గురుకులాలకు కొత్త రూపు

11 Nov, 2019 04:41 IST|Sakshi

సాక్షి, అమరావతి: బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాలు విద్యార్థులకు అన్నివిధాలా ఉపయోగపడేలా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అత్యవసరంగా కనీస మౌలిక వసతులు కల్పించడానికి నిధులు కేటాయించింది. టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇన్నాళ్లుగా సవాలక్ష సమస్యలతో కునారిల్లిన వీటిని అన్ని విధాలా తీర్చిదిద్దేందుకు నూతన ప్రభుత్వం కార్యాచరణను ప్రారంభించింది. మొత్తం 106 బీసీ గురుకుల విద్యాలయాలు ఉంటే అందులో భవనాలు లేక ఇప్పటికీ 20 గురుకుల స్కూళ్లను గత ప్రభుత్వం ప్రారంభించలేదు. 60 గురుకుల స్కూళ్లు ప్రైవేట్‌ భవనాల్లో నడుపుతున్నారు. ఈ భవనాలు విద్యార్థులు చదువుకోవడానికి అనువుగా లేవు. అన్నింటిలో మొత్తం 27,212 మంది విద్యార్థినీ, విద్యార్థులు కనీస సౌకర్యాలు లేకుండా విద్యాభ్యాసం చేస్తున్నారు.

బీసీ విద్యార్థుల దుస్థితిని గుర్తించిన ప్రభుత్వం అత్యవసరంగా మౌలిక వసతులు (బాత్‌రూములు, మంచినీటి పైపులు,  సెప్టిక్‌ ట్యాంకులు, భవనంలో దెబ్బతిన్న నేలలకు మరమ్మతులు, ఫ్యాన్లు, లైట్ల ఏర్పాటు, విద్యుత్‌ వైరింగ్, భవనాలకు పెయింట్లు, అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, డార్‌మెట్రీలు, ఓపెన్‌ ఎయిర్‌ ఆడిటోరియంలు, ల్యాబుల ఏర్పాటు) కల్పించేందుకు రూ.4 కోట్లు మంజూరు చేసింది. కాగా, సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యాలయాలు, హాస్టళ్లలో ‘నాడు–నేడు’ కార్యక్రమం కింద వసతులు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది.

4 భవనాల నిర్మాణాలు పూర్తి 
ప్రస్తుతం నాలుగు గురుకుల భవనాల నిర్మాణం పూర్తి కావస్తోంది. గుండుమల (బాలురు), గుండిబండ (బాలికలు), గొనబావి (బాలికలు), ఉదయమాణిక్యం (బాలికలు)ల్లో నిర్మాణాలు తుదిదశకు చేరుకున్నాయి.   

ప్రతిపాదనలు సిద్ధం
రాష్ట్రంలో 26 బీసీ గురుకుల విద్యాలయాలు ప్రభుత్వ భవనాల్లో ఉన్నాయి. బాలికలవి 16, బాలురవి 10. ఈ స్కూళ్లలో వసతుల కోసం రూ.52.63 కోట్లతో గురుకుల విద్యాలయాల సంస్థ ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపింది.  

ఒక్కో భవనానికి రూ. 60 కోట్లు
ప్రస్తుతం 60 గురుకులాలు అద్దె భవనాల్లో ఉంటున్నాయి. 52 స్కూళ్ల నిర్మాణానికి స్థలాలు ఇవ్వాల్సిందిగా రెవెన్యూ శాఖను బీసీ గురుకుల సొసైటీ కోరింది. కొత్తగా ఒక్కో భవనానికి రూ.60 కోట్లతో మొత్తం 76 భవనాల నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేసింది. రూ.4,560 కోట్లు అవుతుందని అంచనా. నిధులు సమకూర్చడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

త్వరలోనే అన్ని సౌకర్యాలు 
త్వరలోనే బీసీ గురుకుల విద్యాలయాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ప్రైవేట్‌ భవనాల్లో ఉన్న స్కూళ్లలో పూర్తిస్థాయి సౌకర్యాలు లేవు. అయినా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. కొత్త భవనాల నిర్మాణాలు, స్థల సేకరణ విషయంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.  
– ఎ కృష్ణమోహన్, కార్యదర్శి, బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ.  

గిరిజన విద్యార్థులకు సమకూరిన సదుపాయాలు
సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లోని విద్యార్థులకు అన్ని సదుపాయాలు సమకూరాయి. రెండు నెలల క్రితం నిర్వహించిన గిరిజన సంక్షేమ శాఖ సమీక్షలో విద్యార్థులకు సదుపాయాలు కల్పించడంలో విఫలమైతే చర్యలు తప్పవని, రెండు నెలల్లో పూర్తి సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. దీంతో అధికార యంత్రాంగం ఆగమేఘాలపై ఏర్పాట్లు చేసింది. గిరిజన హాస్టల్‌ విద్యార్థులకు 32,88,499 నోట్‌ పుస్తకాలు, 98,706 కార్పెట్స్, 8,315 బెడ్‌షీట్స్, 14,72,146 మీటర్ల యూనిఫామ్‌ క్లాత్, 90,391 ఉలెన్‌ దుప్పట్లు, 53,181 ట్రంకు పెట్టెలు, 53,181 ప్లేట్లతోపాటు గ్లాసులు, 4,560 బంక్‌ బెడ్స్, 2,114 డ్యూయల్‌ డెస్క్‌లు సమకూర్చారు.

గురుకుల బాలికల హాస్టళ్లకు 375 పొయ్యిలు, 1,119 డీప్‌ ఫ్రిజ్‌లు అందించి నూరు శాతం హాస్టళ్లు, గురుకుల విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. గురుకుల విద్యార్థులకు ఏడాదికి నాలుగు జతల బట్టలు ఇవ్వాల్సి ఉండటంతో.. 7.96 లక్షల మీటర్ల క్లాత్, 9.35 లక్షల నోట్‌ పుస్తకాలు అందించారు. 52 వేల కార్పెట్స్, 25,229 బెడ్‌ షీట్స్, 52 వేల కండువాలు, 25,949 ఉలెన్‌ దుప్పట్లు, 51,506 బ్లాక్‌ షూస్, రెండేసి జతల సాక్స్‌లు, 51,506 వైట్‌ షూస్, రెండేసి జతల సాక్స్‌లు అందించారు. యూనిఫామ్‌ను మెప్మా సభ్యులతో కుట్టించే కార్యక్రమాన్ని గత ప్రభుత్వం చేపట్టగా.. చాలాచోట్ల ఈ పని పూర్తి కాలేదు. 2019–20వ సంవత్సరానికి సంబంధించి యూనిఫామ్‌ క్లాత్‌ను అందజేసి, కుట్టు చార్జీలను సైతం విద్యార్థుల తల్లిదండ్రులకే ఇచ్చారు.

మరిన్ని వార్తలు