‘న్యూ’ కలెక్టరేట్ కాంప్లెక్స్

17 Jan, 2014 05:27 IST|Sakshi

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రకాశంభవనం రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ప్రభుత్వ శాఖల కార్యాలయాలన్నీ ఒకేచోటికి రానున్నాయి. ప్రకాశంభవనంతో పాటు దానికి ఎదురుగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో 8 అంతస్తుల చొప్పున రెండు భవనాలు నిర్మించేందుకు ప్లాన్ సిద్ధమైంది. 750 మందితో ఒకేసారి సమావేశం నిర్వహించేందుకు వీలుగా కాన్ఫరెన్స్ హాలును కూడా డిజైన్ చేశారు.
 
రెండు బ్లాక్‌లను కలుపుతూ అండర్ గ్రౌండ్ సబ్‌వే, ఫ్లైఓవర్లను నిర్మించనున్నారు. ఇందు కోసం 105 కోట్ల రూపాయలు అవసరమవుతాయని కలెక్టర్ విజయకుమార్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి ఎన్.రఘువీరారెడ్డి, మున్సిపల్ శాఖామంత్రి మానుగుంట మహీధరరెడ్డిల దృష్టికి న్యూ కలెక్టరేట్ కాంప్లెక్స్ విషయాన్ని కలెక్టర్ తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడి త్వరితగతిన నిధులు విడుదలయ్యేలా చూస్తానని ఇద్దరు మంత్రులూ హామీఇచ్చారు. న్యూ కలెక్టరేట్ కాంప్లెక్స్‌కు నిధులు మంజూరైతే వెంటనే నిర్మాణ పనులు చేపట్టి జిల్లాకే తలమానికంగా తీర్చిదిద్దేలా రూపకల్పన చేస్తున్నారు.
 
 సోలార్ టవర్స్, సెంట్రల్ లైటింగ్ సిస్టం...
 కొత్త కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మిస్తే ఆ ప్రాంతమంతా వెలుగులు విరజిమ్మనున్నాయి. కాంప్లెక్స్‌పై సోలార్ టవర్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తి పడిపోయి సరఫరాకు తీవ్ర ఆటంకాలు కలిగే అవకాశాలుండటంతో ముందు జాగ్రత్తగా సోలార్ టవర్స్‌కు డిజైన్ చేశారు. సోలార్ టవర్స్ వల్ల నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యే అవకాశాలున్నాయి. కీలకమైన సమావేశాలు జరిగే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినా సోలార్ టవర్స్ ద్వారా పునరుత్పత్తి చేసి ఎలాంటి ఆటంకం లేకుండా సమావేశాలు జరిగేందుకు వీలుగా కసరత్తు చేస్తున్నారు. సెంట్రల్ లైటింగ్ సిస్టం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రకాశంభవనంతో పాటు దానికి ఎదురుగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలను కలుపుతూ నిర్మాణాలు పూర్తయిన తర్వాత మధ్యలో సెంట్రల్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేయనున్నారు.
 
 కష్టాలకు చెక్...
 న్యూ కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మిస్తే అధికారులు, ఉద్యోగులతో పాటు ప్రజల కష్టాలు కూడా తీరే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ప్రకాశంభవనం శిథిలావస్థకు చేరుకుంది. శ్లాబు, గోడల నుంచి పెచ్చులూడి పడుతుండటంతో అధికారులు, సిబ్బంది అసౌకర్యానికి గురవుతున్నారు. వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలు కురిసిన సమయాల్లో ప్రాణాలు అరచేత పట్టుకుని విధులు నిర్వర్తించాల్సిన దుస్థితి నెలకొంది. పైఅంతస్తు కారిడార్‌లో నడుచుకుంటూ వెళ్తున్న అధికారులు, సిబ్బంది, ప్రజలపై కూడా పెచ్చులూడిపడిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది ప్రకాశంభవనం పైఅంతస్తు శ్లాబ్‌కు మరమ్మతులు కూడా చేశారు. అయినప్పటికీ తాత్కాలిక ఉపశమనం తప్ప శాశ్వత ప్రయోజనాలు లేకుండా పోయాయి. ప్రకాశం భవనం ఎదురుగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల సముదాయం కూడా కార్యాలయాలకు అనుకూలంగా లేదు. జిల్లా ప్రభుత్వ వైద్యశాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించిన భవనం కావడంతో కార్యాలయాల నిర్వహణకు గదులు సౌకర్యంగా లేవు. అది కూడా ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. ఆయా కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందితో పాటు వివిధ పనులపై వచ్చే ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ భవన సముదాయంలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండి నిరుపయోగంగా ఉంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత కలెక్టర్ విజయకుమార్ న్యూ కలెక్టరేట్ కాంప్లెక్స్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. ఇండియా గేట్ మోడల్‌లో ఉన్న కొత్త కలెక్టరేట్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తే నగరానికే సరికొత్త అందం వస్తుంది.
 

మరిన్ని వార్తలు