సరికొత్త ప్రజా రాజధాని

28 Sep, 2014 02:44 IST|Sakshi
సరికొత్త ప్రజా రాజధాని

* ఏపీ కేపిటల్‌పై చంద్రబాబు
* అందరి సహకారంతో ఏర్పడబోతోందన్న సీఎం
* 2 నెలల్లో భూ సమీకరణని వెల్లడి
* వీజీటీఎం పట్టణాల మధ్యనే కొత్త మెగాసిటీ
* విజయవాడ దూరదర్శన్ ‘సప్తగిరి’ ప్రారంభం

 
 సాక్షి, విజయవాడ బ్యూరో: విజయవాడ పరిసరాల్లో నూతన రాజధాని నగర నిర్మాణం కోసం రెండు నెలల్లోగా భూ సమీకరణ ప్రక్రియ మొదలవుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర ప్రజలు, నాయకులు, రైతులందరి సహకారంతో సరికొత్త ప్రజా రాజధాని నగరం ఏర్పడబోతోందన్నారు. శనివా రం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడుతో కలిసి విజయవాడ దూరదర్శన్ సప్తగిరి చానల్‌ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. వీలైనంత త్వరగా ఒక్కో ప్రభుత్వ శాఖను ైహైదరాబాద్ నుంచి బెజవాడకు తరలించాల్సి ఉందన్నారు.
 
 రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేపట్టే ముఖ్య కార్యక్రమాలన్నీ ఇక్కడి నుంచే ప్రారంభం కానున్నాయని తెలిపారు. అక్టోబర్ 2న బెజవాడలో ‘స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. తమ ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్లుగానే విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి (వీజీటీఎం) పట్టణాల మధ్యలో మెగా సిటీ నిర్మాణానికి సిద్ధమైందన్నారు. ల్యాండ్ పూలింగ్ పద్ధతిలోనే భూముల సమీకరణ ఉంటుందని, రైతులు, అధికారులు సమన్వయంతో సహకరించాలని కోరారు. రాజధాని అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలను ప్రసారం చేయాలని చంద్రబాబు విజయవాడ దూరదర్శన్ కేంద్రం అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఎన్నో చానళ్లు ఉన్నప్పటికీ డీడీపైనే ప్రజలకు అపారమైన విశ్వాసం ఉందన్నారు. ఆకాశవాణి కేంద్రం కూడా టెక్నాలజీని అందిపుచ్చుకుని మరింత వేగంగా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు.
 
 టీవీలు సంచలనాలకు దూరంగా ఉండాలి: వెంకయ్యనాయుడు
 వెంకయ్య మాట్లాడుతూ.. టీవీ, మీడియా, సినిమా వంటి ప్రసార మాధ్యమాల్లో హింసను ఎక్కువగా చూపిస్తున్నారనీ, దీన్ని తగ్గించి తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలను ఎక్కువగా ప్రచారం చేయాలని సూచించారు. సొంత భావాలను వార్తలుగా గుప్పించి ప్రజల మీదకు వదిలే పద్ధతికి టీవీలు, పత్రికలు స్వస్తి పలకాలన్నారు. సత్యానికి దగ్గరగా, సంచలనాలకు దూరంగా ఉండాలని, సంగీత, సాహిత్య వినోద కార్యక్రమాలకు పెద్దపీట వేయాలని చెప్పారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం దూరదర్శన్ అభివృద్ధికి రూ.103 కోట్లను విడుదల చేస్తుందన్నారు. కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పంపిన వీడియో సందేశాన్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు. డీడీ డెరైక్టర్ జనరల్ విజయలక్ష్మీ చావ్లా దూరదర్శన్ ప్రగతిని వివరించారు. అనంతరం సీఎం వేదికపై ఏర్పాటు చేసిన రిమోట్‌ను ఆన్ చేసి సప్తగిరి చానల్ చిహ్నాన్ని ఆవిష్కరించారు. ఆల్ ఇండియా రేడియోకు అందజేయాల్సిన ఈమని శంకరశాస్త్రి వీణానాదం సీడీని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.
 
 ఆకాశవాణికి పింగళి వెంకయ్య పేరు
 విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి జాతీయ జెండా రూపశిల్పి కృష్ణా జిల్లాకు చెందిన పింగళి వెంకయ్య పేరు పెట్టారు.  పింగళి వెంకయ్య దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన సమరయోధుడే కాకుం డా త్రివర్ణ పతాకానికి రూపమిచ్చిన మహానుభావుడు.
 
 ఎన్టీఆర్ నా అభిమాన నటుడు: వెంకయ్య
 తన అభిమాన నటుడు ఎన్టీ రామారావు అని వెంకయ్యనాయుడు చెప్పారు. శనివారం విజయవాడలోని ఓ హోటల్‌లో వెస్టిక్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యాన జరిగిన ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలిచ్చారు. దేశ పౌరులకు సామాజిక స్ప­ృహ లేదని, తనకు అవకాశమిస్తే ఆ అంశంపై వారికి పాఠాలు బోధిస్తానని చెప్పారు. తనకు చింతకాయ పచ్చడన్నా, నెల్లూరు చేపల పులుసన్నా, ఆవకాయ, గోంగూర పచ్చళ్లన్నా ఇష్టమని చెప్పారు. కార్యక్రమం పేరు కాఫీ కబుర్లు కాగా.. వెంకయ్య కాఫీ తాగకపోవడంతో లెమన్ టీ తాగుతూ నిర్వహించారు.

మరిన్ని వార్తలు