కొత్త కిక్కు!

2 Jul, 2015 03:03 IST|Sakshi

‘అనంత’లో మద్యం ఏరులై పారనుంది. మందుబాబుల జేబులను కొల్లగొట్టేందుకు అబ్కారీ అధికారులు, మద్యం వ్యాపారులు రంగం సిద్ధం చేశారు. కొత్తగా లెసైన్స్‌లు దక్కించుకున్న వ్యాపారులు విక్రయాలు ప్రారంభించారు. భారీ మొత్తం వెచ్చించి దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు వీలైనంత దండుకోవడమే లక్ష్యంగా విక్రయాలు సాగించనున్నారు. ప్రభుత్వం కూడా గల్లాపెట్టె నింపుకోవడమే లక్ష్యంగా కొత్తమద్యం పాలసీని ప్రకటించడంతో మద్యం ప్రవాహం వరదై పారనుంది.
 
 సాక్షి ప్రతినిధి, అనంతపురం: కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. ఇక జిల్లాలో మద్యం కిక్కు ఫుల్లుగా ఉండబోతోంది. కొత్తగా కేటాయించిన దుకాణాల దరఖాస్తుల ఫీజు, లెసైన్స్ జారీ ద్వారా ప్రభుత్వానికి రూ.180.31కోట్ల ఆదాయం చేకూరింది. 206 దుకాణాలకు 3,785 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా రూ.14.23కోట్లు ఆదాయం వచ్చింది. ఇందులో 204 దుకాణాలకు లెసైన్స్‌లు జారీ చేశారు. (రెండు షాపులకు సంబంధించి లాటరీ దక్కించుకున్న వారు లెసైన్స్‌లు తీసుకోకుండా వెనకడుగు వేశారు.)  మొదటి త్రైమాసికానికి రూ.27.69కోట్ల ఆదాయం వచ్చింది. కొత్త మద్యం పాలసీకి రెండేళ్ల గడువుంది. ఈ లెక్కన లెసైన్స్‌ల ద్వారా మొత్తం రూ.166.14కోట్ల ఆదాయం రానుంది.
 
 ఊరూరా... సర్కారీ మద్యం:
 ప్రతీ పల్లెలోనూ మద్యం లభించేలా ప్రభుత్వ నూతన విధానం ఉంది. గతంలో ఉన్న 5 స్లాబులను 7 స్లాబులుగా మార్చడంతో 5వేలు జనాభా ఉన్న పల్లెలోనూ మద్యం దుకాణానికి లెసైన్స్‌లు జారీ చేశారు. దీంతో పాటు టెట్రాప్యాకెట్ల విక్రయాన్ని ప్రభుత్వం కొత్తగా అమల్లోకి  తీసుకువస్తోంది. గతంలో సారాపాకెట్ల తరహాలో టెట్రాప్యాకెట్లను విక్రయించనున్నారు. మద్యం దుకాణాలకు సిట్టింగ్ అనుమతి ఉంటుంది.
 
 దీంతో దుకాణానికి వచ్చే మందుబాబులు అక్కడే కూర్చుని మద్యం సేవిస్తారు. బెల్ట్‌షాపులను అదుపు చేస్తామని బీరాలు పలుకుతున్న ప్రభుత్వం, ‘బెల్ట్’ కంటే దారుణమైన విధానం ద్వారా టెట్రాప్యాకెట్లను విక్రయించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. సైకిళ్లు, మోటరు సైకిళ్ల ద్వారా టెట్రాప్యాకెట్లను పల్లెలకు పంపి విక్రయించాలని చూస్తోంది. అంటే ప్రస్తుతం పిల్లలకు ఐస్‌క్రీములు ఎలా విక్రయిస్తున్నారో... ఇక మందుబాబులకు టెట్రా ప్యాకెట్లు అలా విక్రయిస్తారన్నమాట.  
 
 బెల్టూ యథాతథమే!
 జిల్లా వ్యాప్తంగా 1003 పంచాయతీలు ఉన్నాయి. 3,300పైగా గ్రామాలున్నాయి. వీటిలో దాదాపు 2,300 బెల్ట్‌షాపులు గతేడాది నడిచాయి. బెల్ట్‌షాపులను అరికడతామని ముఖ్యమంత్రి ప్రకటనలు గుప్పిస్తున్నా ఆదాయం కోసం అబ్కారీశాఖ అధికారులు అనధికారికంగా ప్రోత్సహించారు. వ్యాపారులు బెల్ట్‌షాపులను ప్రోత్సహించనున్నారు. దీనికి ఎక్సైజ్‌శాఖ అధికారులు కూడా అండగా నిలిచే అవకాశం ఉంది. టెట్రాప్యాకెట్లు, బెల్ట్‌షాపులతో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు సాగనున్నాయి.
 
 ఎమ్మార్పీ కంటే అధికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు:
 మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు వ్యాపారులు భారీగా లెసైన్స్ ఫీజులు చెల్లించారు. ఈ మొత్తాన్ని రాబట్టుకుని, తిరిగా ఆదాయం దక్కించుకునేందుకు ‘వయొలేషన్’ను చేయనున్నారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యాన్ని విక్రయించనున్నారు. గతేడాది బాటిల్‌పై రూ. 5-15లు అధికంగా విక్రయించారు. ఈ ఏడాది రూ.10-30 వరకూ విక్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా వ్యాపారులంతా సిండికేట్ అయి అధిక ధరలకు విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారాన్ని ఎక్సైజ్‌శాఖలోని కొందరు సీఐలు చక్కబెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  అదే జరిగితే మందుబాబుల జేబులకు చిల్లులు పడటం ఖాయం.
 
 ప్రభుత్వ అధీనంలో 23 షాపులు :
 మొత్తం దుకాణాల్లో 10శాతం ప్రభుత్వం దుకాణాలు విక్రయించాలి. దీంతో 23 షాపులు అబ్కారీ అధికారులే నిర్వహించనున్నారు. ఓ హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ల ద్వారా విక్రయాలు సాగించనున్నారు.
 

మరిన్ని వార్తలు