కొత్తరైళ్లు కూతపెట్టేనా?

8 Jul, 2014 03:40 IST|Sakshi
కొత్తరైళ్లు కూతపెట్టేనా?

ఎన్‌డీఏ ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్‌పై పడమటి మండలాల ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. సీఎం చంద్రబాబు జిల్లా వాసి కావడం, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు మదనపల్లె డివిజన్‌తో మంచి అనుబంధం ఉండడంతో ఈ దఫా బడ్జెట్‌లో కొత్తరైళ్లు కూతపెట్టడం ఖాయమని భావిస్తున్నారు. వీరి ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో వేచి చూడాలి మరి.
 
మదనపల్లె సిటీ : తిరుపతి-పాకాల-గుంతకల్లు మధ్య అన్ని రైల్వే స్టేషన్లూ ప్రయాణికులతో కిటకిటలాడుతుంటా యి. అయితే తిరుపతి-గుంతకల్లు మార్గంలో చాలినన్ని రైళ్లులేవు. నడుస్తున్న రైళ్లకు బోగీలు తక్కువగా ఉండడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. లగేజీ బోగీల్లో వేలాడుతూ ప్రయాణం సాగిస్తున్నారు.

2010 జూన్‌లో తిరుపతి నుంచి సీటీఎం మీదుగా కొత్త బ్రాడ్‌గేజ్ మార్గాన్ని ప్రారంభించారు. ప్రసుత్తం ఈ మా ర్గంలో తిరుపతి-గుంతకల్లు మధ్య పగలు రెండు, రాత్రి రెండు ప్యాసింజర్ రైళ్లు నడుస్తున్నాయి. బుధ, గురువారాల్లో పద్మావతి ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడుస్తోంది. అమరావతి ఎక్స్‌ప్రెస్ వారానికి రెండు రోజు లు నడుస్తోంది. అయినా మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. సీటీఎం రైల్వేస్టేషన్ నుంచి రోజూ 800 మంది రైళ్లల్లో ప్రయాణిస్తున్నారు.

గతంలో రోజూ తిరుపతి-హైదరాబాద్ మధ్య వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్  తిరుగుతుండేది. ఈ మార్గంలో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ పునరుద్దురిస్తామని, హైదరాబాద్-తిరుపతి మధ్య కొత్త రైలు ఖాద్రి ఎక్స్‌ప్రెస్ పేరిట నడుపుతామని పార్లమెంటు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు బ్రాడ్‌గేజ్ ప్రారంభ సమయంలో హామీలు గుప్పించారు. వీటిని చూసి స్థానిక ప్రజలు మురిసి పోయారు. ఆతరువాత ఆ ఊసే లేకుండా పోయింది.  ఈ బడ్జెట్‌లో నడుస్తున్న రైళ్లకైనా అదనపు బోగీలు ఏర్పాటు చేస్తారోలేదోనని పలువురు ఎదురు చూస్తున్నారు.
 
దారి మళ్లిస్తే 100 కి.మీ దూరం తగ్గుతుంది

ముంబాయి నుంచి రేణిగుంట మీదుగా కన్యాకుమారి వెళుతున్న జయంతి ఎక్స్‌ప్రెస్ గుంతకల్లు మీదుగా మళ్ల్లిస్తే కన్యాకుమారి-ముంబై మధ్య వంద కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ప్రస్తుతం చిత్తూరు నుంచి కడప మీదుగా సికింద్రాబాద్ వెళుతున్న వెంకట్రాది ఎక్స్‌ప్రెస్ రైలుతో పాటు మరికొన్ని రైళ్లను పాకాల-ధర్మవరం మీదు గా మళ్లించాలని అధికారులు ప్రతిపాదించినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఈ ప్రతిపాదనను ఈ రైల్వే బడ్జెట్లోనైనా అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
 
తాత్కాలిక బడ్జెట్‌లో ఏముంది!
యూపీఏ ప్రభుత్వం ఇంటి దారి పట్టేముందు ఆదరాబాదరాగా ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో పడమటి మండలాలకు మొండి చేయి చూపింది.
 
కడప-బెంగళూరు రైల్వేలైను పనుల మాటేంటి?
 
కడప-మదనపల్లె వయా బెంగళూరు రైల్వే లైను పనులు ప్రశ్నార్థకంగా మారాయి. కడప నుంచి లక్కిరెడ్డిపల్లె, రాయచోటి, మదనపల్లె, పుంగనూరు, రామసముద్రం మీదుగా బెంగళూరుకు రైలుమార్గం ఏర్పాటు చేసేందుకు ఐదేళ్ల క్రితం రైల్వేశాఖ పచ్చజెండా ఊపింది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల ప్రయాణికులకు రైల్వే సౌకర్యం కల్పించేలా సర్వే చేయించారు. 350కిలో మీటర్లు ఉన్న ఈ మార్గంలో రైలు నడిపితే కడప, బెంగళూరు మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడుతాయని భావించారు.

సుమారు రూ.1080 కోట్ల అంచనాతో ఈ మార్గానికి శంకుస్థాపన చేశారు. అయితే ప్రతి ఏటా బడ్జెట్‌లో చాలినన్ని నిధులు మంజూరు చేయడంలేదు. 2010 బడ్జెట్‌లో రూ.40 కోట్లు, 2011లో రూ.56 కోట్లు, 2012లో రూ.60 కోట్లు కేటాయించారు. 2013లో మొండి చెయ్యి చూపారు. 2014 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో దీని ప్రస్తావనే రాలేదు. అరకొర నిధులతో సర్వే, మార్గంలోని రాళ్లు, చెట్లను తొలగించేందుకు సరిపోతోంది. ఈ రైల్వే లైను సర్వే పనులు వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి వరకు జరిగాయి. మరిన్ని నిధులు కేటాయించాల్సి ఉంది.
 

మరిన్ని వార్తలు