24న నూతన గవర్నర్‌ ప్రమాణ స్వీకారం

21 Jul, 2019 03:15 IST|Sakshi

హరిచందన్‌తో ప్రమాణం చేయించనున్న హైకోర్టు ఏసీజే

కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం వైఎస్‌ జగన్, మంత్రులు 

23న రాజ్‌భవన్‌కు చేరుకోనున్న హరిచందన్‌ 

రాజభవన్‌లో ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్, డీజీపీ

సాక్షి, అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈనెల 24వ తేదీ ఉదయం 11.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ గవర్నర్‌తో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం అతిథులకు రాజ్‌భవన్‌ అధికారులు తేనీటి విందు ఏర్పాటు చేశారు. హరిచందన్‌ ఈ నెల 23 రాత్రికి రాజ్‌భవన్‌కు చేరుకోనున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం తెలిపారు.

విజయవాడలోని ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయంలో రాజ్‌భవన్‌ ఏర్పాటు పనులను శనివారం ఆయన పరిశీలించారు. సీఎస్‌తో పాటు రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్, గవర్నర్‌ కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనా, జీఏడీ ముఖ్యకార్యదర్శి ఆర్‌పీ సిసోడియా, విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్, సబ్‌ కలెక్టర్‌ మిషాసింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ.. కొత్త గవర్నర్‌ ఈ నెల 23న భువనేశ్వర్‌ నుంచి తిరుమల వెళ్లి, శ్రీవారి దర్శనం అనంతరం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారని తెలిపారు. అక్కడ రాష్ట్ర ప్రథమ పౌరుడికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, మంత్రులు, అధికారులు స్వాగతం పలకనున్నారని తెలిపారు. 

త్రివిధ దళాల స్వాగతం..
మొదటిసారిగా రాజధానికి రానుండడంతో గవర్నర్‌కు త్రివిధ దళాలు ఆర్మీ సెరిమోనియల్‌ స్వాగతం పలకనున్నాయి. తర్వాత హరిచందన్‌ కనకదుర్గమ్మ గుడికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్న అనంతరం రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. గవర్నర్‌ సూచనమేరకు రాజ్‌భవన్‌కు అధికారులు తగిన మార్పులు చేస్తున్నారు. భవనం మొదటి అంతస్తులో గవర్నర్‌ నివాసాన్ని ఏర్పాటు చేశారు. డీజీపీ, నగర పోలీస్‌ కమిషనర్‌ భద్రతా ఏర్పాట్లను పరిశీలించి కొన్ని సూచనలు చేశారు. రాజ్‌భవన్‌కు నలువైపులా సెక్యురిటీ పోస్టులను ఏర్పాటు చేసి, లైటింగ్‌ పెంచాలని అందుకు తగిన ఏర్పాట్లను చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను సీఎస్‌ ఆదేశించారు. శాసనసభ, మండలి సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరవ్వడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి స్పీకర్, చైర్మన్‌లకు లిఖితపూర్వకంగా తెలియజేస్తున్నామని సీఎస్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు