ఎదురుచూపులు

29 Aug, 2018 08:43 IST|Sakshi
వ్యవసాయ అవసరాలకు వినియోగిస్తున్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌

రాయచోటి రూరల్‌(వైఎస్సార్‌ కడప): నూతనంగా రైతులు వేసుకున్న బోర్లకు విద్యుత్‌ కనెక్షన్లు, కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల కోసం అన్నదాతలు ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. గత ఏడాది మార్చి, ఏప్రిల్‌ మాసాల్లోనే అవసరమైన కనెక్షన్ల కోసం వినియోగదారులు నగదు చెల్లించినప్పటికీ ఏడాది కంటే ఎక్కువ రోజులు గడిచినా ఇంత వరకు నూతన కనెక్షన్లు రాలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సాగు నీరు లేకపోవడంతో లక్షలకు లక్షలు అప్పులు చేసి పొలాల్లో వేసుకున్న బోరుబావులకు విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో నిరుపయోగంగా ఉండిపోయాయని, అరకొర నీరున్నా పంటలు పెట్టుకునే పరస్థితి లేక రైతులు దిగాలు చెందుతున్నారు. 2017 ప్రారం భం నుంచి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ అవసరాల కోసం 6,245 మంది దరఖాస్తులు చేసుకుంటే , 2,035 మందికి మాత్రమే విద్యుత్‌ కనెక్షన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు అందజేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మిగిలిన 4,215 మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరులో అధికారపార్టీ నాయకుల జోక్యం..
దరఖాస్తులు చేసుకున్న వినియోగదారులకు క్రమపద్ధతిలో విద్యుత్‌ కనెక్షన్లు ఇస్తున్నామని అధికారులు చెబుతున్నా, మరో వైపు మాత్రం అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్న వారికి మాత్రమే ట్రాన్స్‌పార్మర్లు వస్తున్నాయని, మరో వర్గానికి ఏళ్ల తరబడి ఎదురు చూసినా ఫలితం లేకుండా పోతోందని కొందరు రైతులు విమర్శిస్తున్నారు. విద్యుత్‌ కనెక్షన్లకు అవసరమైన నగదు ముందే చెల్లించినప్పటికీ సరఫరా అందించడంలో అధికారులు పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారని , ఇలా అయితే మనుగడ సాధించడం కష్టమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ట్రాన్స్‌ఫార్మర్లను మంజూరు చేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ట్రాన్స్‌కో అధికారులకు ఉంది.

 అన్నదాతలకు మిగిలిన అప్పులు...
వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలోని పలు ప్రాం తాల్లో రైతులు కనీసం బోరుబావుల్లో వచ్చే అరకొర నీటితో నైనా పంటలు సాగు చేసుకోవాలని ఆశపడుతున్నారు. రూ.2–3లక్షలు అప్పు చేసి ఆశగా బోర్లు వేసుకున్నారు. అందులో నీరున్నా ప్రస్తుతం విద్యుత్‌ సరఫరా పొందలేకపోతున్నామని, అదనంగా మరి కొంత నగదు విద్యుత్‌ అధికారులకు చెల్లించినా ట్రాన్స్‌ఫార్మర్ల మంజూ రు ఆలస్యం అవుతోందని వాపోతున్నారు.

ఇబ్బందులు పడుతున్నాం
వ్యవసాయ బోర్‌కు అవసరమైన విద్యుత్‌ కనెక్షన్‌ కోసం 2017 జూన్‌ 7వ తేదీన ధరఖాçస్తు చేసుకుని, అదే రోజు రూ.28వేలు అధికారులకు చెల్లించాం.ఇప్పటి వరకు మాకు ట్రాన్స్‌ఫార్మర్‌ రాలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఉన్న 7 ఎకరాల పొలాన్ని బీళ్లు పెట్టుకున్నాం.చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నాము. ఇప్పటికైనా ట్రాన్స్‌ఫార్మర్‌ను మంజూరు చేయాలి.– రామకృష్ణ, రైతు, చెంచురెడ్డిగారిపల్లె

ఆయిల్‌ ఇంజిన్‌తోనే నీటి తడులు వేసుకుంటున్నాం
విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో ఆయిల్‌ ఇంజిన్‌తోనే నీటి తడులు వేసుకుంటున్నాం. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్, ట్రాన్స్‌ఫార్మర్‌ కావాలని గత ఏడాది జూన్‌ 5వ తేదీన రూ.24లు చెల్లించాం. అయినా ఇవ్వలేదు.దీంతో అధిక మొత్తం ఖర్చు చేసి ఆయిల్‌ ఇంజిన్‌తోనే పొలానికి నీళ్లు వేసుకుంటున్నాము.అధికారులు రైతులను ఆదుకోవాలి. – కృష్ణయ్య, రైతు, చెంచురెడ్డిగారిపల్లె

సెప్టెంబర్‌ నెలాఖరుకు టార్గెట్‌ పూర్తి చేసేందుకు కృషి
జిల్లాలో ఇప్పటి వరకు 2వేల మంది వినియోగదారులకు వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు అందించాము. మరో 4వేల దరఖాస్తులు మా వద్ద ఉన్నాయి. సెప్టెంబర్‌ నెలాఖరుకు టార్గెట్‌ పూర్తి చేయాలని నిర్ణయించాం. అందరికీ ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ కనెక్షన్లు ఇస్తాం. ఇందులో రాజకీయ నాయకుల జోక్యం ఏ మాత్రం లేదు. మాపైన ఎవరి ఒత్తిడీ లేదు. – శివప్రసాద్‌ రెడ్డి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ, వైయస్సార్‌ జిల్లా

మరిన్ని వార్తలు