రాయబేరాలు

25 Apr, 2014 01:01 IST|Sakshi

టీడీపీ ఇన్‌చార్జి సుజనాచౌదరి కొత్త వ్యూహాలు
 
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం ఎంపీ, జిల్లా ఇన్‌చార్జి సుజనాచౌదరి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కొత్త వ్యూహాలు పన్నుతున్నారు. ఇప్పటికే వివిధ నియోజకవర్గాల్లో పర్యటించి అభ్యర్థుల పనితీరు, వారు చేస్తున్న ఖర్చులను విశ్లేషించిన ఆయన విజయవాడలోని ఒక హోటల్‌లో తన సామాజికవర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులు, నగర ప్రముఖులతో సమావేశం నిర్వహించారు. ఇందులో టీడీపీ నేతలను గెలిపించడమే ప్రధాన అంశంగా చర్చ జరిగిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
 
పుష్కలంగా నిధులివ్వాలని..

జిల్లాలో ‘ఫ్యాను’ గాలి జోరుగా వీస్తుండడం సుజనాకు మింగుడుపడడం లేదు. గతంలో చంద్రబాబు పాదయాత్ర, బస్సుయాత్రలు చేసినప్పుడు, ఇటీవల మహిళాగర్జన సభ నిర్వహించినప్పుడు ఆ పార్టీ నేతలెవరూ భారీగా డబ్బు ఖర్చుపెట్టలేదు. దీంతో ఆ కార్యక్రమాలన్నీ విఫలమయ్యాయి. చంద్రబాబు వివిధ కోణాల్లో పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేసినప్పటికీ కొన్నిచోట్ల గెలిచే పరిస్థితి లేదు. ఇప్పటికే సర్వేలు చేయించుకున్న కొంతమంది అభ్యర్థులు గెలుపుపై అనుమానం ఉన్నచోట్ల డబ్బు ఖర్చుచేయడానికి వెనుకాడుతున్నారు. అధిష్టానం నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేక సతమతమవుతున్నారు. ఖర్చు ఇప్పటికే  కోట్లు దాటడంతో రాబోయే రోజుల్లో ఇంకా ఖర్చుపెట్టాలా అని ప్రశ్నిస్తున్నారు.

ఇలా అయితే పోలింగ్ తేదీనాటికి అభ్యర్థులు ఆర్థికపరంగా కాడి కిందపారేస్తారేమోనన్న అనుమానం వచ్చిన సుజనా ఇప్పటినుంచే వారికి ఆర్థికంగా ఫీడింగ్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఆయన నిర్వహించిన సమావేశంలో ఇదే విషయాన్ని పారిశ్రామికవేత్తలు, ఎన్‌ఆర్‌ఐల వద్ద చర్చించినట్లు సమాచారం. ఒక్కొక్క నియోజకవర్గంపై ఐదారుగురు ఎన్‌ఆర్‌ఐలు, ముఖ్యులు దృష్టిసారించాలని, అక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచేందుకు అన్ని రకాలుగా సహకరించాలంటూ విజ్ఞప్తిచేశారు.
 
పార్టీ ఫండ్ సమీకరణ..
 
రాబోయే ఎన్నికల్లో గెలుస్తామో.. లేదోనన్న అనుమానం టీడీపీ అధిష్టానాన్ని వెంటాడుతోంది. అందుకే ఇప్పట్నుంచే నిధుల సమీకరణకు తెరతీసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల జిల్లాలో జోరుగా సీట్ల విక్రయాలు జరిగాయి. ఇప్పుడు కూడా వివిధ రకాల సమావేశాలు నిర్వహించి సాధ్యమైనంత ఎక్కువ నిధులు రాబడితే పార్టీకి రాబోయే రోజుల్లో ఉపయోగపడతాయని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే సుజనా పార్టీ అభ్యర్థులకు నిధులు ఇవ్వాలని కోరుతూనే.. ఆ వచ్చే సొమ్ములో కొంతభాగాన్ని పార్టీ ఫండ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీకి నేరుగా విరాళాలు ఇవ్వాలని కూడా సూచించినట్లు సమాచారం.
 
ఎన్నికల్లో గెలిస్తే..

 తమ సామాజికవర్గం వారంతా కష్టపడి ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే రాబోయే ఐదేళ్లలో చంద్రబాబు అందరికీ సహాయం అందిస్తారంటూ హామీలు గుప్పిస్తున్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
 

మరిన్ని వార్తలు