రూ.105 కోట్లతో నూతన ప్రకాశం భవనం

13 Sep, 2014 02:17 IST|Sakshi

ఒంగోలు టౌన్: జిల్లాకే తలమానికంగా నూతన ప్రకాశం భవనం నిర్మించేందుకు ప్రభుత్వం 105 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ వెల్లడించారు. మూడేళ్లలో నూతన ప్రకాశం భవనం నిర్మించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.

 ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్, దానికి ఎదురుగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో వంద అడుగుల ఎత్తులో ఇండియా గేట్ నమూనాలో రెండు కాంప్లెక్స్‌లను అనుసంధానం చేస్తారన్నారు.  60 ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, సువిశాలమైన మీటింగ్ హాల్ మొత్తం 8 ఎకరాల్లో ఒకే ప్రాంతంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్తపట్నం రోడ్డులోని అల్లూరు ప్రాంతంలో 15 ఎకరాల స్థలంలో స్టేడియం నిర్మించేందుకు పరిశీలించాలన్నారు.

 రూ.15 కోట్లతో నగరంలో అభివృద్ధి పనులు:
 ఒంగోలు నగరంలో 15 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించాలని  కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ ఆదేశించారు. ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయాన్ని 7 కోట్ల రూపాయలతో ఐదంతస్తుల్లో నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్పొరేట్ కార్యాలయాలకు దీటుగా రానున్న 20ఏళ్లకు సరిపోయేలా నిర్మించాలన్నారు.

అలాగే ఊరచెరువు ప్రాంతంలో కన్వెన్షన్ హాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. 3 కోట్ల రూపాయలతో నెల్లూరు బస్టాండు కళా ప్రాంగణంలో అంబేద్కర్ క్షేత్రాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నుండి నిధులు మంజూరయ్యాయని చెప్పారు. రంగారాయుడు చెరువు తూర్పువైపు రోడ్డును 100 అడుగుల రోడ్డుగా, దక్షిణం వైపు మంగమూరు రోడ్డును 100 అడుగుల రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని  కలెక్టర్ ఆదేశించారు.

 15 ప్రాంతాల్లో ఎన్‌టీఆర్ సుజల పథకం:ఒంగోలు నగరంలో ఎన్‌టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని ఏర్పాటు చేసేందుకు 15 ప్రాంతాలను గుర్తించామని  కలెక్టర్ వెల్లడించారు. ఒక్కో ఆర్‌ఓ ప్లాంట్‌ను 3 లక్షల 60 వేల రూపాయలతో నిర్మిస్తారన్నారు. వీటిని దాతల సహకారంతో త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఒక్కో కుటుంబానికి 2 రూపాయలకే 20 లీటర్ల తాగునీరు అందిస్తారన్నారు.

 ఒంగోలు నగరంలోని ఆర్టీసీ బస్టాండు, రిమ్స్ హాస్పిటల్ వద్ద అన్నా క్యాంటిన్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్‌రావు, కొండపి శాసనసభ్యుడు బాలవీరాంజనేయస్వామి, ఒంగోలు ఆర్‌డీవో ఎంఎస్ మురళి, ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ సీహెచ్ విజయలక్ష్మి, ఒంగోలు తహసీల్దార్ మూడమంచు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. తొలుత నగరంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను  కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.

మరిన్ని వార్తలు