రద్దీ పెరిగితే రేటూ పెరుగుద్ది!

20 May, 2015 01:11 IST|Sakshi
రద్దీ పెరిగితే రేటూ పెరుగుద్ది!

ఆర్టీసీలో ‘ఫ్లెక్సీ ఫేర్ సిస్టం’
రద్దీవేళ చార్జీలు పెంచడానికి కొత్త విధానం
{పైవేటు ట్రావెల్స్ తరహాలో బాదుడు

 
హైదరాబాద్: ‘ఫ్లెక్సీ ఫేర్ సిస్టం’... ఇప్పుడు కొత్తగా ఆర్టీసీలో వినిపిస్తున్న మాట. ఇదేదో ప్రయాణికులకు కొత్త తరహా సేవ అనుకుంటే పొరబడ్డట్టే. రద్దీవేళ ప్రయాణికుల జేబు కొల్లగొట్టడమే దీని ఉద్దేశం. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే లక్ష్యంగా ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పుణే మార్గాల్లో ఆ పేరు లేకుండా అమలులో ఉన్న ఈ విధానాన్ని మిగతా మార్గాల్లో కూడా ప్రారంభించాలని ఆర్టీసీ యోచిస్తోంది. నష్టాలు, అప్పులు.. తాజాగా కార్మికుల వేతనాల పెంపు, తరచూ పెరుగుతున్న డీజిల్ ధరలు ఆర్టీసీని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయి. ఈ నేపథ్యంలో అంతర్గత సామర్థ్యం పెంచుకుని నష్టాలు అధిగమించాలంటూ ముఖ్యమంత్రి స్పష్టం చేయడంతో ఆదాయాన్ని పెంచుకునే కొత్త మార్గాలపై ఆర్టీసీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ‘ఫ్లెక్సీ ఫేర్ సిస్టం’ను తెరపైకి తీసుకురాబోతోంది. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే ప్రత్యేక రోజుల్లో టికెట్ ధరను పెంచటమే దీని ఉద్దేశం. సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ నుంచి ఆంధ్రా ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఏ మూలకూ చాలవు. అలాంటి సందర్భాల్లో హైదరాబాద్ నగరంలో నడిచే సిటీ బస్సులను కూడా ‘స్పెషల్’ బోర్డులు తగిలించి విజయవాడ, గుంటూరు తదితర మార్గాల్లో పరుగుపెట్టిస్తుంటారు.

అలాంటి బస్సులో సాధారణ టికెట్ కంటే కాస్త ఎక్కువ ధర వసూలు చేస్తుండటం మనకు తెలిసిందే. ఇప్పుడు దాన్ని  రద్దీ ఎక్కువగా ఉండే ఇతర అన్ని సందర్భాలకు అమలు చేస్తారన్నమాట. పండుగలు, పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉన్న రోజులు, వరసగా సెలవులు వచ్చినప్పుడు, ఇలా రద్దీ బాగా ఉండేప్పుడు దీన్ని అమలు చేస్తారు. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రద్దీని అంచనా వేసి ఈ ఫ్లెక్సీ ఫేర్‌ను అమలులోకి తెస్తారు. వెరసి ప్రస్తుతం ప్రైవేటు ట్రావెల్స్ అనుసరిస్తున్న విధానాన్ని ఆర్టీసీ అమలు చేయనుందన్నమాట. ఇటీవల ఆర్టీసీ బస్సులు సమ్మెలో ఉన్నప్పుడు ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు మూడు రెట్లు చొప్పున టికెట్ ధరలు పెంచారు.
 
వారాంతంలో అమలు చేయడంపై దృష్టి..

 హైదరాబాద్ నుంచి బెంగళూరుకు గరుడ బస్సు చార్జి రూ.750, సూపర్ లగ్జరీ బస్సు చార్జీ రూ.450 ఉంది. కానీ ఫ్లెక్సీ ఫేర్ పద్ధతిలో వారాంతాల్లో చార్జీ రూ.150 చొప్పున పెరుగుతోంది. బెంగళూరులో పనిచేసే తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు శుక్రవారం రాత్రి ఆ నగరంలో బయలుదేరి సొంతూళ్లకు పయనమవుతారు. తిరిగి ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో బెంగళూరు బస్సు ఎక్కుతారు. శుక్రవారం బెంగళూరులో, ఆదివారం హైదరాబాద్‌లో ‘పీక్ డే’గా లెక్కగడుతూ అధికారులు ఆ మార్గాల్లో ఫ్లెక్లీ ఫేర్‌ను అమలు చేస్తున్నారు. చెన్నై, పుణే మార్గాల్లో కూడా పీక్ డే రోజు రూ.150 చొప్పున అదనపు రుసుము వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లాంటి కీలక మార్గాల్లో కూడా వారాంతపు రద్దీ ఉంటుంది. అలాంటి మార్గాలను కూడా ఇప్పుడు దీన్ని అమలు చేసే ఆలోచనలో ఉన్నారు.
 

>
మరిన్ని వార్తలు