ఇది కొత్త పంది.. పేరు తిరుపతి వరాహ

1 Jul, 2017 06:29 IST|Sakshi
ఇది కొత్త పంది.. పేరు తిరుపతి వరాహ
నూతన రకాన్ని రూపొందించిన తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ
 
యూనివర్సిటీ క్యాంపస్‌: తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నూతన పంది రకాన్ని రూపొందించింది. దీనికి ‘తిరుపతి వరాహ’ అనే పేరు పెట్టింది. వెటర్నరీ యూనివర్సిటీలో శనివారం జరిగే కార్యక్రమంలో భారత వ్యవసాయ పరిశోధన మండలి ( ఐసీఏఆర్‌) డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ జేకే జీనా విడుదల చేయనున్నారు. వీసీ ప్రొఫెసర్‌ వై.హరిబాబు దీనికి సంబంధించిన వివరాలను శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తిరుపతి వెటర్నరీ కళాశాల పరిధిలో ఆలిండియా కోఆర్డినేటెడ్‌ రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌ ఆన్‌ పిగ్స్‌లో 1971 నుంచి పరిశోధనలు జరుగుతున్నట్లు తెలిపారు.

1971 నుంచి 80 వరకూ లార్జ్‌ యార్క్‌షైర్‌ పిగ్స్‌ ( సీమ పందులు)పై, 1981 నుంచి 87 వరకూ దేశీయ పందుల (నాటు పందులు)పై పరిశోధనలు చేసినట్లు చెప్పారు. అనంతరం 1987 నుంచి 2007 వరకూ సీమ పందులు, నాటు పందులను సంకరీకరించి నూతన రకాన్ని రూపొందించినట్లు చెప్పారు. అప్పటి నుంచి 21 తరాలకు ఈ రకాన్ని పరిశీలించామని, ప్రతి తరంలో పంది పిల్లల్లో ఏర్పడిన అవలక్షణాలను సరిచేస్తూ పరిశోధనలు చేసినట్లు చెప్పారు. 21 తరాల తర్వాత ఎలాంటి అవలక్షణాలూ లేని రకం లభించిందన్నారు. దీంతో ఈ రకాన్ని రైతులకు, పందుల పెంపకందార్లకు అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. ఈ రకంలో 75 శాతం సీమ పందుల లక్షణాలు, 25 శాతం నాటు పందుల లక్షణాలు ఉంటాయన్నారు.

ప్రస్తుతం తమ వద్ద 224 పందులు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ఆనిమల్‌ జెనటిక్‌ రీసెర్చ్‌( ఎన్‌బీఏజీఆర్‌) ప్రతినిధులు శనివారం ఈ రకాన్ని రిజిస్టర్‌ చేసుకుంటారని, రిజిస్టర్‌ చేయడం అంటే పేటెంట్‌ పొందడంవంటిదని వివరించారు. కార్యక్రమంలో పరిశోధన డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ రాఘవరావు, పందుల పరిశోధన సంస్థ ఇన్‌చార్జ్‌ ప్రొఫెసర్‌ జే.సురేశ్, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ గంగరాజు, ఫిజియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ రాంబాబునాయక్‌  పాల్గొన్నారు.
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా