ఆసుపత్రులు, విద్యా సంస్థలకు కొత్త రూపు

6 Nov, 2019 04:47 IST|Sakshi
మంగళవారం క్యాంప్‌ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

నాడు–నేడు కార్యక్రమంపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌

14న ప్రారంభం.. దశల వారీగా 45 వేల స్కూళ్లలో అమలు

తర్వాతి దశ జూనియర్, డిగ్రీ కాలేజీలు,పాలిటెక్నిక్, ఐటీఐ, గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో విద్యా సంస్థల బాగు కోసం భారీగా వ్యయం 

డిసెంబర్‌ 26 నుంచి సబ్‌ సెంటర్లు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు,ఏరియా, జిల్లా, బోధన ఆసుపత్రుల్లో నాడు–నేడు

తొలి దశలో 230 ఆసుపత్రుల్లో అభివృద్ధి పనులు

ప్రతి ఆసుపత్రిలోనూ కొరత లేకుండా 510కి పైగా మందులు 

డిసెంబర్‌ 21 నుంచి వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ

క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులకు పూర్తి స్థాయిలో ఉచిత వైద్యం 

వైద్యులు, నర్సుల పోస్టుల భర్తీకి జనవరిలో క్యాలెండర్‌

నాడు–నేడులో ప్రతి విడతలోనూ గ్రామీణ, గిరిజన, మున్సిపాలిటీల్లోని స్కూళ్లు ఉండేలా చూసుకోవాలి. స్కూలు యూనిఫామ్‌ దగ్గర నుంచి ఫర్నిచర్‌ వరకూ నాణ్యత విషయంలో రాజీ పడొద్దు. యూనిఫామ్, బూట్లు, పుస్తకాలను స్కూళ్లు ప్రారంభమైన వెంటనే ఇవ్వాలి.

ప్రతి పాఠశాలలో తొమ్మిది రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. స్కూళ్లకు సంబంధించిన పరిపాలన అంశాల్లోనే కాకుండా, నిర్వహణలోనూ పిల్లల తల్లిదండ్రులతో కూడిన విద్యా కమిటీలు కీలక పాత్ర పోషించాలి.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి : నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులు, విద్యా సంస్థల రూపు రేఖలు సమూలంగా మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఆసుపత్రులు, విద్యా సంస్థలన్నింటిలో దశల వారీగా అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు భారీగా వ్యయం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం అమలుపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, డిప్యుటీ సీఎం (వైద్య శాఖ) ఆళ్లనాని, సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుంచి దశల వారీగా స్కూళ్లలో, డిసెంబర్‌ 26వ తేదీ నుంచి ఆసుపత్రుల్లో నాడు–నేడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. 

తొలుత 45 వేల స్కూళ్లలో.. 
దాదాపు 45 వేల స్కూళ్లలో నాడు–నేడు కార్యక్రమం చేపడుతున్నామని, తర్వాతి దశలో జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్‌ కాలేజీలు, ఐటీఐలు, గురుకుల పాఠశాలలు, హాస్టళ్లను కూడా బాగు చేయనున్నామని సీఎం జగన్‌ తెలిపారు. ఇందుకోసం భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు, ప్రహరీ, ఫర్నిచర్, ఫ్యాన్లు, బ్లాక్‌ బోర్డుల పెయింటింగ్, ఫినిషింగ్‌.. తదితర తొమ్మిది రకాల మౌలిక సదుపాయాల పనులు చేపడుతున్నామని చెప్పారు. ప్రతి స్కూల్లో చేపట్టాల్సిన పనులపై చెక్‌ లిస్టు ఉండాలని, నవంబర్‌ 14న స్కూళ్లలో నాడు–నేడు ప్రారంభించాలని అదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీలను భాగస్వాములను చేస్తున్నామని అధికారులు తెలిపారు. 

8వ తరగతి వరకు ఇంగ్లిషు మీడియం
వచ్చే ఏడాది 1 నుంచి 8వ తరగతి వరకూ ఇంగ్లిషు మీడియం ప్రవేశపెడుతున్నామని, ఆ పై వచ్చే ఏడాది నుంచి 9వ తరగతిలో కూడా ఇంగ్లిషు మీడియం ప్రవేశ పెడుతున్నామని, దీనికి సంబంధించి పాఠ్య ప్రణాళికలను సిద్ధం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. స్కూలు ప్రారంభం కాగానే వారికి యూనిఫామ్, బూట్లు, పుస్తకాలు ఇవ్వాలన్నారు. సెప్టెంబర్, అక్టోబర్‌ వరకు పుస్తకాలు ఇవ్వని పరిస్థితి ఉండకూడదని చెప్పారు. స్కూళ్లలో నాడు–నేడు కార్యక్రమానికి ఆర్థిక వనరుల లోటు లేకుండా చూసుకోవాలని సూచించారు. మండలంలోని మంచి హైస్కూల్‌ను జూనియర్‌ కాలేజీగా అప్‌గ్రేడ్‌ చేయాలని, విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు ఉండాలని ఆదేశించారు. నాడు–నేడు తొలి దశలో 15 వేల స్కూళ్లలో ప్రారంభిస్తున్నామని, సంక్రాంతి నాటికి పనులు పూర్తి చేస్తామని అధికారులు వివరించారు.

రోగులకు పింఛన్లు.. వలంటీర్ల భాగస్వామ్యం 
తీవ్ర రోగాలతో బాధపడుతున్న వారికి ఇచ్చే పెన్షన్ల లబ్ధిదారుల విషయంలో గ్రామ సచివాలయాలు, వలంటీర్లను భాగస్వామ్యం చేయాలని సీఎం సూచించారు. ఈ మేరకు కలెక్టర్లకు, గ్రామ సచివాలయాలకు మార్గదర్శకాలు పంపించాలని, లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ఉంచాలని ఆదేశించారు. క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న వారికి పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్‌ 21 నుంచి వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. వచ్చే మే నెల నాటికి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సుల పోస్టుల భర్తీ పూర్తి చేసేందుకు జనవరిలో క్యాలెండర్‌ జారీ చేయాలని సీఎం ఆదేశించారు. 

జ్యుడిషియల్‌ ప్రివ్యూకు టెండర్లు
నాడు–నేడు కింద అన్ని ప్రభుత్వాసుపత్రులను బాగు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. సబ్‌ సెంటర్లు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, బోధనాసుపత్రులను కూడా బాగు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ప్రతి ఆసుపత్రిలోనూ మందుల కొరత లేకుండా చూడాలని, డిసెంబర్‌ 15 నుంచి 510 రకాలకు పైగా మందులు అందుబాటులో పెడుతున్నామని చెప్పారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లోనూ నాణ్యతా ప్రమాణాలు ఉండాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా ప్రమాణాలు బాగా పెంచాలని సీఎం సూచించారు. మొదటి దశలో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో కలిపి 230 ఆసుపత్రుల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఇండియన్‌ పబ్లిక్‌ హెల్త్‌ స్టాండర్డ్‌ (ఐపీహెచ్‌ఎస్‌) ప్రమాణాల ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. ఇందుకు సంబంధించిన టెండర్లను జ్యుడిషియల్‌ ప్రివ్యూకు వెంటనే పంపాలని, ఆ తర్వాత టెండర్లు ఖరారు చేయాలని ఆదేశించారు. నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు