మధ్యాహ్న భోజనంలో.. కొత్త రుచులు

21 Jan, 2020 08:52 IST|Sakshi

మారిన ఆహార పట్టిక...

నేటి నుంచి అమలు

మూడు రోజులు చిక్కీలు...

ఐదు రోజులు గుడ్డు 

అమ్మ ఒడితోపాటు అమ్మలాంటి కమ్మనైన భోజనం

సీఎం జగన్‌ నిర్ణయంతో విద్యార్థిలోకంలో ఆనందం

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం మెనూ కొత్త రుచులు సందడి చేయనున్నాయి. మారిన ఈ కొత్త మెనూ మంగళవారం నుంచి అమల్లోకి రానుండడంతో విద్యార్థిలోకం సంతోషం వ్యక్తం చేస్తోంది. విద్యార్థులకు బలవర్థకమైన ఆహారంతోపాటు శుచి, శుభ్రతతో ఉండాలన్న లక్ష్యంతో ఆçహార పట్టికలో పలు మార్పులు చేశారని అధికారులు చెబుతున్నారు. ఐదు రోజులు గుడ్డుతోపాటు మూడు రోజులు బెల్లం, వేరుసెనగ, చక్కీలు ఇవ్వాలని నిర్ణయించింది. వీటితోపాటు రోజూ ఒక్కోరకం రుచులు వడ్డించేలా ఆహార పట్టిక రూపొందించారు. జిల్లా, మండల స్ధాయిలో కొత్త మెనూపై అధికారులు ఇప్పటికే వర్క్‌షాపు నిర్వహించి వారికి అవగాహన కల్పించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు 2,961, ప్రాథమికోన్నత 376, ఉన్నత పాఠశాలలు 581 వరకూ ఉన్నాయి. వీటిలో 3,89,565 వేల మంది విద్యార్థుల వరకూ విద్యను అభ్యసిస్తున్నారు. కొత్తగా అందించే  చిక్కీకి కిలోకు రూ.135 చొప్పున నిర్వహకులకు చెల్లించనున్నారు. ప్రతి విద్యార్థికీ 25 గ్రాముల చొప్పున చక్కీ ఇవ్వనున్నారు.

దశల వారీగా మార్పులు...
ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకం 2003–04వ సంవత్సరంలో ఆరంభమైంది. మొదట్లో అన్నంతోపాటు సాంబారు లేదా పప్పు వడ్డించేవారు. తర్వాత చట్నీ మరి కొన్ని రోజులు కూర జత చేశారు. క్రమేణా పప్పు, సాంబారుతో పాటు కూర, వారానికో గుడ్డు, తరువాత రెండు ఇలా మార్పులు చేస్తూ వచ్చారు. తాజాగా వారానికి ఐదు గుడ్లు ఇవ్వాలన్నది జగన్‌ ప్రభుత్వ నిర్ణయం. అంతేగాక వంట తయారీ చేసే ఏజెన్సీ వాళ్లకు గౌరవ వేతనం రూ.3 వేలకు పెంచి వారి డిమాండ్‌ నేరవేర్చారు.

 

ప్రతి విద్యార్థీ తినాలి...
ఇప్పటికీ కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు మధ్యాహ్నం ఇంటికి వెళ్లిపోవడానికి సమయం లేక బాక్సు తెచ్చుకుంటున్నారు. ఆ పద్ధతికి స్వస్తి పలికి ప్రస్తుత ప్రభుత్వం పౌష్టికాహారాన్ని అందిస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.  ప్రతి విద్యార్థీ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి.
ఎస్‌.అబ్రహం, జిల్లా విద్యాశాఖాధికారి 

మరిన్ని వార్తలు