‘గ్రీవెన్స్’పై ఏసీబీ కన్ను

22 Sep, 2014 02:39 IST|Sakshi
‘గ్రీవెన్స్’పై ఏసీబీ కన్ను

 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ప్రభుత్వ విభాగాల్లో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకున్నా, ఆదాయానికి మించి ఆస్తులు సంపాదిస్తున్నా, రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నా.. వారిపై ఫిర్యా దు చేసేందుకు ప్రజలు, బాధితులు పెద్దగా ముందుకు రాని పరిస్థితుల్లో స్వయంగా తామే కార్యాలయాలపై నిఘా పెట్టాలని భావిస్తోం ది. అవినీతి సిబ్బంది, అధికారుల సమాచారం ఇవ్వాలని, ఏసీబీ తమ ఫోన్ నెంబర్లతో కూడిన పోస్టర్లను ప్రభుత్వ  కార్యాలయాల అతికిస్తుంటే అయా విభాగాల సిబ్బంది వాటిని చించేస్తున్నారు. మరోవైపు వివిధ ప్రసార మాధ్యమాల్లో ఏసీబీ విభాగం తమ ఫోన్ నెంబర్లను తరచూ ప్రకటిస్తున్నా ప్రజల్లో చైతన్యం రావడం లేదు.
 
  టోల్‌ఫ్రీ నెంబర్ ప్రకటించినా ఊహించిన స్థాయిలో స్పందన రావడం లేదు. దీంతో సరికొత్త ప్రయోగానికి అవినీతి నిరోధక శాఖ తెర తీసింది. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ డేపై ఏసీబీ దృష్టి సారించింది. గ్రామ, మండల స్థాయిలో నెలల తరబడి పరిష్కారం కాని సమస్యలపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసేందుకు పెద్ద సంఖ్యలో జిల్లా గ్రీవెన్స్ సెల్‌కు వస్తుంటారు. వీటికి స్పందిస్తూ ఉన్నతాధికారులు ఆదేశించినా.. డబ్బులు ముట్టనిదే పనులు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్, ఎస్సీ కార్యాలయాలతో సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ గ్రీవెన్స్ నిర్వహించే రోజు ఏసీబీ సిబ్బంది నిఘా వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
 
 బాధితులకు కౌన్సెలింగ్ చేయడంతో పాటు లంచం డిమాండ్ చేసే ఉద్యోగుల వివరాలు తెలుసుకునేందుకు ఇది దోహదపడుతుందని ఏసీబీ కొత్త డీఎస్పీ రంగరాజు భావిస్తున్నారు. ఇందుకోసం అవసరమైతే ఏసీబీ సిబ్బంది ప్రత్యేకంగా ఒక కియోస్క్(సదుపాయాల బెంచీ) ఏర్పాటు చేయించేందుకు జిల్లా ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఆకస్మిక తనిఖీలు జరిపి, లంచం తీసుకున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నా రాజకీయ, ఇతర ఒత్తిళ్లతో చాలా కేసులు నీరుగారిపోతున్నాయి. దీంతో నేరుగా తనే రంగంలోకి దిగి ప్రజల సహకారంతో లంచగొండుల భరతం పట్టేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది.
 
 ప్రజల సహకారం తప్పనిసరి
 అవినీతిని రూపుమాపాలంటే ప్రజలు ముఖ్యంగా బాధితుల సహకారం తప్పనిసరి. ఎవరికి వారు మనకెందుకులే అనుకుంటే  పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీగా వారం క్రి తం బాధ్యతలు స్వీకరించా. కొత్తగా ఇద్దరు సీఐలు వస్తున్నారు. మరికొన్ని సౌకర్యాలు కూడా సమకూరనున్నాయి. ఏసీబీపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు, ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. బాధితులు కోరితే ఫిర్యాదులను రహస్యంగా ఉంచుతాం. తనిఖీలు ముమ్మరం చేస్తాం. అధికారులు సహకరిస్తే గ్రీవెన్స్ వద్ద సిబ్బందిని ఉంచేందుకు ప్రయత్నిస్తాం. అవినీతి సిబ్బంది సమాచారాన్ని ఎవరైనా 94404-46124నెంబర్‌కు ఫోన్ చేసి చెప్పవచ్చు.
 -కె,రంగరాజు,
 ఏసీబీ డీఎస్పీ
 

మరిన్ని వార్తలు