రేషన్‌కు కొత్త మెలిక

23 Mar, 2016 01:50 IST|Sakshi

ఈ-పోస్ మెషీన్‌లో వేలిముద్రలు నిక్షిప్తం
 40 లక్షల మంది ముందుగా నమోదుచేస్తేనే ఏప్రిల్ సరుకులు అందజేత
 ఆందోళనలో కార్డుదారులు, డీలర్లు

 
మచిలీపట్నం : జిల్లాలో తెల్లకార్డుపై రేషన్ సరుకులు తీసుకోవాలంటే ప్రభుత్వం కొత్త నిబంధన పెట్టింది. కార్డులో పేర్లున్నవారంతా ఈ నెలలో  రేషన్ తీసుకునే డిపో వద్దకు వెళ్లి అక్కడి ఈ-పోస్ మెషీన్‌లో తమ వేలిముద్రలను నమోదుచేయాలి. వచ్చే నెల నుంచి కుటుంబంలో ఎవరైనా వెళ్లి సరుకు లు తెచ్చుకోవచ్చు. ఈ ప్రక్రియను మంగళవారం ప్రారంభించినట్లు  జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వేమూరి రవికిరణ్ ‘సాక్షి’కి తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న రేషన్ షాపుల్లోని ఈ-పోస్ మెషీన్లకు సక్రమంగా సిగ్నల్స్ అందకపోవడం, కొందరి వేలిముద్రలు సరిగా నమోదు కాకపోవడం వంటి ఇబ్బందులు ప్రతినెలా ఎదురవుతున్నాయి. దీంతో కార్డుదారులకు సరుకుల పంపిణీలో ఆలస్యమవుతోంది. ఒక కార్డులో నలుగురు సభ్యుల పేర్లుంటే వారంతా కచ్చితంగా రేషన్ షాపు వద్దకు వెళ్లి  తమ వేలిముద్రలను ఈ-పోస్ మెషీన్‌లో ఇస్తేనే  ఏప్రిల్ నెలకు సంబంధించిన సరుకులు అందుతాయని రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. కార్డులో పేర్లు ఉన్న వారి నుంచి వేలిముద్రలను సేకరించాలని అధికారులు ఇప్పటికే రేషన్ డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు.

ఎప్పటికి పూర్తయ్యేను!
జిల్లాలో తెల్ల కార్డులు 10,62,444, అంత్యోదయ అన్న యోజన (ఏఏవై) కార్డులు 67,359, అన్నపూర్ణ కార్డులు 494.. మొత్తం  11,30,297 కార్డులున్నాయి. 2,160 రేషన్ షాపుల ద్వారా ప్రతినెలా సరుకులు అందజేస్తున్నారు. ఇవికాక గులాబీ కార్డులు 1,63,691 ఉన్నాయి. తెల్ల కార్డులు ఇచ్చే సమయంలో సంబంధిత కార్డులోని సభ్యుల వేలిముద్రలు సేకరించలేదు. ఆధార్ కార్డులు మంజూరు చేసినప్పుడు ఆయా కుటుంబాల్లోని సభ్యుల వేలిముద్రలను సేకరించి రేషన్ కార్డులకు వీటిని అనుసంధానం చేశారు. ఇప్పటివరకు రేషన్ షాపునకు కుటుంబసభ్యుల్లో ఒకరు వెళ్లి వేలిముద్ర వేస్తే సరుకులు ఇస్తున్నారు. ఈ విధానాన్ని ప్రస్తుతం మార్పుచేశారు. తెల్ల కార్డులు 11 లక్షలకు పైగా ఉండగా దాదాపు 40 లక్ష ల మంది ఈ-పోస్ మెషీన్‌లో వేలిముద్రలు నమోదు చేయించుకోవాల్సి ఉంది.  వీరంతా ఎప్పటికి రేషన్ షాపులకు వస్తారు, ఎప్పటికి ఈ ప్రకియ పూర్తవుతుందో అధికారులకే తెలియాల్సిఉంది. వేలిముద్రల సేకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత సరుకులు ఇస్తామనే నిబంధన విధిస్తే పేదలు ఇబ్బందులు పడ తారనే వాదన వినిపిస్తోంది.
 
వృథా అయిన డీడీలు
జిల్లాలోని 2,160 రేషన్‌పాపుల ద్వారా ప్రతినెలా 10, 15 తేదీల్లోగా సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఇది పూర్తయ్యాక మరుసటి నెలకు సంబంధించి సరుకుల కోసం డీలర్లు 15లోగా డీడీలు తీయాల్సి ఉంది. పాత పద్ధతిలోనే డీలర్లు ఈ నెలలో డీడీలు తీశారు. అయితే అవి చెల్లుబాటు కావని, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజరు బ్యాంకు ఖాతాకు  నగదును  జమ చేయాలని  పౌర సరఫరాలశాఖ అధికారులు  చెప్పారు.  ఈ విషయం ముందుగానే చెబితే తాము జాగ్రత్తపడేవారమని డీలర్లు  అంటున్నారు. ఏప్రిల్ నెలకు సంబంధించి సరుకుల కోసం  డీడీలు తీసి అధికారులకు అందజేశామని, వాటినలా ఉంచి మళ్లీ సరుకుల కోసం నగదు చెల్లించాలని అధికారులు చెబుతుండడంతో తమపై ఆర్థికభారం పడుతోందని డీలర్లు వాపోతున్నారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా