అరసవల్లి ఆలయ ‘ట్రస్ట్‌’ బోర్డుకు గ్రీన్‌ సిగ్నల్‌!

1 Oct, 2019 08:07 IST|Sakshi
అరసవల్లి ఆదిత్యుని నిలయం 

సాక్షి, అరసవల్లి(శ్రీకాకుళం) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి ఆలయానికి మంచి రోజులు రానున్నాయి. వార్షికాదాయం రూ.కోటి నుంచి రూ.5 కోట్ల వరకున్న ఆలయాల ధర్మకర్తల సభ్యుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 2011లో అరసవల్లి ఆలయానికి ట్రస్ట్‌ బోర్డును ఏర్పాటు చేశారు. నాటి రెవెన్యూ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చొరవతో ట్రస్ట్‌ బోర్డు దిగ్విజయంగా పనిచేసింది. స్థానిక ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు హయాంలోనే మళ్లీ ఆలయానికి ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటుకు ఉత్తర్వులు వచ్చాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం అక్టోబర్‌ 20 తేదీలోగా ఆసక్తి గల సభ్యులు ధృవీకరణలతో కూడిన ఫారం–2ను నింపి ఆలయ సహాయ కమిషనర్‌కు అందజేయాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం మాత్రమే ట్రస్ట్‌ బోర్డులో స్థానం కల్పించాల్సి ఉంటుంది.   

నిబంధనల ప్రకారమే నియామకాలు  
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 25 ఆలయాలకు ట్రస్ట్‌ బోర్డులను నియామకాలు చేపట్టేలా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో అరసవల్లి కూడా ఉంది. ఇక్కడ ఎక్స్‌ అఫీషియో సభ్యుడు, తొమ్మిది మంది ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉంది. ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌గా ధర్మకర్త వ్యవహరించనున్నారు. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన వారికి 50 శాతం వరకు రిజర్వేషన్లు కల్పించనున్నాం. దరఖాస్తులను  పరిశీలించి ప్రభుత్వానికి, దేవదాయ శాఖ కమిషనర్‌కు నివేదిస్తాం.  
– వి.హరిసూర్యప్రకాష్, ఆలయ ఈవో 

మరిన్ని వార్తలు