అవినీతి నిరోధానికి ట్రెజరీలో కొత్త విధానం

12 Jun, 2017 02:28 IST|Sakshi
అవినీతి నిరోధానికి ట్రెజరీలో కొత్త విధానం
‘ఈ కుభేర్‌’ ద్వారా చెల్లింపులు
 
సాక్షి, అమరావతి: ట్రెజరీల్లో జరుగుతున్న ఆన్‌లైన్‌ మోసాలు, అవినీతిని అరికట్టేందుకు ఆర్థిక శాఖ కట్టుదిట్టమైన చర్యలకు శ్రీకారం చుడుతోంది. రిజర్వు బ్యాంకు పర్యవేక్షణలో నిర్వహించే ‘ఈ కుభేర్‌’ పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ పథకం వల్ల ట్రెజరీల్లో కుంభకోణాలు జరిగే అవకాశం లేకుండా కాంప్రహెన్సివ్‌ ఫైనాన్సియల్‌ మానిటరింగ్‌ సిస్టం (సీఎఫ్‌ఎమ్‌ఎస్‌)ను ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందుకు సంబంధించిన రాష్ట్ర విభాగాన్ని విజయవాడకు సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ట్రెజరీల్లో కోట్లలో అవినీతి జరిగినట్లు తేలడంతో ప్రత్యేక విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బ్యాంకుల వారు ట్రెజరీలకు పంపిస్తున్న ఈ చెక్‌ను ఆయా ఖాతాలకు జనరేట్‌ చేసే సందర్భంలో నిధులు స్వాహా అవుతున్నందున ఈ విధానాన్ని సమగ్రంగా పరిశీలించి ప్రక్షాళన చేసేందుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే సీఎఫ్‌ఎమ్‌ఎస్‌ సిస్టం అమలు చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 
 
ట్రెజరీల్లో బిల్స్‌ జనరేట్‌ చేసే వారికి ప్రత్యేకంగా బయోమెట్రిక్‌
ట్రెజరీల్లో ఎవరెవరికి ఎటువంటి బిల్స్‌ ఇచ్చారో వివరాలు నమోదు చేసిన తరువాత వారు జనరేట్‌ చేస్తున్న బిల్స్‌కు సంబంధించి ప్రత్యేకంగా బయోమెట్రిక్‌ మిషన్‌లో ఆ ఉద్యోగి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. దీని వల్ల ఆన్‌లైన్‌లో ఏ ఉద్యోగి, ఏ అధికారి ద్వారా ఏ బిల్లు జనరేట్‌ అయిందో తెలిసి పోతుంది. దీంతో అక్రమాలు జరిగినప్పుడు బాధ్యులను పట్టుకోవడం సులువు అవుతుంది. సీఎఫ్‌ఎంఎస్‌ సిస్టం అమలు చేయడం ద్వారా ఆర్థిక శాఖకు కూడా ఎప్పటికప్పుడు వివరాలు తెలుస్తాయి. నిధులు స్వాహా అయ్యే అవకాశమే లేదని ఆర్థికశాఖ భావిస్తున్నది. 
మరిన్ని వార్తలు