శిరీష కేసులో కొత్త కోణం

6 Oct, 2017 14:54 IST|Sakshi

పట్నంబజారు(గుంటూరు): విద్యార్థులను ఇటలీకి పంపిన వీసాల కేసులో గత 18న ఆత్మహత్యకు పాల్పడిన ఇంటూరి శిరీష (29) కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. సుమారు రెండు వందల మంది విద్యార్థులకు సంబంధించిన వీసాల విషయంలో ముంబైలోని కన్సల్‌టెన్సీ నకిలీదని పోలీసులు గుర్తించారు. గత కొద్ది రోజుల క్రితం గుంటూరు పాతగుంటూరుకు చెందిన పోలీసులు ముంబై వెళ్లారు.

అయితే ముంబైలోని మెహాతారోడ్‌ కృష్ణకుంజ్‌ ప్రాంతంలో ఉన్న గగన్‌దీప్‌ కార్యాలయానికి వెళ్లిన గుంటూరు పోలీసులు సైతం కంగుతున్నారు. పూర్తిస్థాయిలో గుంటూరుకు పంపని వీసాలకు తమకు ఎటువంటి సంబంధంలేదని గగన్‌దీప్‌ కన్సల్‌టెన్సీ నిర్వాహకులు తెలిపినట్లు సమాచారం. కనీసం పోలీసులకు విజిటింగ్‌ కార్డు కూడా ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలిసింది.

ఎటువంటి సమాచారం ఇచ్చేందుకు నిర్వాహకులు అంగీకరించకపోవటంతో పోలీసులు వెనుదిరిగి వచ్చేశారని చెబుతున్నారు. ఈ క్రమంలో విచారణపై మరింత దృష్టి సారించిన పోలీసులు ముంబై నుంచి గుంటూరుకు వచ్చిన కొరియర్‌ ఆధారంగా అక్కడి కొరియర్‌ కార్యాలయాన్ని కూడా పరిశీలించినట్లు సమాచారం. ఆయా సంస్థల నిర్వాహకుల నుంచి సమాచారం కొరవడటంతో సదరు పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్లు సమాచారం. ఇటలీలో ఉన్న తలశిల కిషోర్‌ను ఇక్కడికి తీసుకొచ్చేందుకు ఢిల్లీలో సీఐడీ బృందంతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.

మరి వీసాలు ఎలా వచ్చాయి?
ముంబైలో గగన్‌దీప్‌ కన్సలెటెన్సీ, కొరియర్‌ కార్యాలయ నిర్వాహకుల నుంచి కొద్దిపాటి సమాచారం ఆధారంగా కొరియర్‌ ద్వారా కూడా వీసాలు వచ్చేందుకు అవకాశంలేదని, శిరీషను మోసం చేసిన వ్యక్తులే కొరియర్‌లా నకిలీ వీసాలను పంపి ఉంటారనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఫోన్‌కాల్‌ డేటా ఆధారంగా నకిలీ వీసాలు తయారు చేసిన వ్యక్తులను పట్టుకునే పనిలో పోలీసులు వర్గాలు చర్యలు చేపడుతున్నారు.

మరిన్ని వార్తలు