కొత్త ఓటర్ల నమోదు మొదలు

2 Sep, 2019 04:04 IST|Sakshi

అక్టోబర్‌ 15 వరకు జాబితాలో మార్పులు చేర్పులు

రాష్ట్రవ్యాప్తంగా 11వేల సహాయ కేంద్రాల ఏర్పాటు

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె. విజయానంద్‌ 

సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం, కొత్త ఓటర్ల నమోదు ఆదివారం ప్రారంభమైంది. ఈ ప్రక్రియ అక్టోబర్‌ 15 వరకు 45 రోజులపాటు కొనసాగుతుంది. ఇందుకోసం రాష్ట్రంలో 11వేల సహాయ కేంద్రాలు ఏర్పాటుచేశారు. వచ్చే ఏడాది జనవరిలో తప్పుల్లేని తుది జాబితా ప్రచురణ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె. విజయానంద్‌ కోరారు. నగరంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఓటర్ల సహాయ కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే ఓటర్లుగా నమోదైన వారు జాబితాలో తమ వివరాల్లోని తప్పులను సరిచేసుకోవడానికి ఇది చక్కని అవకాశమన్నారు.

రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్‌ కార్యాలయంతోపాటు డివిజన్‌ స్థాయిలోను, తహశీల్దార్‌ ఆఫీసుల్లో ఏర్పాటుచేసిన సహాయ కేంద్రాల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని విజయానంద్‌ వెల్లడించారు. అలాగే, బూత్‌ లెవెల్‌ అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితా పరిశీలిస్తారని వివరించారు. జాబితాలో మార్పులు, చేర్పుల కోసం పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్సు, ఆధార్, రేషన్‌కార్డు, ప్రభుత్వ అనుబంధ సంస్థలు జారీచేసే గుర్తింపు కార్డులు, బ్యాంకు పాస్‌బుక్, రైతు గుర్తింపు కార్డు వంటి ఏదో ఒక కార్డుతో ఎన్నికల సిబ్బందిని సంప్రదించాలన్నారు. 

ఇంటి నుంచే మార్పులు, చేర్పులు
ఇదిలా ఉంటే.. నేషనల్‌ ఓటర్స్‌ సర్వీస్‌ పోర్టల్, ఓటర్స్‌ హెల్ప్, 1950 కాల్‌ సెంటర్‌ ద్వారా ఇంటి నుంచే తగిన మార్పులు చేసుకోవచ్చని కె. విజయానంద్‌ తెలిపారు. ఎన్నికల సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారించిన అనంతరమే సవరణలు చోటుచేసుకుంటాయన్నారు. కాగా, మార్పుల చేర్పులు కోసం ఫారం–8  ద్వారా దరఖాస్తులను సమర్పించుకోవచ్చని ఆయన చెప్పారు. మరణించిన, చిరునామా మారిన ఓటర్ల కోసం ఫారం–7 అందుబాటులో ఉంటుందన్నారు. 2020 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఫారం–6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని ఆయనన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.మాధవీలత, డీఆర్‌ఓ ఏ ప్రసాద్‌ విజయవాడ ఇన్‌చార్జి సబ్‌కలెక్టర్‌ చక్రపాణి పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు