్ భవన్, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, శాసన మండలి భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేస్తుంది. కొత్త రాజధాని ఏర్పాటుకోసం అవసరమైతే అటవీ భూమిని డీనోటిఫై కూడా చేస్తుంది. రెండు రాష్ట్రాలకూ ఒకరే గవర్నర్ ఉంటారు. ఆయనకు హైదరాబాద్ వాసుల భద్రత, వారి ఆస్తుల రక్షణ బాధ్యతలను కూడా అప్పగిస్తారు.

మరిన్ని వార్తలు