ఎంబీబీఎస్‌ విద్యార్థులకు కొత్త కరిక్యులం

9 Aug, 2019 10:24 IST|Sakshi

సాక్షి, అమరావతి: వైద్య పద్ధతులు కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ఎంబీబీఎస్‌ విద్యార్థులకు కొత్త కరిక్యులం రూపొందించారు. ఎర్లీ క్లినికల్‌ ఎక్స్‌పోజర్‌ పేరుతో బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ (భారతీయ వైద్య మండలి రద్దు అనంతరం ఏర్పాటు అయిన బోర్డు) కొత్త మార్గదర్శకాలు విడుదల చేశారు. సాధారణంగా ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు కేవలం అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ సబ్జెక్టులు మాత్రమే చదువుతారు. రెండో ఏడాది నుంచి రోగుల వార్డులోకి పంపిస్తారు. ఇకపై అలా కాకుండా మొదటి ఏడాది నుంచే రోగుల పర్యవేక్షణకు పంపించాలని నిర్ణయించారు. రోగులకు నిర్వహించే పరీక్షలు, ఆపరేషన్లు, ఈసీజీ ఇలా ప్రతి వైద్య ప్రక్రియలోనూ ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని కొత్త కరిక్యులంలో రూపొందించారు.

చాలామంది ఎంబీబీఎస్‌ పూర్తయ్యే నాటికి కూడా రోగులతో ఎలా వ్యవహరించాలి? చికిత్స అందించడంలో వారికి ఎలాంటి నమ్మకం కలిగించాలి? చికిత్స పద్ధతులు వంటివి తెలుసుకోలేక పోతున్నారని బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ పేర్కొన్నారు. విద్యార్థులకు ఆయా కళాశాలల అధ్యాపకులు రోగులకు క్లిష్టతరమైన వైద్య పద్ధతులను సైతం సులభతరంగా ఎలా అందించాలి? జబ్బులను ఎలా పసిగట్టాలి? వంటి వాటిని నేర్పించాలన్నారు. కొత్త కరికులంలో భాగంగా మొదటి సంవత్సరంలో చదివే సబ్జెక్టులతో పాటు విద్యార్థులు ఆపరేషన్‌ థియేటర్లకు కూడా వెళ్లే విధంగా కరిక్యులం రూపొందించినట్టు తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలలకు ఆదేశాలు జారీచేశారు.  

మరిన్ని వార్తలు