గ్రూప్‌–1కు కొత్త సిలబస్‌

22 Jul, 2018 04:32 IST|Sakshi

ముసాయిదా సిలబస్‌ను వెబ్‌సైట్లో పెట్టిన ఏపీపీఎస్సీ

ప్రిలిమ్స్, మెయిన్స్‌ పేపర్లలో పలు మార్పులు

ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు

మెయిన్స్‌లో జనరల్‌ ఇంగ్లిష్‌తో పాటు కొత్తగా తెలుగు సబ్జెక్టు పేపర్‌

ఆగస్టు 3వరకు సలహాలు, సూచనలు స్వీకరణ

అనంతరం తుది సిలబస్‌ ఖరారు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రూప్‌1 కేడర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షలకు కొత్త సిలబస్‌ను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ రూపొందించింది. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సూచనల మేరకు ఈ కొత్త సిలబస్‌ను నిపుణుల కమిటీతో ఏపీపీఎస్సీ తయారు చేయించింది. ఈ ముసాయిదా సిలబస్‌ను తన వెబ్‌సైట్లో కమిషన్‌ పొందుపరిచింది. దీనిపై ప్రజలనుంచి, నిపుణులనుంచి సలహాలు, సూచనలు స్వీకరించిన అనంతరం మార్పులు చేర్పులతో తుది సిలబస్‌ను ఖరారు చేయనుంది. ఆగస్టు 3వ తేదీ వరకు తమ సలహాలు, సూచనలను కమిషన్‌ వెబ్‌సైట్‌ ఠీఠీఠీ.pటఛి.్చp.జౌఠి.జీn ద్వారా పంపించవచ్చని ఏపీపీఎస్సీ వివరించింది.

ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు రిజర్వుడ్‌ కేటగిరీల వారీగా అభ్యర్థుల ఎంపిక
గ్రూప్‌1 ప్రిలిమ్స్, మెయిన్స్‌లో కమిషన్‌ పలు మార్పులు చేసింది.  ప్రిలిమ్స్‌నుంచి అర్హత సాధించిన వారిని మెయిన్స్‌కు ఎంపిక చేయడానికి కటాఫ్‌ మార్కులను నిర్ణయించే అధికారాన్ని ప్రభుత్వం ఇప్పడు కమిషన్‌కు అప్పగించింది. గతంలో ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసేవారు. ఇందులో కేటగిరీలకు సంబంధం లేకుండా అభ్యర్థులు ఎంపికయ్యేవారు. కానీ ఈసారి యూపీఎస్సీ తరహాలో కేటగిరీల వారీగా ఆయా రిజర్వుడ్‌ పోస్టుల సంఖ్యకు అనుగుణంగా అభ్యర్థులను నిర్ణీత నిష్పత్తిలో ఎంపిక చేయనున్నారు. కటాఫ్‌ను నిర్ణయించి 1:15 లేదా అంతకు మరికొంత ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులను పరిమితం చేసి మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు. మెయిన్స్‌లో గతంలో జనరల్‌ ఇంగ్లిష్‌తో పాటు అయిదు సబ్జెక్టులుండేవి.

జనరల్‌ ఇంగ్లిష్‌లో అర్హత మార్కులు సాధించాల్సి ఉండేది. ఇంటర్వ్యూల ఎంపికకు మిగతా అయిదు సబ్జెక్టుల్లో  అభ్యర్థులు సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకునే వారు. ఈసారి మెయిన్స్‌లో పేపర్లను ఏడుకు పెంచారు. జనరల్‌ ఇంగ్లిష్‌తో పాటు తెలుగు పేపర్‌ను పెడుతున్నారు. రెండింటిలోనూ అర్హత సాధించాల్సి ఉంటుంది. అలా అర్హత సాధించిన వారిలో.. తక్కిన అయిదు పేపర్లలో మెరిట్‌ సాధించిన వారిని ఇంటర్వ్యూలకు పిలవనున్నామని ఏపీపీఎస్సీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఉదయభాస్కర్‌ సాక్షికి వివరించారు.

మెయిన్స్‌లో కొత్తగా తెలుగు సబ్జెక్టు..
గ్రూప్‌1 మెయిన్స్‌లో గతంలో జనరల్‌ ఇంగ్లిష్‌తో పాటు అయిదుపేపర్లు డిస్క్రిప్టివ్‌ తరహాలో ఉండేవి. ఇప్పుడు  అదనంగా  తెలుగు సబ్జెక్టును కమిషన్‌ జతచేసింది. జనరల్‌ ఇంగ్లిష్, తెలుగు పేపర్లతో పాటు మరో 5 పేపర్లను అభ్యర్థులు రాయాల్సి ఉంటుంది. ఒక్కో పేపర్‌లో 150 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. 150 నిముషాల సమయాన్ని కేటాయిస్తారు.
- ఇంగ్లిష్‌లో ఎస్సే, లెటర్‌ రైటింగ్, ప్రెస్‌ రిలీజ్, అప్పీల్, రిపోర్టు రైటింగ్, రైటింగ్‌ ఆన్‌ విజువల్‌ ఇన్ఫర్మేషన్, ఫార్మల్‌ స్పీచ్, ప్రిసీస్‌ రైటింగ్, రీడింగ్‌ కాంప్రహెన్షన్, గ్రామర్, ట్రాన్స్‌లేషన్‌ అంశాలపై ముసాయిదా సిలబస్‌ను కమిషన్‌ ఖరారుచేసింది. 
తెలుగులో వ్యాసరచన (ఆయా అంశాలకు సంబంధించి తాత్వికత, ప్రస్తుత వ్యవహారాల ఆధారంగా విశ్లేషణాత్మకంగా ఉండాలి) గద్యం, లేదా కవితను విశ్లేషించడం, వ్యాసాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయడం, ఫార్మల్‌ స్పీచ్, స్టేట్‌మెంటును రూపొందించడం, లేఖ రాయడం, డిబేట్‌ రైటింగ్, అప్లికేషన్‌ రైటింగ్, డైలాగ్‌ రైటింగ్, ఆంగ్లంనుంచి తెలుగులోకి తర్జుమా తెలుగు వ్యాకరణాంశాలపై సిలబస్‌ను కమిషన్‌ రూపొందించింది. 
పేపర్‌1లో జనరల్‌ ఎస్సేలపై ప్రశ్నలుంటాయి. పేపర్‌2లో హిస్టరీ కల్చర్‌ జియోగ్రఫీ ఆఫ్‌ ఇండియా, అండ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంశాలపై ప్రశ్నలుండే వీలుగా సిలబస్‌ను రూపొందించింది.
పేపర్‌3లో పాలిటీ, కానిస్టిట్యూషన్, గవర్నెన్స్, లా, ఎథిక్స్‌ అంశాలపై ప్రశ్నలిస్తారు. ఈ మేరకు ముసాయిదా సిలబస్‌ను  కమిషన్‌ పొందుపరిచింది. పేపర్‌4లో ఎకానమీ, అండ్‌ డవలప్‌మెంటు ఆఫ్‌ ఇండియా అండ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంశాలపై ముసాయిదా సిలబస్‌ను ఖరారు చేసింది. పేపర్‌5లో సైన్సు అండ్‌ టెక్నాలజీ అంశాలపై సిలబస్‌ను పొందుపరుస్తూ కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. 

ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు..
ప్రిలిమ్స్‌లో జనరల్‌ స్టడీస్, జనరల్‌ ఆప్టిట్యూడ్‌ పేపర్లలో ఆబ్జెక్టివ్‌ తరహాలో పరీక్షను నిర్వహించనున్నారు. ఒక్కో పేపర్‌కు 120 మార్కులకు 120 ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. సమయం 120 నిముషాలు. పేపర్‌1లో హిస్టరీ కల్చర్‌ 30 మార్కులకు, కానిస్టిట్యూషన్, పాలిటీ, సోషల్‌జస్టిస్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌కు 30 మార్కులు, ఇండియన్, ఏపీ ఎకానమి, ప్లానింగ్‌కు 30 మార్కులు, జియోగ్రఫీకి 30 మార్కులకు ప్రశ్నలుంటాయి. అందుకు అనుగుణంగా ఆయా అంశాలను ముసాయిదా సిలబస్‌లో పొందుపరిచారు. పేపర్‌2లో జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్, అండ్‌ సైకలాజికల్‌ ఎబిలిటీస్‌లో 60 మార్కులకు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో 30 మార్కులకు, కరెంట్‌ ఈవెంట్స్‌ ఆఫ్‌ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్‌ అంశాల్లో 30 మార్కులకు ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. 

మరిన్ని వార్తలు