ఇట్టే లాగేసి.. అట్లే దించేసి!

2 Nov, 2017 07:48 IST|Sakshi

సబ్‌మెర్సిబుల్‌ మోటార్ల మరమ్మతులో నూతన సాంకేతికత

జీపు లిఫ్ట్‌తో మోటారు తీయడం, దింపడం సులువు

శ్రమ తక్కువ.. సమయమూ ఆదా

రాప్తాడు: జిల్లాలో నీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో చాలా మంది రైతులు బోరుబావులపై ఆధారపడి పంటల సాగు చేపట్టారు. కొన్నేళ్లుగా వర్షాభావం నెలకొనడంతో భూగర్భ జలాలు అడుగంటి బోరుబావులను 500 నుంచి వెయ్యిఅడుగుల లోతు వరకూ తవ్వుతున్నారు. అయినా అరకొర నీరే లభ్యమయ్యేది. కొన్ని రోజులకు ఆ బోర్లు కాస్త వట్టిపోయాయి. ఇలాంటి తరుణంలో బోరుబావి నుంచి విద్యుత్‌ మోటార్‌ వెలికి తీస్తే బోరు పనికి రాకుండా పోతుందని చాలా మంది రైతులు వాటిని అలాగే వదిలేశారు.

వర్షాలతో ఊరట
ప్రస్తుతం ఆశించిన మేర వర్షాలు కురవడంతో బోరుబావుల్లో భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. దీంతో వారం రోజులుగా రైతులు కొత్త బోర్లు వేయించుకోవడంతో పాటు పాత బోర్లలోని విద్యుత్‌ మోటార్ల మరమ్మతులకు పూనుకున్నారు. ఇలాంటి తరుణంలోనే బోరుబావిలోని విద్యుత్‌ మోటార్‌ను వెలికి తీయడం రైతులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. కూలీలు అందుబాటులో లేకపోవడంతో పాటు నాలుగైదు రోజుల పాటు వేచి ఉండాల్సి రావడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొసాగారు.

ఫలించిన ఐడియా
రైతుల ఇబ్బందులు గమనించిన లింగనపల్లికి చెందిన బోరు మెకానిక్‌ వెంకట్రామిరెడ్డి... గతంలో తాను చూసిన సబ్‌ మెర్సిబుల్‌ జీపు లిఫ్ట్‌ను కర్ణాటక నుంచి కొనుగోలు చేసి తీసుకువచ్చాడు. దీని ద్వారా బోరుబావిలో వందల అడుగుల లోతున ఉన్న విద్యుత్‌ మోటార్లను తీయడం, దించడం సులువైపోయింది. కేవలం గంటల వ్యవధిలోనే పని చక్కబెడుతుండడంతో చాలా మంది రైతులు ఈ పని పట్ల ఆకర్షితులవుతున్నారు. శ్రమ తక్కువతో పాటు సమయమూ ఆదా అవుతుండడంతో యాంత్రిక విధానంలో బోర్ల మరమ్మతుకు రైతులు మొగ్గు చూపుతున్నారు.

కేవలం ముగ్గురితో..
గతంలో బోరు నుంచి విద్యుత్‌ మోటార్‌ను తీసి దించాలంటే మెకానిక్‌తో పాటు కనీసం ఐదారుగురు చెమటోడ్చాల్సి వచ్చేది.  అది కూడా అనుకున్న సమయంలో పని చేయడానికి వీలయ్యేది కాదు. కూలీల కొరత తదితర కారణాలతో రైతులు ఒక్కొ సందర్భంలో మూడు, నాలుగు రోజులు నిరీక్షించాల్సి వచ్చేది. ఒకవేళ కూలీలు దొరికినా తీయడానికి నాలుగు గంటలు, తిరిగి దింపడానికి మరో నాలుగు గంటలు సమయం పట్టేది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న సబ్‌మెర్సిబుల్‌ జీపు లిఫ్ట్‌ ద్వారా కేవలం ముగ్గురితో ఒక గంట లోపు మోటార్‌ను తీసి, దించేస్తున్నారు. ఇది రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంది. సమయం ఆదా కావడంతో పాటు పని కూడా వెనువెంటనే ముగిసిపోతోంది.

రోజూ రెండు మోటార్లు రిపేరీ
బెంగళూరు నుంచి రూ.4లక్షలకు ప్రత్యేకంగా సబ్‌మెర్సిబుల్‌ జీపు లిఫ్ట్‌ను కొనుగోలు చేశాను. ఇప్పుడు నాతో పాటు మరో ఇద్దరికి చేతినిండా పని దొరికింది. బోరులోపల కాలిపోయిన మోటార్‌ను వెలికి తీసి, మరమ్మతు చేసిన తర్వాత తిరిగి బోరులో దింపేందుకు రైతుల నుంచి రూ. వెయ్యి చొప్పున తీసుకుంటున్నాం. రోజూ రెండు నుంచి మూడు మోటార్లు వెలికి తీసి మరమ్మతులు చేసి ఇస్తుంటాం.– వెంకట్రామిరెడ్డి, బోర్‌ మోటార్‌ మెకానిక్, లింగనపల్లి

ఇబ్బంది తొలగింది
బోరులో మోటారు కాలిపోతే దాన్ని పైకి తీయాలన్నా దింపాలన్నా చాలా కష్టంగా ఉండేది. డబ్బు ఖర్చు కూడా ఎక్కువే. ఇప్పుడు రైతుల చేతికి మట్టి అంటకుండా జీపుతో వాళ్లే వచ్చి అన్ని పనులూ చక్కపెట్టిపోతున్నారు. చాలా బాగుంది. రైతులకు ఇబ్బంది లేదు. – అమిదాల విశ్వనాథ్, రైతు, రాప్తాడు

మరిన్ని వార్తలు