రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్తా: ఎమ్మెల్సీ పొంగులేటి

13 Jan, 2014 03:09 IST|Sakshi
రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్తా: ఎమ్మెల్సీ పొంగులేటి

సత్తుపల్లి, న్యూస్‌లైన్: నూతన భూసేకరణ చట్టం 48 గంటల్లో అమల్లోకి వస్తుందనగా హడావిడిగా జనరల్ అవార్డు జారీ చేయడాన్ని ఏఐసీసీ సమావేశాల్లో రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. సత్తుపల్లిలో సింగరేణి భూ నిర్వాసితులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలకు ఆదివారం ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మేలు చేసే విధంగా భూ సేకరణ చేసేటప్పుడు మార్కెట్ రేటుకు నాలుగు రెట్లు పరిహారం వచ్చేలా యూపీఏ ప్రభుత్వం చట్టం చేసిందని అన్నారు. భూ నిర్వాసితులకు మేలు కలిగేలా జిల్లాకు చెందిన అన్నిరాజకీయ పార్టీల ప్రజా ప్రతి నిధులు ఐక్యంగా సీఎంతో చర్చించామన్నారు. న్యాయమైన డిమాండ్‌ను పరిష్కరించేందుకు ఉమ్మడిగా ఎటువంటి ప్రయత్నం లోపం లేకుండా చేస్తామన్నారు. ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలలో అవార్డు రద్దు అయ్యేలా ఒత్తిడి చేసి న్యాయం చేస్తామన్నారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన మాట్లాడుతూ నూతన భూసేకరణ చట్టం వర్తించే విధంగా జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధిగా సీఎంతో మాట్లాడతామన్నారు.
 
 సీఎంతో ఫోన్‌లో.. : సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి దీక్షా శిబిరం నుంచి ఫోన్‌లో మా ట్లాడారు. 13 రోజుల నుంచి భూ నిర్వాసితులు రిలేనిరాహారదీక్షలు చేస్తున్నారని.. కలెక్టర్ జారీ చేసిన అవార్డును రద్దు చేసి నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు. అదేవిధంగా కలెక్టర్ శ్రీనివాస్‌శ్రీనరేష్‌తో మాట్లాడారు. సింగరేణి సీఎండీతో చర్చించామని.. నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరామని అన్నా రు. ఆయన వెంట డీసీసీ ఉపాధ్యక్షులు కూసంపూడి మాధవరావు, ఉడతనేని అప్పారావు, పరెడ్ల సత్యనారాయణరెడ్డి, గాదె చెన్నారావు, సాల్మన్‌రాజు, చింతల పాటి సత్యనారాయణ, నరుకుళ్ల రవి, కొడిమెల అప్పారావు, ములకలపాటి రవి, వెల్ది ప్రసాద్, మౌలాలి పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు