అవినీతిపరుల భరతంపడతాం

6 Jan, 2014 00:51 IST|Sakshi

ఆలంపల్లి, న్యూస్‌లైన్: అవినీతి అధికారుల భరతంపడతామని, చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) డీజీ ఏకే ఖాన్ పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్ సమీపంలో హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ క్యాంపస్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘న్యూస్‌లైన్’తో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అవినీతిపరుల చిట్టాను రూపొందించే క్రమంలో వివిధ శాఖలవారీగా సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలిపారు. తిమింగలాల్ని వదిలేసి చిన్న చేపలను పడుతున్నారని వస్తున్న ఆరోపణలపై మాట్లాడుతూ.. ‘ చిన్న పెద్ద అధికారి అనే తేడా లేదు.. తప్పు ఎవరు చేసినా తప్పే కదా’ అన్నారు.
 
 అవినీతి వ్యవహారాల్లోనూ చాలావరకు సుమోటోలుగా కేసులు నమోదు చేస్తున్నట్లు ఏసీబీ డీజీ తెలిపారు. తమ శాఖలో సిబ్బంది కొరత ఉందని, ప్రస్తుతం ఉన్నవారితో నెట్టుకొస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఖాళీల జాబితాను రూపొందిస్తున్నాం.. త్వరలో నియమాకాలు చేపడతామని ఏకే ఖాన్ చెప్పారు. అవినీతిని కూకటివేళ్లతో పెకిలిస్తామని, ఇందుకు ప్రజలు కూడా ఏసీబీతో సహకరించాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు