రిజిస్ట్రేషన్ మేడీజీ..

17 Jan, 2016 23:43 IST|Sakshi
రిజిస్ట్రేషన్ మేడీజీ..

కొత్త రిజిస్ట్రేషన్ల చట్టం అమలుకు గ్రీన్ సిగ్నల్
వచ్చే నెల నుంచి అమలుకు కసరత్తు
తాత్కాలిక రిజిస్ట్రేషన్లకు స్వస్తి
వాహన యజమానులకు ఊరట

 
మర్రిపాలెం: ‘రవాణా’లో కొత్త రిజిస్ట్రేషన్ల చట్టం అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చే నెల నుంచే కొత్త విధానం అందుబాటులోకి రానుంది. తాత్కాలిక రిజిస్ట్రేషన్లకు స్వస్తి చెబుతూ వాహనం కొనుగోలు సమయంలో శాశ్వత రిజిస్ట్రేషన్ అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ విధానంలో రవాణా శాఖ మార్పుకు సిద్ధపడింది. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి తొలి లేదా రెండో వారంలో కొత్త రిజిస్ట్రేషన్‌ల చట్టం అమలులోకి రానున్నట్టు కమిషనర్ ఇటీవల ప్రకటించారు. వాహనం కొనుగోలు తర్వాత రిజిస్ట్రేషన్ కోసం యజమానులు పడుడున్న ఇబ్బందులు గుర్తించి పరిష్కారం చూపించారు. ఇటీవల కాలంలో రిజిస్ట్రేషన్‌ల కోసం కౌంటర్లు కిక్కిరిసిపోతున్నాయి. వాహన యజమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో దళారులు జేబులు నింపుకుంటున్నట్టు పరిశీలనలో తేలింది. షోరూమ్‌లతో దళారులు కుమ్మక్కై దోచుకుంటున్నారని రుజువైంది. దళారులతో పనిలేకుండా వాహన యజమాని నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా రవాణా శాఖ నిమగ్నమైంది. వాహన యజమాని రవాణా కార్యాలయానికి రాకుండా రిజిస్ట్రేషన్ జరుపుకోవడానికి నిర్ణయించింది.

షోరూమ్‌లలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ...
వాహనాలు విక్రయించే షోరూమ్‌లలో రిజిస్ట్రేషన్ జరపాలని అధికారులు సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం తాత్కాలిక రిజిస్ట్రేషన్ అందచేస్తున్నట్టుగా శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తారు. షోరూమ్‌లలో నిర్వాహకులు వాహనం, యజమాని వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. ఇంకా వాహనం ఫోటోలు వివిధ కోణాలలో తీసి అప్‌లోడ్ చేస్తారు. ప్రతీ వాహనం ఇంజన్, చాసిస్ నంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్  ప్రక్రియ పూర్తిచేస్తారు. యజమాని చిరునామా, గుర్తింపు, ఆధార్ పత్రాలు షోరూమ్‌లో స్వీకరిస్తారు. అక్కడే యజమాని సంతకం కంప్యూటర్ ప్యాడ్‌లో ఫీడ్ చేస్తారు. ఆయా షోరూమ్‌లలో పొందుపరిచిన వాహనాలను ఆన్‌లైన్‌లో రవాణా ఉద్యోగులు స్వీకరిస్తారు. యజమాని వివరాలు, పత్రాలు సరిపోల్చి రిజిస్ట్రేషన్ కార్డ్‌ను స్పీడ్ పోస్ట్‌లో చేరవేస్తారు. ఒకవేళ యజమాని పేరుతో మరో వాహన అదనంగా ఉన్నట్టుగా తేలితే షోరూమ్‌లలో టాక్స్ చెల్లించే విధంగా ఇప్పటికే ఉత్తర్వులు అమలులో ఉన్నాయి.
 
యజమానులకు ఊరట
షోరూమ్‌లలో శాశ్వత రిజిస్ట్రేషన్ మంజూరుతో వాహన యజమానులకు ఊరట లభించనుంది. దళారులు, రవాణా కార్యాలయానికి రాకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. రవాణా శాఖ తెలియజేసిన చలానా ధరలు షోరూమ్‌లలో చెల్లించడంతో ఖర్చు తగ్గనుంది. శాశ్వత రిజిస్ట్రేషన్‌ల బాధ్యత షోరూమ్‌లకు అప్పగించడంతో రవాణా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం ఉండదని తెలుస్తోంది.

ఫ్యాన్సీ నంబర్లకు ఈ-టెండరింగ్ విధానం
ఫ్యాన్సీ నంబర్ల మంజూరుకు ఈ-టెండరింగ్ విధానం అమలు చేయాలని రవాణా శాఖ భావిస్తోంది. రిజిస్ట్రేషన్‌కు ముందుగా ఫ్యాన్సీ నంబర్లకు ఆన్‌లైన్‌లో బుకింగ్ జరుపుకోవచ్చు. ఆయా నంబర్లకు ఉంటున్న డిమాండ్‌ను బట్టి ఈ-టెండరింగ్‌లో పోటీపడాలి. ఎక్కువ బిడ్ దాఖలు చేసిన యజమానికి నంబర్ కేటాయిస్తున్నారు. ఇప్పటి వరకు కనీస ధర నిర్ణయించడం పోటీని బట్టి సీల్ టెండర్లు కోరడం జరిగేది. ఇకపై కనీస ధరతోపాటు పోటీ వాతావరణం కల్పించి ఆదాయం రాబట్టడానికి రవాణా శాఖ ఆలోచిస్తోంది. ఇక సాధారణ నంబర్‌లు వాహనం కొనుగోలు సమయంలో వరుస క్రమం ప్రకారం ఆన్‌లైన్‌లో
 కేటాయిస్తారు.   
 

మరిన్ని వార్తలు