శ్రీవారి ఆలయంలో కొత్త క్యూలైను

11 Jun, 2017 03:52 IST|Sakshi
శ్రీవారి ఆలయంలో కొత్త క్యూలైను
- శనివారం నుంచి అమలు.. తగ్గిన 300 మీటర్ల దూరం
- త్వరగా స్వామి దర్శనం, తోపులాటల నివారణకు శ్రీకారం
- టీటీడీ కొత్త ఈవో సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు స్వీయ పర్యవేక్షణ
 
సాక్షి, తిరుమల: తిరుమల ఆలయంలో శనివారం నుంచి కొత్త క్యూలైను అమలు చేశారు. దీని ఫలితంగా భక్తులకు త్వరగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం లభించటంతోపాటు 300 మీటర్ల క్యూలైన్‌ దూరం, తోపులాటలు తగ్గాయని అధికారులు చెబుతున్నారు. గతంలో సర్వదర్శనం, కాలిబాట, రూ. 300 టికెట్ల భక్తులను శ్రీవారి దర్శనానికి మహద్వారం దాటుకున్న తర్వాత పడకావలి ఎడమవైపు రంగనాయక మండపం వెనుక నుంచి కల్యాణోత్సవం మండపం మీదుగా వెండివాకిలి ద్వారా అనుమతించేవారు. క్యూలైన్లలో తోపులాటలు, ఒకే సమయంలో ఆలయంలోకి వెళ్లిన భక్తులకు స్వామి దర్శన సమయంలో వ్యత్యాసంపై భక్తుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో టీటీడీ కొత్త ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు కొత్త క్యూలైన్లకు శ్రీకారం చుట్టారు.

పడకావలిలోని తులాభారం మండపం పక్క నుంచి తిరుమల రాయమండపం మీదుగా కల్యాణోత్సవం వెలుపల క్యూలైను మీదుగా వెండివాకిలి వరకు కొత్త క్యూలైన్‌ ఏర్పాటు చేశారు. సుమారు 40 మీటర్ల పొడవు, 6 అడుగుల వెడల్పుతో దీన్ని అమలు చేశారు. ఇక్కడే ఉన్న పాత క్యూలైన్‌ను రెండు లేన్లుగా విస్తరించారు. దీనివల్ల పడకావలి నుంచి ధ్వజమండపం మీదుగా నేరుగా వెళ్లే భక్తులకు, కొత్త క్యూలైన్‌లో వెళ్లే భక్తులకు స్వామి దర్శనం సమయంలో వ్యత్యాసం కేవలం 2 నుంచి 5 నిమిషాలు మాత్రమే ఉండనుంది. ఈ కొత్త క్యూలైన్‌ పక్కాగా అమలు చేయటం కోసం కొత్త ఈవో, జేఈవో వారం రోజులుగా ఆలయంలోనే ఎక్కువ సమయం ఉంటూ ఇంజనీర్లకు మార్పులుచేర్పులు చెబుతూ పనులు చేయించారు.
మరిన్ని వార్తలు