కొత్త రైల్వే జోన్ లేనట్టేనా?

26 Feb, 2015 03:45 IST|Sakshi
కొత్త రైల్వే జోన్ లేనట్టేనా?

- రైల్వే బడ్జెట్‌లో ప్రకటనపై ఆశలు అడియాశలేనా?
- ఏపీలో కొత్త రైల్వే జోన్ ప్రకటన ఉండదని సంకేతాలిచ్చిన రైల్వే శాఖ
- బాబు, కేంద్ర మంత్రులపై మండిపడుతోన్న
- రైల్వే జోన్ సాధన సమితి నేతలు

 
సాక్షి, హైదరాబాద్: కొత్త రైల్వే జోన్‌పై ఆశలు అడియాశలేనా? గురువారం రైల్వే బడ్జెట్ సందర్భంగా ఏపీకి కొత్త రైల్వే జోన్ ప్రకటన ఉండదా? విశాఖ రైల్వే జోన్‌ను ప్రకటిస్తారని ఊదరగొట్టిన ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఆ మేరకు ఒత్తిడి తీసుకురాలేకపోయారా? విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సీఎం చంద్రబాబునాయుడు కేంద్రాన్ని ఒప్పించడంలో విఫలమయ్యారా? రైల్వే మంత్రిత్వ శాఖ, ఆ శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఇస్తున్న సంకేతాల్ని చూస్తే ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు కోరుతూ కేంద్రానికి ఎలాంటి ప్రతిపాదనలు పంపకపోవడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. ఇటీవల త నను కలిసిన ఉత్తరాంధ్ర ఎంపీలకు.. మంత్రి సురేశ్ ప్రభు ఏపీలో కొత్త రైల్వే జోన్ ప్రకటన ఉండదన్నట్టుగానే చెప్పారు. సమాచార హక్కు చట్టం కింద ఓ కార్యకర్త అడిగిన సమాచారానికి రైల్వే శాఖ ఇచ్చిన వివరణను చూసినా కొత్త జోన్ ఉండబోదనే అభిప్రాయమే కలుగుతోంది.
 
 రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై విశాఖపట్నం, విజయవాడ డివిజన్‌లు పోటీ పడ్డాయి. ఉత్తర, దక్షిణ భారతావనిలను కలిపే విజయవాడ డివిజన్‌ను కొత్త రైల్వే జోన్‌గా ప్రకటించాలని ఒకవైపు, విశాఖపట్నం కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్ (ఈస్ట్ కోస్ట్ రైల్వే)ను జోన్‌గా ప్రకటించాలని మరోవైపు గట్టిగా డిమాండ్లు వచ్చాయి. రాజధాని ప్రాంత ప్రకటన సందర్భంగా.. విజయవాడ చుట్టుపక్కల రాజధాని ఉంటుందని చంద్రబాబు చెప్పారు. అదే సమయంలో విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని, ఈ మేరకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అయినా సరే జోన్‌ను సాధిస్తామని హామీ ఇచ్చారు.
 
మరోవైపు ఏపీలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అధ్యయనానంతరం ఆర్నెల్లలో ఈ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత కొత్త జోన్‌పై ప్రకటన చేస్తామని కేంద్రం అప్పట్లో చెప్పింది. అయితే భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని ఖుర్ధా రోడ్, సంబల్‌పూర్, వాల్తేరు డివిజన్‌లలో మన రాష్ట్రంలోని వాల్తేరు డివిజన్ నుంచే ఈస్ట్ కోస్ట్ రైల్వేకు గణనీయమైన ఆదాయం సమకూరుతోంది. దీంతో ఈ డివిజన్‌ను వదులుకునేందుకు ఒడిశా ప్రభుత్వం ఏమాత్రం సిద్ధంగా లేదు. 2,122 కిలోమీటర్ల ట్రాక్ సామర్ధ్యం ఉన్న ఈ డివిజన్‌కు ఏడాదికి రూ.7 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. ఈ దృష్ట్యానే ఒడిశా ముఖ్యమంత్రి, ఎంపీలు ప్రధాని మోదీని కలిసి వాల్తేరు డివిజన్‌ను ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి తప్పించవద్దంటూ తీవ్రంగా ఒత్తిడి తీసుకువచ్చారు.

మరోవైపు కొత్త జోన్ ఏర్పాటుపై నియమించిన కమిటీ కూడా ఇందుకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే విశాఖ రైల్వే జోన్ అటకెక్కిందని ఉన్నతస్థాయి రైల్వే వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒడిశా మాదిరిగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి జోన్ సాధించుకునే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం, కేంద్ర మంత్రులు విఫలమయ్యారనే విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి 2003లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే వాల్తేరు డివిజన్ ఈస్ట్ కోస్ట్ రైల్వేలో విలీనం అయ్యింది. అప్పుడూ బాబుపై విమర్శలు ఎదురయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన ప్రతిపాదనల్లోనూ కొత్త జోన్ లేకపోవడం గమనార్హం.
 
కొత్త రైళ్ల ప్రకటనకే పరిమితం!
రైల్వే బడ్జెట్‌లో విశాఖపట్నం మీదుగా మూడు కొత్త రైళ్ల ప్రకటన మాత్రమే ఉంటుందని విశ్వసనీయవర్గాల సమాచారం. అదీ వీక్లీ, బై వీక్లీ రైళ్ళు మాత్రమేనని తెలుస్తోంది. వీక్లీ రైళ్ళుగా విశాఖపట్నం-తిరుపతి, విశాఖపట్నం-న్యూఢిల్లీ (వయా రాయపూర్) సూపర్ ఫాస్ట్, బై వీక్లీగా (వారానికి రెండు సార్లు) భువనేశ్వర్-బెంగళూరు రైళ్లను ప్రకటిస్తారని సమాచారం.  
 

మరిన్ని వార్తలు